Home జాతీయ వార్తలు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటివద్ద సిద్దూ నిరసన

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటివద్ద సిద్దూ నిరసన

Sidhu joins guest teachers protest outside kejriwal house

 

న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) నేతలు పంజాబ్‌లో విస్తృతంగా ప్రచారం సాగిస్తూ అధికార పార్టీ కాంగ్రెస్ విధానాల లోపాలను ఎత్తిచూపుతున్న నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ కూడా తన ఎత్తుగడలను వేస్తూ ఆప్ ప్రచారాన్ని తిప్పి కొడుతోంది. దెబ్బకు దెబ్బ అన్నట్టు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిధ్దూ ఆదివారం ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటివద్ద నిరసన సాగించారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఎం ఇంటివద్ద ధర్నా చేస్తున్న ప్రభుత్వ గెస్ట్ ఉపాధ్యాయులతో కలిసి ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులను ప్రదర్శించారు.

ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ కాంట్రాక్ట్ మోడల్ అని, ఆప్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగం దాదాపు ఐదు రెట్లు పెరిగిందని సిద్దూ ట్విటర్‌లో ఆరోపించారు. నిరసనకు సంబంధించిన చిత్రాలను ఆయన ట్విటర్ ద్వారా పంపుతూ ఢిల్లీలో గెస్ట్ లెక్చరర్లను కట్టుబానిసలుగా చూస్తున్నారని సిద్దూ ధ్వజమెత్తారు. అంతకు ముందు పంజాబ్ లోని మొహలి వద్ద ఉపాధ్యాయుల ధర్నాలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ నియోజక వర్గం లోని పాఠశాలలను సందర్శించి , అక్కడ కనీస సౌకర్యాల స్థితిని తీవ్రంగా విమర్శించారు.

Sidhu joins guest teachers protest outside kejriwal house