Home కలం సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్

సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్

Sir Syed Ras Masood is OU first Principal

 

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలను కొల్లగొట్టిన వ్యక్తి. ఆర్ట్స్ కళాశాలలో సెమినార్ హాల్ ఒకటి కొత్తగా ప్రారంభించారు. కీర్తిశేషులైన కవుల, వైస్ చాన్సలర్ల పేర్లు పెట్టాలని రకరకాలుగా సూచించడం, ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. ప్రిన్సిపాల్ డి. రవీందర్ ఎంతైనా రాజనీతిశాస్త్రం (పొలిటికల్ సైన్స్ ) ఆచార్యులు, పాలనాసామర్థ్యం ఉన్నవారు కనుక అందరి ఊహలు తలకిందులు చేసి సర్ సయ్యద్ రాస్ మసూద్ సెమినార్ హాల్ అని పేరు పెట్టి తానొవ్వక, నొప్పించక, సమస్యను నేర్పుగా పరిష్కరించారు.

సర్ సయ్యద్ రాస్ మసూద్ (1889-1937) అత్యున్నతశ్రేణి విద్యావేత్త. అరబ్బీ, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీషు, ఫ్రెంచి, ఇటాలియన్ భాషల్లో పండితుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ప్రధానాచార్యులు. 1919 లో ఉస్మానియాలో తొలితరం అధ్యాపకులను నియమించడంలో, నియమనిబంధనలను రూపకల్పన చేయడంలో క్రియాశీలంగా వ్యవహరించిన మేధావి. ఉస్మానియా విశ్వవిద్యాల యం (ఒయు) నూరేళ్ళ సంబరాలను జరుపుకొన్న తరుణంలో మొదటి ప్రిన్సిపల్ పేరుతో సెమినార్‌హాల్ ఏర్పాటు ఔచితీమంతమేకాక మూలాలను స్మరించుకొన్నట్లయింది కూడ. ఇందు కు కారణమైన ఆచార్య డి.రవీందర్ అభినందనీయులు. ఈ సందర్భంగా రాస్‌మసూద్ జీవన వివరాలను తెలుసుకొందాం.

డిల్లీలోని ఉన్నతవిద్యావంతుల కుటుంబంలో రాస్ మసూద్ 1889 ఫిబ్రవరి15న జన్మించారు. వీరి పూర్వీకులు మొగల్ సామ్రాజ్యంలో ఉన్నతాధికారులు. తాత సయ్యద్ అహ్మద్ ఖాన్(1817-1898) మహ్మదీయుల్లో విద్యా, వైజ్ఞానికాభివృద్ధికి, ఆంగ్లభాష, ఆధునికదృక్పథాలవ్యాప్తికి ఎంతగానో పాటుపడ్డాడు. విద్యారంగంలో ఆయన చేసిన సేవకు సర్ బిరుదం పొందాడు. ప్రభుత్వాలందించే ఆర్థికసహకారంతో మాత్రమేకాక స్వతంత్రంగా విద్యాలయాలు విలసిల్లాలని అభిలాషించాడు. ఎన్నో పాఠశాలలు నెలకొల్పాడు. 1875లో దక్షిణాసియాలోనే మొదటిదైన అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయస్థాపకునిగా చరిత్రలో నిలిచిపోయాడు. (1875 నుంచి 1919 దాక అది మహ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజి, పిదప 1920 నుంచి విశ్వవిద్యాలయం) తాను ఇంగ్లాండులో దర్శించిన ఆక్స్ ఫర్డ్ , కేంబ్రిడ్జ్ విద్యాసంస్థలస్థాయిలో ఇది ఎదగాలని కోరుకున్నాడు సయ్యద్ అహ్మద్ ఖాన్. (ఇతని మీద ప్రత్యేకంగా మరోవ్యాసం రాయవచ్చు.) ఇక ఆయన కుమారుడు, రాస్ మసూద్ తండ్రి అయిన సయ్యద్ మహ్మద్ 1871లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంనుంచి డిగ్రీ తీసుకొన్న మొట్టమొదటి భారతీయ మహ్మదీయుడు.

32 ఏళ్ళకే అలహాబాద్ హైకోర్ట్ (1882) న్యాయమూర్తి అయి ఎంతో పేరు గడించాడు. ఎన్నో అసాధారణతీర్పులు వెలువరించి న్యాయశాస్త్రకోవిదునిగా మన్ననలందుకొన్నాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తనకు ఆత్మీయుడైన రాస్ అనే క్రైస్తవమిత్రుని పేరు కలిసి వచ్చేలా, మనుమనికి రాస్ మసూద్ అని పేరు పెట్టినట్లు చెప్పుకొన్నాడు. రాజా జైకిషన్ అనే సంపన్నుడు మసూద్ పుట్టినప్పుడు 500 రు.లు బహూకరించగా, తాతగారు దాన్ని అలీగడ్ విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చాడు.

తండ్రి ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం మూలాన, తాత మనుమని విద్యాభ్యాసం పట్ల ఎనలేని శ్రద్ధ వహించాడు. పసి వయస్సులోనే మసూద్ కు ఓ ప్రత్యేకమైన గదిని ఏర్పరచి హఫీజ్ బకోహి అనే విద్వాంసుని చేత ఉర్దూ అరబిక్ భాషలను క్షుణ్ణంగా బోధింపచేశాడు. రాస్ మసూద్ కు తొమ్మిదవవ ఏట (1898) తాత, పదమూడవ ఏట (1902) తండ్రి చనిపోయారు. కుటుంబసన్నిహితుడు, అలీగడ్ విద్యాసంస్థల ప్రధానాచార్యులు సర్ థియోడర్ మారిసన్ అనే ఆంగ్లేయుడు తనపిల్లల్లో ఒకనిగా రాస్ మసూద్ ను ఆదరించి చదివించాడు. కానీ ఆయన కూడా అచిరకాలంలోనే స్వదేశం వెళ్ళిపోక తప్పలేదు.

మసూద్ 1905లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయి, ప్రభు త్వ ఉపకారవేతనంపై ఉన్నతవిద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. థియోడర్ మారిసన్ అక్కడే ఉండడంతో తిరిగి ఆయన అండదండలు లభించాయి. ఘనత వహించిన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం కలిగింది. తండ్రి కేంబ్రిడ్జి విద్యార్థి అయితే కొడుకు ఆక్స్ ఫర్డ్ విద్యార్థి. తండ్రి కీర్తి నిలబెట్టిన తనయుడయ్యాడు. టెన్నీసు, బాక్సింగ్ పోటీలకు జట్టునాయకునిగా, చదువుల్లో మేటిగా కళాశాలకు పేరు తెచ్చాడు. ప్రతిష్ఠాత్మకమైన హయ్యర్ ఇంగ్లీషు సొసైటీలో సభ్యత్వం పొందాడు. ఆక్స్ ఫర్డ్ నుండి 1910లో బియ్యే (ఆనర్స్), మరో రెండేళ్ళకు బార్- ఎట్- లా పూర్తిచేసుకొని విజయవంతంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు.

ఇండియాకు తిరిగి వచ్చాక బీహార్ ఒరిస్సా విద్యాశాఖమంత్రి సర్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ సలహాతో బీహార్ లో మసూద్ న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించాడు. న్యాయశాస్త్రంలో డిగ్రీ అయితే పొందాడు. కానీ ఆసక్తి మాత్రం పెంచుకోలేకపోయాడు. ఆయనకు విద్యారంగం మీదే ఆసక్తి మెండు. 1913 లో ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్‌లో చేరి, పాట్నాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడయ్యాడు. 1916 లో ఒరిస్సాలోని కటక్ లో ఉన్న రావెన్ షా కళాశాల చరిత్రవిభాగంలో సీనియర్ ఆచార్యుడయ్యాడు. మసూద్ ప్రతిభాపాటవాలు, కీర్తిప్రతిష్ఠలు ఒరిస్సా సరిహద్దులు దాటి హైదరాబాదు ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం), నిజాం ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీ చెవుల్లో పడ్డాయి. నిజాం మసూద్ ను హైదరాబాదు వచ్చి విద్యాశాఖలో చేరమని ఆహ్వానించా డు. దాంతో రాస్ మసూద్ హైదరాబాదు విద్యాశాఖ సంచాలకులు (Director,Public Instructions) గా 19161928 దాక పనిచేశాడు.

హైదరాబాదు రాజ్యంలో విద్యాభివృద్ధికోసం ఎంతగానో పాటుపడ్డాడు. విద్యకోసం ప్రభుత్వబడ్జెట్ ను ముందున్న దాని కన్నా ఎంతో ఎక్కువ పెంచేలా చేయగలిగాడు. 1254 నుంచి 4188 కి పాఠశాలల సంఖ్య; 93,289 మంది నుండి 2,87,821 దాక విద్యార్థుల సంఖ్యను వృద్ధిచేశాడు. ఇదేకాలంలో ఉర్దూ మాధ్యమంగా పైదరాబాదులో ఒక విశ్వవిద్యాలయం స్థాపించాలన్న ప్రతిపాదన బలంగా ముందుకు వచ్చింది. ఆరవనిజాం కాలంలోనే 1884 ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న ఆలోచనలు, చర్చలు వచ్చాయి. కానీ ఎందుకో ముందుకు సాగలేదు. నిజాం పుట్టినరోజు కానుకగా తనపేరు మీదుగా ఉస్మానియావిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ 26-4-1917న ఫర్మానా (ఆర్డర్) జారీ చేశాడు. అప్పటికే దేశంలో కలకత్తా, ముంబై, మదరాసు (1857), లాహోరు (నేటి పాకిస్తాన్లో. 1882) ఆలహాబాదు (1887) బనారస్, మైసూరు (1916) లలో విశ్వవిద్యాలయాలు వచ్చాయి. 1917లోనే పాట్నాలో కూడా ఒకటి ఏర్పడింది.

నిజాంప్రధాని సర్ అక్బర్ హైదరీ ఈ విశ్వవిద్యాలయాల పనితీరును అధ్యయనం చేయాలని సూచించాడు. ప్రముఖవిద్యావేత్త మౌల్వీ అబ్దుల్ హక్ ఉర్దూమాధ్యమంలో విద్యార్థులకు కావలసిన పాఠ్యగ్రంథాలను తయారుచేయించే బాధ్యత స్వీకరించాడు. ఇక్కడి విద్యాశాఖలో కీలకమైన అధికారి కావడంతో రాస్ మసూద్ కు ఉస్మానియావిశ్వవిద్యాలయం వివిధ విభాగాల తీరుతెన్నులు, బోధనబోధనేతర సిబ్బంది స్థాయిభేదాలు, జీతభత్యాలు, విద్యార్థి వసతులు, అధ్యయనస్థాయిభేదాలు మొదలైన సర్వ నియమనిబంధనల, ముసాయిదాల రూపకల్పన చేసిన ఘనత దక్కింది. విద్యార్థిగా ఆక్స్ ఫర్డ్ లో చదివిన అనుభవం, అక్కడి విద్యావిధానంతో సన్నిహిత సంబంధం, ఉత్తరాదివాడు కావడం వల్ల అక్కడి విశ్వవిద్యాలయాలతో పరిచయం వసూద్ కు ఇందుకు బాగా తోడ్పడ్డాయనవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్ అక్బర్ హైదరీ, మౌల్వీ అబ్దుల్ హక్, రాస్ మసూద్ ల మేధాశిశువు (Brain Child) ఉస్మానియావిశ్వవిద్యాలయం. నిజాంప్రభువు వీరికి అందించిన ఆశీస్సులు, ఇచ్చిన స్వేచ్ఛ సరేసరి.

కానీ రాస్ మసూద్ కు ఉర్దూమాధ్యమం పట్ల సదభిప్రాయమున్నట్లు తోచదు. నిజమే. ఉర్దూమాధ్యమం కాకుండా ఆంగ్లమాధ్యమంలో పెట్టిఉంటే తెలంగాణాలో వేగంగా ఆధునికత్వం వ్యాప్తి చెందేది. 1918 సెప్టెంబర్ 22న నిజాం మహరాజపోషకుని(Chief Pattern)గా, ప్రధాని అక్బర్ హైదరీ చాన్సలర్ గా విశ్వవిద్యాలయ కార్య నిర్ణయ సంఘమైన కౌన్సిల్ ఏర్పడింది. 1919 ఆగస్టు28న మౌలానా హబీబుర్ రహమాన్ తొలి వైస్ చాన్సలర్ గా, రాస్ మసూద్ ఆరట్స్ కళాశాల తొలి(తాత్కాలిక) ప్రిన్సిపాల్ గా ఉస్మానియావిశ్వవిద్యాలయం భౌతికంగా మొదలైంది. 1919లో ఇంటర్ మీడియేట్ తరగతులు మొదలయ్యాయి. విద్యార్థులు వచ్చేలోగా అధ్యాపకులను నియమించుకొనే బాధ్యత ప్రిన్సిపల్ రాస్ మసూద్ పై పడింది. లండన్ లో చదివిన ఈ.ఈ. స్పెయిట్, హుస్సేన్ అలీఖాన్, సయ్యద్ అబ్దుల్ లతీఫ్ లు ఆంగ్లశాఖ ఆచార్యులుగా నియమితులయ్యారు. లండన్ లో B.Sc, A.R.C.S :, F.R.A.S డిగ్రీలు పొందిన మహ్మద్ అబ్దుర్ రహమాన్ ఖాన్ భౌతికశాస్త్రశాఖలో ఆచార్యులయ్యారు. అబ్దుల్ సత్తార్ సిద్దిఖి తరువాత వీరు 1924లో ప్రిన్సిపాలయ్యారు.

ఇదేశాఖలో కలకత్తాలో B.Sc, చేసిన వాహిదుర్ రహమాన్ కూడా ఆచార్యులయ్యారు. రసాయనశాస్త్రశాఖ ఆచార్యులైన ముజఫరుద్దీన్ ఖురేషి పంజాబ్ లో M.Sc , బెర్లిన్ లో Ph.d కాగా తత్వశాస్త్రశాఖకు చెందిన ఖాలీఫా అబ్దుల్ హకీం M.A., L.LB, Ph.d (Heidelberg) ; చరిత్రశాఖ ఆచార్యులైన హరూన్ ఖాన్ షేర్వాణి, మిజ్రా అలీయార్ ఖాన్, గణితశాస్త్రశాఖకు చెందిన ఖాజీ హుస్సేన్ లండన్ లో చదివి వచ్చినవారే. కన్నడశాఖలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా వచ్చిన శ్రీకంఠయ్య 1921లోనే చనిపోయాడు. ఆంగ్లశాఖలో మొదటి ఆచార్యులైన ఎన్. జి.వెలింకర్ 1926లో రిటైరయ్యాడు. ఫార్సీ, అరబిక్, ఉర్దూ, కన్నడ, మరాఠీ అధ్యాపకులు నియమింపబడ్డారు. సంస్కృతంలో పండిత హరిహరరశాస్త్రి, తెలుగులో రాయప్రోలు సుబ్బారావు సహాయ ఆచార్యులయ్యారు. రాయప్రోలు వారు డిగ్రీలు లేకుండా సాహిత్యపరమైన కీర్తితో వచ్చారు. మదరాసులో జరిగిన ఒక పెద్దసభలో రవీంద్రనాథఠాగూరు తెలుగువారికి ఒకమహాకవి ఉన్నాడని రాయప్రోలువారిని చూపుతూ ప్రశంసించాడు. ఒయు ఏర్పాటును బలంగా సమర్థించిన రవీంద్రుడు స్వయంగా రాయప్రోలును సూచించాడని చాలామంది విశ్వాసం.

రాయప్రోలు దీన్ని ఖండించాడు. రాయప్రోలు వారు పేరుకు తెలుగు లెక్చరరే అయినా చాలా కాలం గ్రంథాలయవ్యవహారాలే చూశాడు. విద్యార్థులు లేకపోవడమే ఇందుకు కారణం. రాయప్రోలు 11.-10-.1919న ఉద్యోగంలో చేరాడు. కనుక మిగితావారు కూడ ఇంచుమించు ఆ నెలలోనే చేరి ఉంటారు. హైదరాబాదు విద్యారంగానికి మసూద్ చేసిన అపూర్వసేవకు ముగ్ధుడై నవాబ్ మసూద్ జంగ్ బహద్దూర్ అన్న బిరుదంతో సత్కరించాడు. తానే నియమించిన అబ్దుల్ సత్తార్ సిద్దిఖిని శాశ్వతప్రిన్సిపల్ గా చేసి మసూద్ తిరిగి విద్యాశాఖలో తన ఇతర బాధ్యతలమీద దృష్టి పెట్టాడు. రాస్ మసూద్ జపాన్ లో విద్యావిధానాలపట్ల వారి దృష్టికోణాన్ని అధ్యయనం చేయడానికి జపాన్ వెళ్ళాడు. అక్కడి ప్రభుత్వం విద్యావ్యవస్థపట్ల చూపే శ్రద్ధాసక్తులను, చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ఒక పుస్తకం రాశాడు.

హైదరాబాదులో విపరీతమైన పని వత్తిడి, అధికశ్రమతో మసూద్ అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో 1928లో ఉద్యోగానికి రాజీనామా చేసి చికిత్స నిమిత్తం జర్మనీ వెళ్ళాడు. అక్కడ కూడా విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి పరిష్కారాలగురించి ఆలోచించడం, చర్చించడం మానలేదు. ఇంతలో 1929 ఫిబ్రవరి9న అలీగడ్ విశ్వనిద్యాలయం కార్యనిర్వాహకసంఘం రాస్ మసూద్ ను వైస్ చాన్స్ లర్ గా ఎన్నుకొంది. ఆ కాలంలో కార్యనిర్వాహకసంఘం (Executive Council) సభ్యులు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుని ఓటింగ్ ద్వారా ఎన్నుకొనేవారు. పోటీకి అత్యున్నతమైన విద్యార్హతలు, అపారమైన అనుభవం ఉన్నవారినే పోటీకి నిలిపేవారు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి అలా ఎన్నికైన ఉపాధ్యక్షులు. తరువాతివారు నియమితులైన ఉపాధ్యక్షులు. రాస్ మసూద్ కు ఈ వర్తమానం చేరింది. సంతోషం వేసింది. ఈ సంగతి తెలిసి నిజాం కూడా మళ్ళీ తన దగ్గర పని చేయడానికి ఆహ్వానించాడు.

తన తాతగారి కలలపంట, పెంచిన పూదోట, తాను పసివయస్సులో ఆనందంతో కేరింతలు కొడుతూ ఊగిన ఊయల అలీగడ్ విశ్వవిద్యాలయం (అప్పటికది మహ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజి మాత్రమే. విశ్వవిద్యాలయంగా మారలేదు.). ఆ పేగుబంధం కొద్దీ రాస్ మసూద్ 1929 అక్టోబర్ 20న అలీగడ్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పదవీబాధ్యతలు స్వీకరించాడు. 1920లో ఏర్పడ్డ అలీగడ్ విశ్వవిద్యాలయం ఇంకా బాలారిష్టాలనుండి బయటపడలేదు. ఆర్థికవనరులలేమితో, దిశానిర్దేశం చేయగలిగిన నాయకత్వంలేమితో, అంతర్గతకుమ్ములాటలతో కునారిల్లుతుందనీ, ఈదుర్దశనుండి బయటపడవేయగలిగిన నాయకుని అవసరం ఎంతో ఉందనీ రహ్మతుల్లాకమిటీ స్పష్టంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో రాస్ మసూద్ చేతుల్లోకి అలీగడ్ విశ్వవిద్యాలయం వచ్చింది. అంతవరకు మన విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులంతా హైకో ర్టు న్యాయమూర్తులే. కలకత్తావిశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులైన అశుతోష్ ముఖర్జీ ఒక్కరు మాత్రం న్యాయమూర్తి, గణితంలో మేధావి. విద్యావేత్త అయిన మొదటి ఉపాధ్యక్షులన్న ఖ్యాతి రాస్ మసూద్‌కు దక్కింది. రాస్ మసూద్ విశ్వవిద్యాలయ అభివృద్ధికోసం యావచ్ఛక్తినీ వినియోగించి పాటుపడ్డాడు.

తాను చదివింది ఆంగ్లసాహిత్యమే అయినా వైజ్ఞానికశాస్త్రసాంకేతికరంగాల శాఖలవృద్ధికి ప్రాధాన్యమిచ్చాడు. ఇందుకు ప్రభు త్వం నుండి15లక్షలు, నిజాంప్రభువు తనకున్నపాత పరిచయంతో నిజాంప్రభువునుండి 10లక్షలు విరాళం పొందగలిగాడు. జునాగడ్, భూపాల్, భావల్ పూర్ సంస్థానాధీశుల సహకారాన్ని పొందాడు. దాంతో విశాలమైన ప్రాంగణాలను, అనువైన ప్రయోగశాలలను నిర్మించి సమర్థులైన అధ్యాపకబృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన నియమించిన అధ్యాపకులపేర్లు గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. భౌతికశాస్త్రంలో శామ్యూఎల్ ను తీసికొన్నాడు. ఆయనను ప్రఖ్యాతి గడించిన ఐన్ స్టెయిన్, సి.వి. రామన్ లు రికమెండ్ చేశారు. రసాయనశాస్త్రశాఖలో రాధాకృష్ణ అసూంది, హంటర్, ఆర్.డి. దేశాయి, సలాముజ్జమాన్ సిద్ధిఖిలు కొలువుదీరేలా చేశాడు.

ఆసియాఖండంలోనే తొలిసారిగా భూగోళశాస్త్రశాఖను స్థాపిం చి దానికి ఇబాదుర్ రహమాన్ ను అధ్యక్షునిచేసి ఎం.ఎ తరగతులను ప్రారంభింపచేశాడు.డి.డి.కోశాంబిని గణితశాస్త్రశాఖలోకి తీసుకొన్నాడు. వీరంతా ఆయా రంగాల్లో ప్రముఖులని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అధ్యాపకులు విదేశాలకు వెళ్ళి పిహెచ్.డి చేసేలా ప్రోత్సహించాడు. కేవలం అధ్యాపకులకే పరిమితమైన పిహెచ్.డిప్రోగ్రాంను ప్రప్రథమంగా విద్యార్థులకు కూడా విస్తరింపచేసిన ఘనత రాస్ మసూద్ కు దక్కుతుంది. ఫలితంగా బ్రిటిష్ విద్యాసంప్రదాయాలకు ధీటుగా నిలిచి అలీగడ్ విశ్వవిద్యాలయం నుంచి తొలిసారిగా రసాయనశాస్త్రంలోఒమర్ ఫరూఖి, రఫత్ హుస్సేన్‌లు డాక్టరేట్ పట్టాలు పొంది తరువాతివారికి స్ఫూర్తిగా నిలిచారు.

అధ్యాపకశిక్షణకళాశాలను, వ్యాయామశాలలను, విద్యార్థి వసతిగృహాలను, క్రీడాప్రాంగణాలను నిర్మింపచేసి విద్యాభివృద్ధికీ, ఆరోగ్యాభివృద్ధికీ సమప్రాధాన్యమిచ్చాడు. సమకాలీనరాజకీయనాయకులచేత వర్తమాన అంశాలమీద, శాస్త్ర, సాహిత్యవేత్తలతో వివిధ అంశాలమీదప్రసంగాలిప్పించాడు. 1937 లో జవహార్ లాల్ నెహ్రూను రాస్ మసూద్ అలీగడ్ కు ఆహ్వానించాడు. నెహ్రూజీ జాతీయోద్యమలక్ష్యాలగూర్చి ఎంతో ఉత్తేజభరితంగా మాట్లాడాడు. రాస్ మసూద్ ఆప్ఘనిస్తాన్ రాజు నాదిర్ షా ఆహ్వానం మేరకు ఆదేశంలో పర్యటించి అక్కడి విద్యావ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సూచనలు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నాదిర్ షా అలీగడ్ విద్యార్థులవిద్యాభివృద్ధి నిమిత్తం నెలకు రూ.300 ఉపకారవేతనాన్ని మంజూరు చేశాడు.

రాస్ మసూద్ విద్యారంగంలో చేస్తున్న సేవలకు మెచ్చి 1933లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదంతో సత్కరించింది. విశ్వవిద్యాలయం డిలిట్ పురస్కారంతో గౌరవించింది. తన తాతగారు నెలకొల్పిన సంస్థ అన్న మమకారం కొద్దీ, ఆరోగ్యాన్ని పణంగాపెట్టి అహోరాత్రాలు శ్రమపడి ఒక ఉన్నతస్థానంలో నిలిపాడు. క్రమేపి స్వార్థపరులు, సంకుచితపరులు, అనర్హులైన అధ్యాపకులు రాస్ మసూద్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టే పరిస్థితి కల్పించారు. హమారా మహబూబ్ వైస్ చాన్స్ లర్ అని విద్యార్థులచేత ప్రేమాభిమానాలతో పిలువబడిన రాస్ మసూద్ 1934 అక్టోబర్ లో రాజీనామా చేశాడు.

భూపాల్ రాజు, చిరకాలమిత్రుడైన సర్ నవాబ్ హమీదుల్లాఖాన్ ఆహ్వానంతో రాస్ మసూద్ అక్కడ విద్యాశాఖమంత్రిగా వ్యవహరించాడు. రెండేళ్ళు గడిచాయో, లేదో అనారోగ్యం విషమించింది. తీవ్రమైన గుండెపోటుతో 1937 జులై 30 న 48వ ఏట అకాలమరణం చెందాడు. ఆయన పార్థివదేహాన్ని భూపాల్ నుండి అలీగడ్ తెచ్చి తాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సమాధికి ఎడమవైపున సమాధి చేశారు. రాస్ మసూద్ కు ఒక కూతురు నదీరాబేగం, అన్వర్ మసూద్, అక్బర్ మసూద్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆంజుమన్ తరిఖి- ఉర్దూ ఆయన జీవితచరిత్రను 2011లో ప్రచురించింది. మహాకవి ఇఖ్బాల్ ,మౌలానా అబుల్ కలాం అజాద్, పండిట్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ ఫణిక్కర్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆచార్యు లు ఎఫ్. క్రుంఖోవ్, లండన్ కు చెందిన థియోడర్ మారిసన్ (తాత, తండ్రి చిన్నప్పుడే చనిపోతే రాస్ మసూద్ కు ఇండియా లో, లండన్ లోబాసటగా నిలిచిన వ్యక్తి) మొదలైనవారెందరో రాస్ మసూద్ కులమతాలకు, ఛాందసాలకు అతీతంగా ఎదిగి భారతదేశంలో విద్యాభివృద్ధులకోసం నిరంతరం పాటుపడిన ఉత్తమ దేశభక్తుడని పేర్కొంటూ శ్రద్ధాంజలి ఘటించారు.

బహుముఖప్రజ్ఞాశాలియైన రాస్ మసూద్ గురించి కొంత సమాచారాన్ని అందించిన అలీగడ్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖపూర్వాచార్యులు, ఆత్మీయ మిత్రులు షేక్ మస్తాన్ గారికి, ప్రస్తుత తెలుగు శాఖాధ్యక్షులు డా. పఠాన్ ఖాసీంఖాన్ లకు ధన్యవాదాలు. 1969లో అలీగడ్ విశ్వవిద్యాలయంలో ఒకదానికి రాస్ మసూద్ హాల్ మని పేరు పెట్టారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఉస్మానియావిశ్వవిద్యాలయంలో సయ్యద్ రాస్ మసూద్ సెమినార్ హాల్ ఏర్పాటు చేసి, ఒక ఉత్తమ దార్శనికుడైన విద్యావేత్తను తలుచుకొనేలా చేసిన ఆరట్స్ కాలేజి ప్రిన్సిపల్ ఆచార్య డి. రవీందర్ ప్రశంసనీయులు.