Home లైఫ్ స్టైల్ సంగీత సాహితి

సంగీత సాహితి

సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే ఉన్నతంగా ఎదగవచ్చని తెలియజేస్తున్నది నాగసాహితి అడప సంగీత ప్రస్థానం.తాను పాడిన  పాటల వీడియోలను  తల్లి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో సినిమాలో పాటలు పాడే అవకాశం వచ్చింది.   చదువుతోపాటే సంగీతాన్ని నేర్చుకుంటూ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అతిచిన్న వయసులో సినీరంగంలోకి అడుగిడింది. సంగీత కళను మరింత మెరుగుపరుచుకుని, నేపథ్య గాయనిగా ఎదగాలనుందని చెబుతోంది సాహితి…

Naga-Sahithi

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన నాగ సాహితి అడప ఎన్‌టిపిసిలోని సెయింట్ క్లేర్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నది. చిన్నప్పటి నుంచే సంగీతంతో పాటు కీబోర్డు కూడా నేర్చుకుంది. పాఠశాల స్థాయిలో ఏ పోటీలు జరిగినా ఈ అమ్మాయి బహుమతి గెలుచుకునేది. అనేక వేదికలమీద పాటలు పాడిన సాహితి కొత్తగూడెంలో జరిగే బాలోత్సవ్‌లో కూడా విజయం సాధించింది. చిన్నప్పటి నుంచి తనలో ఉన్న ఆసక్తి, పట్టు దలను గమనించిన తల్లిదండ్రులు విజయ్ కుమార్, హేమాంజనీ దేవి సాహితిని ఆ దిశగా ప్రోత్సహించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయక కళలతో పాటు చదువులోనూ ఉత్తమంగా రాణిస్తున్నది.
సంగీతంలో శిక్షణ క్లాసికల్ మ్యూజిక్, కీ బోర్డు ప్లే చేయడం స్థానికంగా, లలిత సంగీతం హైదరాబాద్‌లో రంగాచారి వద్ద నేర్చు కున్నది. ప్రస్తుతం అన్నమాచార్య కీర్తనలు పాడడంలో శోభారాజ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నది.
సోషల్ మీడియా ద్వారా సాహితి తరచూ పాడే పాటల విడియోలను వాళ్ల అమ్మ సోషల్‌మీడియా(ఫేస్‌బుక్)లో పోస్ట్ చేస్తూండేవారు. ఆ పాటలను ఎఫ్‌బిలో చూసిన ఔత్సాహిక సినిమా దర్శకుడు విజయ్ మంత తన సినిమాలో పాడాల్సిందిగా అవకాశం ఇచ్చారు. ఇండిపెండెంట్ సినిమా అయిన ‘నారీ’ లో సాహితి రెండుపాటలను అలవోకగా పాడింది. మున్ముందు నేపథ్య గాయనిగా ఎదగాలనుందని చెబుతున్న సాహితికి ఆల్ ద బెస్ట్.