Friday, March 31, 2023

సార్…అడ్రసేక్కడ

- Advertisement -

hmda

= కనిపించని
హెచ్‌యండిఎ యంత్రాంగం
= శంషాబాద్, శంకర్‌పల్లి జోన్‌లలో కరువైన పర్యవేక్షణ
= అడుగడుగున అక్రమ లేఅవుట్‌లు, నిర్మాణాలు
= ప్లానింగ్ కాస్తా పైసల విభాగంగా మారిందని పలు విమర్శలు

మన తెలంగా/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అక్రమ లేఅవుట్‌ల జాతర కొనసాగుతుంది. హెచ్‌యండిఎ పరిధిలో లేఅవుట్‌లకు అనుమతులు ఇవ్వడానికి పంచాయతీ యంత్రాంగంకు కనీస అధికారం లేకపోయినా కాగితాల్లో కనిపించకుండానే సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు స్థానిక పంచాయతీ అధికారులు అనుమతులు ఇస్తుండటంతో అడుగడుగున అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. హైద్రాబాద్ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తుండటంతో రంగారెడ్డి జిల్లాలో రియల్ వ్యాపారం జోరు మీద సాగుతుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, చేవెళ్ళ, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు పూర్తిగా హెచ్‌యండిఎ పరిధిలో ఉండటంతో ఇక్కడ లేఅవుట్‌లు చేయడానికి ఖచ్చితంగా హెచ్‌యండిఎ అనుమతులు తీసుకోవలసి ఉండగా అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకోని ఉన్న పై నాలుగు నియోజకవర్గాలలో ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీలలో పది వరకు అక్రమ లేఅవుట్‌లు వెలుస్తుండటంతో పాటు యథేచ్ఛగా నిర్మాణాలు సైతం కొనసాగుతున్నాయి. పంచాయతీల అనుమతులతో లేఆవుట్‌లు చేస్తున్న రియల్టర్‌లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాలుగు రోడ్లు వేసి, విద్యుత్ స్తంభాలను పాతి ప్లాట్‌లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు తప్ప లేఅవుట్‌లో ప్రజా ప్రయోజనాల కోసం కనీసం గజం స్థలం కూడ వదలడం లేదని, డ్రైనేజీ, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కల్పన గురించి పట్టించుకోవడం లేదని ఇటీవల కాలం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు ఫిర్యాదులు వస్తున్నాయి. లేఅవుట్‌లలో కమ్యూనిటీ భవనం, పార్కు, ఇతర సౌకర్యాల కోసం స్థలం వదలడంతో పాటు వాటిని గ్రామ పంచాయతీ పేరు మీద రిజిస్టేషన్ చేసేలా రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి గతంలో పలు లేఅవుట్‌లు చేసిన రియల్టర్‌లకు నోటీసులు అందజేసిన అంతలోనే సైలెంట్ అయిపోయారు.
జాడలేని హెచ్‌యండిఎ యంత్రాంగం: లేఅవుట్‌లు ఏర్పాటు కోసం తమ వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతుల ప్రక్రియను పర్యవేక్షిస్తాం తప్ప సర్కార్ ఖజానాకు తూట్లు పొడుస్తు యథేచ్ఛగా అక్రమ లేఅవుట్‌లు వెలసిన తమకు సంబందం లేదన్నట్లు హెచ్‌యండిఎ యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్‌యండిఎలో పాగా వేసి అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రస్తుతం ఎసిబికి చిక్కకుండా పరారీలో ఉన్న ఓ బడా అధికారి కనుసైగలలో వసూళ్ల పర్వం కొనసాగిందని ప్రచారం జరుగుతుంది. ఔటర్ చుట్టు అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్‌లలో ప్రతి లేఅవుట్ నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి మిగత అధికారులను అటువైపు కన్నెతి కూడా చూడనివ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకర్‌పల్లి, శంషాబాద్ జోన్ పరిధిలో ప్రస్తుతం అడ్డగోలుగా అక్రమాల జాతర సాగడానికి పంచాయతీ యంత్రాంగం సహాయ సహకారాలు పూర్తిగా ఉండటంతో పాటు హెచ్‌యండిఎ యంత్రాం గం సైతం అంతే స్థాయిలో సహకరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శంకర్‌పల్లి ,శంషాబాద్ ప్లానింగ్ అఫీసర్‌లతో పాటు ఇతరులు పూర్తిగా తార్నాకలోని ప్రధాన కార్యాలయంకు పరిమితం అవ్వగా లేఅవుట్‌లు, నిర్మాణాలు చుట్టు కొంత మంది తిరుగుతు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
హెచ్‌యండిఎ సిబ్బంది ఒకరు శంషాబాద్ జోన్‌లో చేస్తున్న వసూళ్ల వ్యవహారం స్థానికంగా తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతుంది. సదరు వ్యక్తి అనుమతి లేనిది అక్కడ ఒక్క లేఅవుట్ కాని నిర్మాణం కూడ జరిగే ప్రసక్తిలేదని సమాచారం. శంషాబాద్, శంకర్‌పల్లి జోన్‌లు ప్రస్తుతం హెచ్‌యండిఎ, పంచాయతీ, రెవె న్యూఅధికారుల పాలిట కల్పతరువుగా మారాయని ఇక్కడ పోస్టింగ్ వస్తే చాలు కోట్ల సంపా దనతో పడగెత్తవచ్చన్న చర్చ చాలా మందిలో సాగుతుంది. రెండు జోన్‌ల పరిధిలో దాదాపు వందకు పైగా అక్రమ లేఆవుట్‌లు ప్రస్తుతం నడుస్తున్నాయంటే పరిస్థీతులు అర్దం చేసుకోవచ్చు. కాసుల మత్తులో మునిగి తేలుతున్న క్రింది స్థాయి యంత్రాంగంను గాడిలో పెట్టడానికి ఉన్నతాధికారులు ప్రయత్నించవలసిన అవసరం చాలా వరకు ఉంది.
ఆదేశాలు జారీచేసినా అమలేక్కడ…
అక్రమ లేఅవుట్‌లను అడ్డుకోవడానికి కొంత మంది అధికారులు కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం తప్ప వాటి ని అమలును పట్టించుకోవడం లేదు. శంకర్‌పల్లి జోన్‌లో అక్రమ లేఅవుట్‌లపై చర్యలు తీసుకోవాలని హెచ్‌యండిఎ యంత్రాంగం గతంలో ఆదేశాలు జారీచేసిన రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారులు తమ వద్ద సిబ్బంది లేరన్న కుంటి సాకులతో వాటిని అమలు చేసిన దాఖలాలు లేకపోవడంతో యదేచ్చగా సదరు గ్రామంలో యథేచ్ఛగా అక్రమాల జాతర సాగింది. రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారులు రియల్టర్‌లకు అనుచరులుగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News