Home కరీంనగర్ సింగరేణిలో సంచలనం సృష్టిస్తున్న యంత్రాలు

సింగరేణిలో సంచలనం సృష్టిస్తున్న యంత్రాలు

07 GDK 09 (2)కరీంనగర్ ః పూర్వకాలంలో సింగరేణి బొగ్గు గనుల సంస్థలో కార్మికుల కష్టంతోనే బొగ్గు ఉత్పత్తి సాధించేవారు. 1889లో నిజాము నవాబు కాలంలో ‘హైదరాబాద్ దక్కన్’ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ప్రారంభమైన సంస్థ ఖమ్మం జిల్లా ఎల్లందులో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించింది. ఆ తర్వాత 1921లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరిట లండన్ స్టాక్ ఎక్సేంజీ జాబితాలో చేరి సింగరేణి వాణిజ్యపరమైన బొగ్గు ఉత్పత్తి ప్రారంభించింది. ఎలాంటి రక్షణ, భద్రతా సౌకర్యాలు లేని భూసొరంగాల్లో కాగడాల వెలుతురులో బొగ్గు ఉత్పత్తి జరిపిన చోట రానురాను బ్రిటీష్ అధికారుల సహకారంతో సేఫ్టీ లాంపులు, హెల్మెట్లు, బూట్లు, గనిపై కప్పు సపోర్టులు, తదితర అనేక సాంకేతిక విధానాల దిగుమతుల కారణంగా సింగరేణి సంస్థలో రక్షణ, భద్రతా నియమాల మేరకు బొగ్గు ఉత్పత్తి పెరిగింది. భూగర్భ గనుల్లోని చీకటి సొరంగాల్లో సేఫ్టీలాంప్ వెలుతురులో కోల్‌కట్టర్ అనే కార్మికులు బొగ్గు గోడలకు డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో రంద్రాలు చేసి, వాటిల్లో పేలుడు పదార్థాలు నింపి, బ్లాస్టింగ్ చేసేవారు. దాదాపు 80 ఏళ్ళపాటు కొనసాగిన ఈ ఉత్పత్తి ప్రక్రియను సింగరేణి సంస్థ దశలవారీగా ముగించింది. భూగర్భ బొగ్గు గనుల్లో కార్మికులు స్వయంగా బొగ్గు ఉత్పత్తి చేసే సొరంగాల్లో తరుచుగా పైకప్పులు కూలటం, కార్మికులు చనిపోవడం, విషవాయువులు వ్యాపించటం వంటి ప్రమాదాల కారణంగా సంస్థ భూగర్భ గనుల్లో యంత్రాల సహాయంతో బొగ్గు ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం భూగర్భ గనుల్లో ఎస్.డి.ఎల్ (సైడ్ డిశ్చార్జ్ లోడర్), ఎల్.హెచ్.డి (లోడ్ హాల్ డంపర్) అనే రెండు రకాల యంత్రాలను ప్రవేశపెట్టి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. కార్మికులు చెమ్మస్‌లతో బొగ్గు నింపటం, తట్టలతో బొగ్గు మోయడం ప్రక్రియ క్రమక్రమంగా తొలగిస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ గనుల్లో 90శాతం ఎస్.డి.ఎల్, ఎల్.హెచ్.డి యంత్రాల సహాయంతోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇరవై నుంచి నలభై మంది కార్మికులు చేసే పనులన్నీ రెండు యంత్రాలు, ఇద్దరు ఆపరేటర్లతో చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రమాద రహితంగా మారింది. అనేక ఏళ్ళపాటు భూగర్భ గనుల్లో కొనసాగిన తట్టా-చెమ్మాస్‌తో ప్రమాదకర బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కనుమరుగైంది. కాని సింగరేణి సంస్థలో మానవ వనరుల తగ్గుదలకు ఇది ప్రధాన కారణంగా మారింది.

07 GDK 09 (3)