Saturday, April 20, 2024

ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య

- Advertisement -
- Advertisement -

అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి
మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా
మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38) గురువారం గుండె పోటుతో ఆకస్మికంగా మృతిచెందాడు. గజ్వేల్ నుంచి ఎన్నో ఆశలతో వెళ్లిన ఆయన ఇలా ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవటం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. డల్లాస్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ రెడ్డి తన భార్య దివ్య, 3 సంవత్సరాల పాపతో ఆనందంగా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా మెడనొప్పి, చెవినొప్పితో బాధపడుతున్న ప్రశాంత్ వైద్యం చేయించుకుంటున్నాడు. బాధ అధికంగా ఉన్న కారణంగా వారం రోజుల వరకు ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. ఆరోగ్యం కొంత మెరుగవటంతో ఇటీవలే తిరిగి విధులకు హాజరవుతున్నాడు. ప్రశాంత్ భార్య దివ్య నిండు గర్బిణి. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. ఇలాఉండగా బుధవారం ఆఫీసుకు చేరిన కొద్ది సేపటికే ఉన్నట్టుండి ప్రశాంత్‌కు తీవ్రంగా గుండెపోటు రావటంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే సహచర ఉద్యోగులు 911కు , ఇంటి వద్ద ఉన్న అతని భార్యకు ఫోన్ చేసి సమాచారం అందచేశారు. క్షణాల్లో అంబులెన్స్‌రావటం ఆసుపత్రిలో చేరిన ప్రశాంత్‌ను ఆసుపత్రికి చేరిన అతని భార్య దగ్గరుండి చూస్తుండగానే ఆమె పురిటి నొప్పులతో బాధ పడటంతో అదే ఆసుపత్రిలో ప్రసూతి వార్డులో చేర్చారు. మరోవైపు కొన్ని క్షణాల్లోనే ప్రశాంత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు.
భర్త మృతి చెందిన కొన్ని గంటల్లోనే ప్రసవించిన భార్య
తండ్రీ కూతురును విడదీసిన మృత్యువు
ప్రశాంత్ రెడ్డి మృతి చెందాడన్న దుర్వార్తను అతని భార్య దివ్యకు అప్పటికప్పుడు వైద్యులు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. కానీ తనభర్త ఆరోగ్యంపై ఆమె ఆందోళనతోనే పురుటి నొప్పులతో ప్రసూతి వార్డులో ఉంది. కొన్ని గంటల తర్వాత గురువారం తెల్లవారు జామున ప్రశాంత్ భార్య దివ్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అత్యవసరంగా వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు. కొంత ఆలస్యంగా ఆమెకు భర్త మృతి సమాచారం తెలిపారు. పాపపుట్టిందన్న సంతోషం అటుంచి తన భర్త తనకు శాశ్వతంగా దూరమైన విషాదం ఆమె తట్టుకోలేక పోతోంది. ఎంతో దయనీయమైన ఈ పరిస్థితిలో అమెరికాలోనే నార్త్ కరోలినాలో ఉంటున్న ప్రశాంత్ తమ్ముడు శిరీష్‌కు అందిన సమాచారంతో భార్యపిల్లలతో హుటాహుటిన డల్లాస్‌కు చేరారు. కూతురు ప్రసవం కోసం అప్పటికే భారత్ నుంచి దివ్యతల్లి కొద్ది రోజుల ముందే డల్లాస్ చేరారు. ప్రశాంత్ మృతి చెందిన సమాచారం తెలిసి హైదారాబాద్‌లోని అల్వాల్‌లో పెద్దకొడుకు ప్రమోద్ రెడ్డితో ఉంటున్న తల్లి నిర్మలను హుటాహుటిన గురువారం రాత్రి డల్లాస్‌కు ఫ్లైట్‌లో పంపారు. శుక్రవారం రాత్రికి ఆమె చేరుతుంది. కాగా కొందరు అమెరికాలో ఉంటున్న ప్రశాంత్ బంధువులు, మిత్రులు పరిస్థితిని గమనించి బాధిత కుటుంబానికి సహాయంగా ఉన్నారు.
అంతా విషాదం…. స్నేహితులే అన్నీ అయ్యారు
ప్రశాంత్ మిత్రుని ట్వీట్‌తో స్పందించిన మంత్రి కెటిఆర్
దేశంకాని దేశంలో తన మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందటంతో గజ్వేల్‌లో ఉంటున్న ప్రశాంత్ రెడ్డి స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక వైపు ఆసుపత్రిలో మృతదేహం..మరోవైపు అదే ఆసుపత్రిలో పసికందుతో పుట్టెడు దుఖఃంలో బాలింతగా ఉన్న మృతుని భార్య దివ్య… కడుదయనీయ మైన సన్నివేశం.. కడుపు తరుక్కుపోయే ఈ పరిస్థితిలో వెంటనే ఆ కుటుంబానికి తగిన సహాయం అత్యవసరంగా కావాల్సి ఉంది. డల్లాస్‌కు వెంటనే మృతుని అన్న ప్రమోద్‌ను పంపించాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇంత త్వరగా వీసా దొరికే పరిస్థితిలేదు. ఈదశలో గజ్వేల్‌లో ప్రశాంత్ మిత్రుడైన ఎన్సీ సంతోష్ వెంటనే మంత్రి కెటిఆర్ కు ట్వీట్ చేశాడు. తన మిత్రుడు మృతిచెందటం, అతని భార్య పరిస్థితిని తెలుపుతూ వెంటనే మృతుని అన్న ప్రమోద్ అమెరికా వెళ్లటానికి వీసా త్వరగా ఇప్పించే ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని సంతోష్ మంత్రికి విజ్ఞప్తి చేశాడు. దాంతో వెంటనే స్పందించిన మంత్రి కెటిఆర్ అమెరికా ఎంబసీ అధికారులతో సంప్రదించి తగిన ఏర్పాట్లు చేయించారు. అనుకున్నట్లే శుక్రవారం సాయంత్రం అమెరికా వెళ్లటానికి ప్రమోద్‌కు వీసా దొరికింది. వెంటనే అదే రాత్రి ఆయన బయలుదేరాడు. శనివారం ఆయన డల్లాస్ చేరుకుంటాడు.
డల్లాస్‌లోనే అంత్యక్రియలు
కడు దయనీయ స్థితిలో మృతిచెందిన ప్రశాంత్ రెడ్డి అంత్యక్రియలు అమెరికాలోని డల్లాస్ నగరంలోనే జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రశాంత్ మృత దేహం ఇప్పటికే మూడురోజులుగా మార్చురీలో ఉంది. ఇంకోవైపు రెండు రోజుల కిందట మృతుని భార్య దివ్య ప్రసవించి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె ఆసుపత్రిలోనే పచ్చి బాలింతగా ఇప్పటికీ ఉంది. ఈ దశలో అమెరికా నుంచి ఫ్లైట్‌లో ఇండియాకు రావటం అంత సులువు కాదు. వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మృతుని సోదరులు, తల్లి, అత్త, ఆమె తరపు సమీప బంధువులు ఒకరిద్దరు అమెరికాకు చేరుకున్నారు. వీసా దొరికితే మరికొందరు బంధవులు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మృతదేహానికి డల్లాస్ లోనే అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంది. దేశం కాని దేశంలో ఇలాంటి దుస్థితి రావటం విషాదానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. మృతుడు ప్రశాంత్ తండ్రి సుధాకర్ రెడ్డి గజ్వేల్ తహశీల్ కార్యాలయంలో సీనియర్ సహాయకునిగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో కొంతకాలం కిందట మృతి చెందారు. పెద్ద కుమారుడు ప్రమోద్ రెడ్డితో అల్వాల్‌లో తల్లినిర్మల ఉంటోంది. రెండో కుమారుడు, చిన్నకుమారుడు అమెరికాలో ఉంటున్నారు..

Siddipet Man dies in US same time his wife blessing baby

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News