Home కలం కవిత్వానికి ‘నడక బోనం’

కవిత్వానికి ‘నడక బోనం’

Sampadakiyam         సిద్దిపేట కవులకు ప్రసిద్ధిపేట. కవిత్వానికి నెలవైన చోట వారసత్వంగా కవిత్వాన్ని అందిపుచ్చుకున్నవారు కవులు కావడం సహజం. కవిత్వం రాయడం అబ్బిన కొందరు ఎపుడు రాసే వారు, అపుడపుడు రాసేవారు, రాయకుండావుండలేని కవులుంటారు. సామాజికస్పృహతో రాసేకవుల కవిత్వం సామాజికపరిణామాలతో కలిసి నడుస్తుంది. వీటన్నిటికి మినహాయింపుగా కూడా రాసే కవులుంటారు.1981లో తన కవితాసంపుటి ‘గీతాయుధం’ ను ప్రచురించిన పిదప జర్నలిస్టు వృత్తిలో నిమగ్నమైపోయిన కొమురవెల్లి అంజన్న 2018లో ‘నడకబోనం’తో కవిగా పునరవతరించడం నిద్రాణమైన అగ్నిపర్వతవిస్ఫోటనం వంటిదే. 38సం.ల తర్వాత 70 కవితల ఈ సంకలనంలో కవిత్వం లావాప్రవాహంలెక్క వేడిగా, వాడిగా వుంది.

కవితాసంకలనం పేరే ఆలోచనీయం…బోనం అంటే అమ్మదేవతలకు పెట్టే బువ్వపండుగ కదా. రైతులు తమపొలాల దగ్గర ‘అలుకుబోనం’, ‘పంటబోనం’ పెడుతుంటారు. నడకనే బోనం చేసి ఎవరికి పెడుతున్నారు.
“తెల్లవారంగనే
నడక బోనమెత్తుకుని బయలుదేరుతా’ నంటాడు కవి. ఈ నడక బోనం ‘మార్నింగ్ వాకింగ్’దా.
‘కాళ్ళకు దీపాలు వెలిగించుకుని
మొక్కులు చెల్లిస్తారు ఆరోగ్యదేవతకు’… నడకబోనం ఆరోగ్యదేవతకు…బాగుంది ఊహాశాలీనత.
కవి తానన్నట్టుగ నడకబోనం ‘జనజాగరణ పదాల పాదయాత్ర’గా అవతరిస్తే…సామాజిక జాగరణకు హేతువవుతుంది.
46 కవితల సంకలనం ‘గీతాయుధం’(1981)లో అంజయ్య
‘నిన్న మొక్క తొడిగిన మొగ్గ
తనరెక్కలు విప్పి
నా ముందర నవ్వుతుంది’ అంటారు… అదిప్పుడు నడకబోనమై విరబూసిన కవితాసంకలనమైంది.
తన కవితా‘శిల్పం చేతిలో చైతన్యశిఖను నిల్పుతుంది’ వాగ్దానం చేస్తున్నాడు.
తన అక్షరాలు
‘ఆలోచనలకు దుగోడాపట్టి
స్వేచ్ఛకు రూపం పొయ్యమంటున్నాయం’టాడు. అందుకోసం ‘వెలుతురుపోచలతో కొరడా పేనుతు’న్నానని, ఎన్ని అలల్ని ఉరేసినా, మళ్ళీ, మళ్ళీ ఉత్పత్తిచేస్తూనే వుంటుంది సముద్రం… మెదడు కల్వంలో ఆలోచనలు నూరబడందే పరిష్కారం మొలకెత్తదు.. కథంతా గడవందే తూర్పు గర్భిణి నొప్పుల్ని మానదు’ అని దృక్పథాన్ని వివరించాడు గీతాయుధం కవితల్లో అంజయ్య.
కొత్తకవితాసంకలనం నడకబోనంలో
నడకబోనం-
తెల్లవారంగనే /నడకబోనమెత్తుకునిబయలుదేరుతా
కరీంనగర్, మెదక్, నల్గొండ, వరంగల్ జిల్లాలనుంచి దుబాయ్(పేరు దుబాయి కానీ తీరొక్క పెట్రోలు దేశాలకు) పోయిన వలసజీవులు ఎంతోమంది. కరీంనగర్ మెట్పల్లి ఏరియాలో దుబాయ్ పోయెటోల్లకు అప్పిచ్చిన పైసలకు ‘…వడ్డీ’ అని 10 నుంచి 20రూ.ల దాకా వడ్డీ వసూలు చేసేవారు. ఉన్నదే అప్పుల బతుకు. దాంట్ల మళ్ళీ అప్పుచేసి దళారుల మాటలకు ఉన్నయమ్ముకుని దుబాయి పోతే, అక్కడ మోసమే. పని దొరకదు. దొరికినా ఏజంట్లకే చాలదు. అక్కడ నెనరులేని పెట్రోలుబావుల యజమానులు. పని దొరకక, తిండి లేక, ఎన్నైనా, ఎటువంటి పనులైనా చేసి..ఎట్లనో ప్రాణాలు పోడగొట్టుకుంటరు. ఇంటికి ఐస్ పెట్టెలో పార్సిలై వస్తారు… అప్పులై తీర్చింది లేదు. కాని,బతికున్నోల్లకు అప్పులు పంచి మరీ కాలిపోతరు. ఈ విషాదభరితమైన వలసబతుకుల మీద అంజయ్య కలం గొప్ప ‘వలసగతుకులు’ కవితను రాసింది….
అప్పుల కుంపట్ల ఊదు పొగేసి వెళ్తున్నా/ఎడబాటు గుండెల్ని బండకేసి బాదినా
-ఇంటిబండి నడిపే ఒంటెద్దును
రేపటి వెలుతురు పిల్లలకోసం /కలలబంగారం పండించడం కోసం/కొలవలేని దూరంలో మనం/కలల్ని నిట్టనిలువునా దోచుకున్న దళారి/ ఒప్పుకోదు మనసు ఘర్ వాపసీకి
–వలసబతుకు దుర్బరం
దేశం కాని దేశం పంపిన కానుక/పెద్దపెట్టెలో ఐసుబుట్టలా దేహం/
అప్పులు చేసి వెళ్ళిన శరీరం/ అప్పులు పంచి మరీ బూడిదయింది
బతికున్నామా?
కళ్ళముందు అన్యాయం/త్రీడీ కంటే స్పష్టాతిస్పష్టం/….నోళ్ళు కుట్టేసుకున్నాం/ కాళ్ళు భూమికి అతికేసుకున్నాం
…ఇక్కడ ప్రశ్నల చేతివేళ్ళు ముడుచుకోవు/నిజం నిప్పుల మీదైనా నడిపించడం నేరం
….నిద్ర నటించడంలో అవార్డు గ్రహీతలం/ మనల్నెవరు లేపుతారు
సిగ్గుతో నాశవాన్ని నేనే మోసుకెళ్తున్న..దీవించండి…
‘అయ్యో పాపం’ కవితలో రైతు బతుకును చిత్రించాడు. రైతు అలుకుబోనం చేసిన నుంచి పంటబోనం చేసేదాక విసుగులేకుంట కష్టపడ్తడు. కాని, చేసిన పని, పడ్డ కష్టం ఫాయిదా యియ్యకపోతే…ఏం జేస్తడు?
‘రైతేమన్న రాజరాజేశ్వరుడా
బొందిల విషంతో బతుకెన్నాళ్ళు
పలుపుతాళ్ళు, పురుగుమందులు సుట్టాలై
రైతును మాయం జేసినై’ అంటాడొకచోట.. రైతు గొంతుల విషం పెట్టుకుని కానిగోసలు తీస్తడు. గోసకు ఫలితం లేకపోతే కడుపులకు విషం తాగి చస్తడు. తాను పేనిన పగ్గమే ఉరితాడు చేసుకుంటడు.
రైతు మరణాల గురించి ఎందరో కవితలు రాసారు. అంజయ్య కవితలో ఉపమానం కొత్తది. స్థానికం. వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి పోలిక తెచ్చుకోవడం లోకలైజేషన్ కాదా.
ఈ కవితాసంకలనంలో అక్కడక్కడ తనదైన శైలి, ఊహాశాలీనత, పదమేళనాలతో కవి కనిపిస్తాడు. పూర్తిగా కవిత్వమే నిండిన వాక్యాలు మెరుపుల లెక్క తటిల్లున తాకుతాయి.
‘మౌనం లేతతమలపాకు మృదుత్వమై/వాక్యాల మధ్య ఆగి సాగే చుక్క కావాలి’(బంధం)
’అక్షరం ముక్కల్ని నోట కరుచుకుని
నేను ఎగిరే పక్షినవుతా’(నా అక్షరం)
‘నిద్ర అలలు ఒడ్డున పడేస్తే
….జీవమున్న పద్యం జీవనపతాక’(తెల్లవారితే)
‘నాక్కొంచెం దిక్సూచిలా నిలవండి/నన్ను నేను కవిగా నిరూపించుకోవడానికి/నాదంటూ పొలం బాటైనా వేయడానికి’(నమ్మకమివ్వండి)
‘కష్టానికి బండరాళ్ళయిన పాదాలు/నడక దిమ్మీసలేస్తే మొలిచిన తొవ్వ’(తొవ్వ)
కొత్తప్రతీకలతో కవిత్వం రాయడానికి ఆరాటపడుతుంటాడీ కవి. తనదైన భాషను తన కవిత్వంలో ప్రతిష్టించడానికి ప్రయత్నిస్తుంటాడు. కవిలో ఊహాశక్తి, దానికి తగిన పదాలకూర్పు, కోరుకున్న భావాన్ని తన కవితలో ప్రతిఫలించేటట్లు తనను తాను ఎడిట్ చేసుకోవడం చాలా అవసరం.
‘ఆత్మల హత్యలు’ అనే కవితలో అంజయ్య శరీరశ్రమను ఫ్యాక్టరీల పొగగొట్టాలనుంచి ఆవిరై, ఆకాశానికి కానుకిచ్చిన మబ్బులుగా, ఆ మబ్బులు కురిసిన వానతో పచ్చదనం పండుగ చేసుకుంటుందంటాడు. ఒక్క వాక్యంలో కార్మికుల్ని, కర్షకుల్ని జమిలిగా చెప్పడం కవి లక్ష్యం నెరవేరింది. పంటలు పండితే పాడికి కొదువుండదు. అపుడు పాడికుండతో గొల్లభామ నడిచొస్తుంది. సిద్దిపేట ‘గొల్లభామ’ చీరలకు ప్రసిద్దిపేట. ఈ నాలుగు కవితాపాదాలలో అంత చరిత్ర సాధించాడు కవి.
శరీరశ్రమ పొగగొట్టాలై
ఎగిసెగిసి మబ్బులను కానుకిస్తే
పచ్చదనం పండుగ చేసుకుంటది
నెత్తిపై పాడికుండ గొల్లభామ చీరవుతది
రాజ్య వ్యవస్థ చక్కదనంగా లేకపోతే ప్రజాసమూహాలు నిరసనలుగా ప్రజ్వరిల్లుతుంటాయి. ప్రజాగళం తనకు వ్యతిరేకంగా నినదిస్తే ఏ రాజ్యమూ ఊరుకోదు. పైకి మాటలే కాని, ప్రజాస్వామ్యం బతికిలేదు. సత్యాగ్రహాలకు, ధర్నాలకు, ఊరేగింపులకు, బహిరంగ సభలకు, ఆఖరుకు ఇన్ కెమెరా మీటింగులకు కూడా అనుమతించదు. అపుడు ధర్నాచౌక్ లుంటాయా? వుండవు కాని, చౌరస్తాలుంటాయంటాడీ కవి. వాటినెవ్వరు మూయలేరు కదా…
ఎవరైనా దారులు మూయొచ్చు
ధర్నా చౌక్ లు ఎత్తేయొచ్చు
నడింట్ల నందదీపం వెలుగు
చౌరస్తాలు మూసేయడం తరమా? (చౌరస్తా) గుడిలో వెలిగే అఖండదీపం(నందాదీపం)తో పోలుస్తున్నాడు చౌరస్తాను…
గతం గరిసెలోంచి జ్ఞాపకాలగింజలు తోడితే…( స్మార్ట్ తప్పిపోతే) అనే తన కవితావాక్యంలో చెప్పినట్లుగా….
ఈ కవితా సంకలనంలో వున్న మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ మీద రాయబడింది. మరొకటి కాళోజీ మీద.
‘వేణుమాధవా’ అనే శీర్షికతో రాసిన ఈ ఎలిజీకవితలో ఆ మహా కళాకారుని గొంతులో వినిపించే అద్భుత ధ్వన్యనుకరణ అంశాలను ఇట్లా ప్రస్తావిస్తాడు.
భూమిపొరల అగ్నిపర్వతాలు
సముద్ర అంతరంగ తుఫానులు
ఆకాశం కుమ్మరించిన ఉరుములు,
మెరుపులు,ధ్వనితరంగాల కూడికలు తీసివేతలు…
ఒక్క గొంతయిన వేణువు…. ఆ వేణువు ‘నేరెళ్ళ’కు గొప్ప నివాళి.
రెండో జ్ఞాపకాల కవిత ‘క్షమించు కాళోజీ’లో
నీ మాటల్ని మెడలేసుకుని ఊరేగుతరు
ప్రశ్నించే తత్వాన్ని పాతరేస్తరు పాతాళానికి’…
అధికారానికి వచ్చేదాక ఎందరో విప్లవనినాదాలు చేసిన నాయకులు చేత చిక్కగానే పదవులు ఆ విప్లవకారుల్ని వేటాడి చంపుతుంటరు. నిన్నటిదాక కాళోజీ కవితావాక్యాలను నినాదాలుగా జైకొట్టిన నేతలు ఆ ప్రశ్నించే తత్వాన్ని జైళ్ళల్లో పాతేస్తున్నారు కదా.
పట్టణీకరణ మనుషుల్ని ఒంటరివాళ్ళను చేస్తున్నదంటాడు కవి. కాని, ఇది మనం కోరుకున్నదే కదా అని అడుగుతున్నాడు.
‘మనమూ’ కవితలో
‘ఎవరికి వారే కట్టుకున్న అడ్డుగోడలు ఎవరికి వారే తెచ్చిపెట్టుకున్న ఒంటరితనం
పట్నాలను విమర్శగోళ్ళతో గోకుతాం కానీ మనం పట్నంలో భాగమేకదా’ ఈ కవి
నేను అక్షరాలు నాటేసేవాణ్ణి
కవిత్వం పంటలు తీసేవాణ్ణి …(పాఠం) అంటాడు…ఉత్తమకవిరైతు కావాలని ఆకాంక్షిస్తూ… అభినందనలతో…

Siddipet is famous for poets