సాయిప్రణీత్, ప్రణయ్ కూడా.. జ్వాల జోడీ ఓటమి
మకావ్ : మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రి మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఐదోసీడ్‌గా బరిలోకి దిగిన సింధు బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21-13, 22-20తో కిమ్ హోమిన్(కొరియా)ను చిత్తుచేసింది. 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలిగేమ్‌ను సునాయాసంగా నెగ్గినా రెండోగేమ్‌లో మాత్రం శ్రమించింది. తొలిగేమ్ ఆరంభంలోనే 0-2తో వెనుకబడిన సింధు వెంటనే తన తప్పులను సరిదిద్దుకుంది. దీంతో స్కోరుబోర్డు 2-2, 4-4, 6-6 వరకు సమంగా నడిచింది. ఇక ఇక్కడి నుంచి ఒక్కసారిగా చెలరేగిన సింధు వరుసగా ఐదు పాయింట్లు నమోదుచేసి 11-6తో నిలిచింది. ఇక మధ్యమధ్యలో కిమ్‌కు పాయింట్ సమర్పించుకున్నా గేమ్‌ను మాత్రం పోటీలేకుండానే సొంతం చేసుకుంది. అయితే రెండోగేమ్‌లో సింధుకు ఊహించని పోటీ ఎదురైంది. గేమ్ మొదట్లోనే 4-1తో నిలిచిన సింధు.. ఒత్తిడికి గురై అనవసర తప్పిదాలు చేసింది. దీనిని సద్వినియోగం చేసుకున్న కిమ్ 7-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే క్రమంగా పుంజుకున్న సింధు స్కోరును 11-11తో సమం చేయడంతో పోరు ఉత్కంఠతకు దారితీసింది. ఇద్దరూ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడడంతో స్కోరుబోర్డు 20-20 వరకు సమంగానే నడిచింది. అయితే నెట్‌గేమ్‌తో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు 22-20తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్ యువ షట్లర్లు సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు. లిన్ చియా హున్(చైనీస్‌తైపి)తో జరిగిన మ్యాచ్‌లో ఏడోసీడ్ ప్రణయ్ 21-1-, 21-15తో నెగ్గగా, సాయిప్రణీత్ 21-11, 21-8తో ఆండ్రెకుమైవాన్ (ఇండోనేసియా)పై గెలిచాడు. కాగా మహిళల డబుల్స్‌లో గుత్తాజ్వాల-అశ్వనీపొన్నప్ప జంట పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. రెండోసీడ్ జ్వాల-అశ్వనీ 16-21, 15-21తో యుకీఫుకుసిషిమా-సయకహిరోట (జపాన్) చేతిలో ఓడింది.