Home తాజా వార్తలు పోలీసులపై తప్పుడు ఆరోపణలు సరికాదు : సిపి జోయ‌ల్ డేవీస్

పోలీసులపై తప్పుడు ఆరోపణలు సరికాదు : సిపి జోయ‌ల్ డేవీస్

Siddipet CP Joel Davis Press Meetసిద్దిపేట : సిద్దిపేటలో సోమవారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సిద్దిపేట సిపి జోయల్ డేవీస్ అన్నారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకే తాము బిజెపి అభ్యర్థి రఘునందరావు బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశామని సిపి వెల్లడించారు. మంగళవారం సిపి జోయల్ డేవీస్ మీడియాతో మాట్లాడారు.  ఎగ్జిక్యూటివ్ అధికారి సె‌ర్చ్ వారెంట్ ఇచ్చిన అనంతరమే సోదాలు చేశామని ఆయన స్పష్టం చేశారు. సోదాలపై అధికారులు పంచనామా తయారు చేశారని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్ బ‌య‌ట‌కు వ‌చ్చే సమయంలో బిజెపి శ్రేణులు దాడికి దిగారని ఆయన పేర్కొన్నారు. పోలీసులే డబ్బు పెట్టినట్టు ఆరోపణలు చేయడం సరికాదని, తాము ఎన్నికల సంఘం నిబందనల ప్రకారమే పని చేస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు. బిజెపి నేతలు, కార్యకర్తలు ఎక్కువ మంది ఉండడం వల్లనే డబ్బును లాక్కెళుతున్నా అడ్డుకోలేకపోయామని ఆయన వివరించారు. సిద్దిపేటలో జరిగిన ఘటనలో ఐదుగురు నిందితులను గుర్తించామని, ఇంకో 20 మందిపై కేసులు పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్ రావు ఇంట్లోనే జరిగిందని ఆయన వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్ ఫిర్యాదుతో తాము కేసు న‌మోదు చేశామ‌ని సిపి చెప్పారు. నాలుగు చోట్ల సోదాలు చేయగా , సురభి అంజన్ రావు ఇంట్లోనే నగదు దొరికిందని ఆయన వెల్లడించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సిద్దిపేటకు రావొద్దని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కోరామని సిపి పేర్కొన్నారు. కానీ ఆయన తమ మాటలను పట్టించుకోలేదని, బండి సంజయ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని సిపి తేల్చి చెప్పారు. పథకం ప్రకారమే పోలీసులపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని సిపి కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పక్కా ఏర్పాట్లు చేశారని ఆయన తెలిపారు. ప్రతిఒక్కరు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.