Home తాజా వార్తలు సిరిసిల్ల అందాలు పెంచుతున్న లవ్‌ క్లాక్…

సిరిసిల్ల అందాలు పెంచుతున్న లవ్‌ క్లాక్…

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన లవ్ క్లాక్ అందరిని ఆకర్షిస్తోంది. జిల్లా కేంద్రంగా మారిన సిరిసిల్లలో రోడ్ల విస్తరణ పనులను చేపట్టారు. రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. అవకాశం ఉన్న చోట డివైడర్ల మధ్యలో చెట్లు నాటించారు. ముఖ్యమైన కూడళ్లలో నీటి ఫౌంటేన్‌లు, రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. మానేరు నదిలో బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా చేసే ప్రయత్నాలను ఎంఎల్‌ఎ KTR సహకారంతో ముందుకు తీసుకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో లవ్ క్లాక్ ( సిరిసిల్ల ప్రేమ గడియారం ) ఏర్పాటు చేశారు. నైజాం రాజుల కాలంలో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో టవర్‌క్లాక్‌లను ఏర్పాటు చేశారు. వాటికి ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటివి స్వాతంత్య్రానంతరం దాదాపుగా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత ప్రభుత్వం లవ్ సింబల్‌ను హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసింది. దానికి ఆదరణ కూడా బాగానే లభించింది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన లవ్ సిరిసిల్లలో ఎల్‌ఓవిఇ పదాల్లో ఓ అనే అక్షరంలో పెద్ద గడియారాన్ని అమర్చారు. ఇదో ఆకర్షణగా మారింది. పలువురు లవ్ సిరిసిల్ల గడియారం వద్ద ఫోటోలు దిగుతున్నారు. సిరిసిల్ల పట్టణానికి ఇదో అకర్షణగా మారింది. సిరిసిల్ల నుండి కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వేములవాడ తదితరు ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు కనిపించేలా లవ్ సిరిసిల్ల క్లాక్‌ను ఏర్పాటు చేయడంతో అది ప్రయాణీకులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది.

 

Siricilla beauty is growing with love clock