Wednesday, November 30, 2022

కొత్తగూడెం టు సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.62.17 కోట్లు

- Advertisement -

Singareni provided Rs 62.17 cr for kothagudem to sathupally railway line

 

ఖమ్మం: సింగరేణి కాలరీస్ – దక్షిణ మధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తగూడెం టు సత్తుపల్లి రైల్వే లైన్ కోసం సింగరేణి తన వంతుగా చివరివిడత మొత్తం రూ.62.17 కోట్ల చెక్కును శుక్రవారం రైల్వే శాఖకు అందజేసింది. సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.అల్విన్, జిఎం (కో ఆర్డినేషన్, మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, జిఎం (సివిల్) రమేశ్ బాబు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మాల్యను కలిసి చెక్కును అందజేశారు. దీంతో సింగరేణి తనవంతుగా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.618.55 కోట్లను చెల్లించినట్లయ్యింది. సత్తుపల్లి టు కొత్తగూడెం రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తద్వారా బొగ్గు రవాణా సులభతరం అవుతుందని ఈ సందర్భంగా జె.అల్విన్ కోరగా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే జిఎం హామీ ఇచ్చారు.

సిఎండి ఎన్.శ్రీధర్ చొరవతో అంకురార్పణ
కొత్తగూడెం ఏరియా సత్తుపల్లిలో ఉపరితల బొగ్గు గనులు ప్రారంభం నేపథ్యంలో పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయాలన్న ఉద్దేశంతో సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ నాలుగేళ్ల క్రితం సత్తుపల్లి టు కొత్తగూడెం రైల్వే లైన్‌ను ప్రారంభించాలని రైల్వే శాఖను కోరారు. ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సవరించిన అంచనాల మేరకు రైల్వే లైన్ నిర్మాణానికి రూ.927 కోట్ల వ్యయం అవుతుండగా సింగరేణి వాటాగా రూ.618.55 కోట్లు, రైల్వే శాఖ రూ.309.3 కోట్లు భరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు సింగరేణి విడతల వారీగా గతంలో రూ.556.38 కోట్లను చెల్లించింది. శుక్రవారం రూ.62.17 కోట్ల చెక్కును అందజేయడం ద్వారా తన వాటాను పూర్తిగా చెల్లించింది.

తక్కువ వ్యయంతో బొగ్గు రవాణా
ప్రస్తుతం సత్తుపల్లి గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇక్కడ రోజుకు ఉత్పత్తి అయ్యే దాదాపు 30 వేల టన్నుల బొగ్గును లారీల ద్వారా తరలించడం వల్ల పర్యావరణానికి కొంత ఇబ్బందే కాకుండా రవాణా వ్యయం కూడా అధికం అవుతుంది. అదే 53 కిలోమీటర్ల సత్తుపల్లి- టు కొత్తగూడెం రైల్వే లైన్ పూర్తయితే పర్యావరణహితంగా,తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణాకు అవకాశం ఉంటుందని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు.

సింగరేణి సహకారంతో త్వరితగతిన రైల్వే లైన్: సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం
రైల్వేశాఖ – సింగరేణి సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సింగరేణి నుంచి తమకు సంపూర్ణ సహకారం లభించినందున నిర్మాణ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయగలిగామని ఈ సందర్భంగా రైల్వే జిఎం గజానన్ మాల్యా తెలిపారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం, ఇతరత్రా పనుల్లో సింగరేణి అన్ని విధాలుగా సహకారం అందించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టు ఇదేనని ఆయన పేర్కొన్నారు. సాధ్యమయినంత త్వరగా (రెండు, మూడు నెలల్లో) రైల్వే లైన్ పనులు పూర్తయి అందుబాటులోకి రానున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వేస్ ప్రిన్సిపిల్ చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, సింగరేణి డిజిఎం (మార్కెటింగ్) మారపల్లి వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Singareni provided Rs 62.17 cr for kothagudem to sathupally railway line

Related Articles

- Advertisement -

Latest Articles