Wednesday, April 24, 2024

సెమీస్‌లో పోరాడి ఓడిన సింధు

- Advertisement -
- Advertisement -

Sindhu who fought and lost in semi finals

నేడు కాంస్యం బరిలో

టోక్యో: ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కల ఈసారి నెరవేరలేదు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనా సింధు పతకం ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. కాంస్య పతకం కోసం సింధు పోరాడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి, వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన సెమీస్‌లో సింధుకు చుక్కెదురైంది. సింధుపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన తై జు 21-18, 21-12 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో లండన్ ఒలింపిక్స్‌లో సింధు చేతిలో ఎదురైన పరాజయానికి తై జు ప్రతీకారం తీర్చుకుంది. కిందటి ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు ఈసారి ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. అయితే సెమీస్‌లో ఓడినా అసాధారణ ఆటతో కోట్లాది మంది అభిమానుల మనసులను దోచుకుంది. ఇక తై జుతో జరిగిన పోరులో సింధు గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.

మొదటి గేమ్‌లో సింధు అద్భుత పోరాట పటిమను కనబరిచింది. వరల్డ్ నంబర్‌వన్ క్రీడాకారిణి తై జు హడలెత్తిస్తూ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సింధు దూకుడుగా ఆడగా తై జు మాత్రం సమన్వయంతో ముందుకు సాగింది. ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే క్రమంలో హోరాహోరీ పోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో మాత్రం సింధు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయింది. తై జు ఆరంభం నుంచే చెలరేగి ఆడింది. సింధుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే సమయంలో సింధు తీవ్ర ఒత్తిడికి గురైంది. అంతేగాక వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న తై జు అలవోకగా సెట్‌ను గెలిచి స్వర్ణం రేసుకు అర్హత సాధించింది. ఇదే క్రమంలో అగ్రశ్రేణి షట్లర్ తై జు తొలి ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకుంది.

ఓడినా బాగానే ఆడింది..

మరోవైపు సింధు సెమీఫైనల్లోనే ఓటమి పాలు కావడంపై ఆమె తండ్రి రమణ స్పందించారు. క్రీడల్లో గెలుపోటములు సహాజమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. సింధు టోక్యో ఒలింపిక్స్‌లో ఆశించిన దానికంటే బాగానే ఆడిందన్నారు. తనకంటే మెరుగైన క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైందని పేర్కొన్నారు. సింధుతో పోల్చితే తై జు ర్యాంకింగ్స్‌లో ఎంతో ముందంజలో ఉందని వివరించారు. ఈ మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన సింధు ఆటను తక్కువ చేసి చూడొద్దని కోరారు. ఇక కాంస్యం కోసం జరిగే పోరాటంలో సింధు గెలుస్తుందనే నమ్మకాన్ని రమణ వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News