Home ఎడిటోరియల్ ప్రభుత్వరంగానికి స్వస్తి!

ప్రభుత్వరంగానికి స్వస్తి!

Sampadakiyam     ప్రధాన దేశాభివృద్ధి రంగాలన్నింటినీ ప్రైవేటు పెట్టుబడులకు విశేషంగా తెరచిన చేత్తోనే ప్రభుత్వరంగ పరిశ్రమలను కూడా బడా వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు అప్పగించాలని నిర్ణయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఐదు రోజుల వివరణాత్మక ఉద్దీపన కచేరీకి తెరదించారు.

పబ్లిక్ రంగానికి పూర్తిగా తెర దించివేసే కార్యక్రమానికి నూతన సమన్విత ప్రభుత్వరంగ సంస్థల విధానం అని నామకరణం చేశారు. దేశ ఆర్థిక వికాసానికి, భద్రతకు తోడ్పడడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను గరిష్ఠంగా నాలుగికి కుదిస్తామని చెప్పారు. ఈ రంగంలోకి ప్రైవేటును అనుమతిస్తామన్నారు. స్వావలంబన భారత దేశ అవతరణకు అవసరమైన చర్యగా దీనిని ఆమె అభివర్ణించారు. ప్రభుత్వరంగంలో పుట్టగొడుగుల్లా సంస్థలు పుట్టుకు రావడాన్ని నిరోధిస్తామన్నారు. ఇటీవల పలు ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసిన వైనం ఇక్కడ గుర్తుకు రాకమానదు. విశాల జనహిత కేంద్రక స్థితి నుంచి దేశాన్ని ప్రైవేటు శక్తుల విశేష లాభార్జన ప్రధానమైన లక్షం వైపు మళ్లించే వ్యూహ నిర్మాణాన్ని నిర్మలా సీతారా మన్ విజయవంతంగా పూర్తి చేశారు.

దేశమంతా కరోనా లాక్‌డౌన్‌లో ఇళ్లకే కట్టుబడి ఉన్న ప్రస్తుత స్థితిని ప్రధాని మోడీ ప్రభుత్వం తనకు అత్యంత ప్రీతిపాత్రులైన అతి సంపన్నుల చేతుల్లోకి ఆర్థిక రంగాన్ని పూర్తిగా నెట్టివేసేందుకు ఉపయోగించుకున్నది. దేశ భద్రతకు, వికాసానికి ముఖ్యంగా నిరుపేద ప్రజాకోటి సంక్షేమానికి మూలాధారమైన వ్యవస్థలను ప్రభుత్వమే స్వయంగా నడపడం ద్వారా జనాభ్యుదయ లక్షాలను సాధించుకోడానికి స్వతంత్ర భారత పాలకులు పటిష్ఠమైన పునాదుల మీద ప్రభుత్వ రంగాన్ని నెలకొల్పారు. వ్యవసాయ ప్రధానమైన భారత దేశాన్ని పారిశ్రామిక వంతం చేయడం కోసం పబ్లిక్ రంగాన్ని సమర్థవంతమైన సాధనంగా వినియోగించారు. కీలక విభాగాలను ప్రభుత్వ రంగంలో, మిగతా వాటిని ప్రైవేటులో ఉంచుతూ మిశ్రమ ఆర్థిక విధానాన్ని దశాబ్దాల తరబడిగా అవలంబించి చెప్పుకోదగిన సంక్షేమ ప్రయోజనాలను సాధించారు.

కాలక్రమంలో బ్యాంకులను కూడా ప్రభుత్వరంగంలోకి తీసుకు వచ్చి దళిత, అణగారిన వర్గాల ప్రజలకు విరివిగా రుణాలిప్పించి స్వయం ఉపాధులు కల్పించారు. ఎన్నో మంచి పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ప్రభుత్వరంగంలో నెలకొన్నాయి. శాస్త్రీయ విజ్ఞానాన్ని, పరిశోధనను పెం పొందించి అంతరిక్షంలో సైతం మన జెండాను రెపరెపలాడించిన ఇస్రో వంటి గొప్ప వ్యవస్థలు వెలిశాయి. అలాగే ఎన్‌టిపిసి, ఒఎన్‌జిసి, సెయిల్, భెల్, సిల్, గెయిల్, బిపిసిఎల్, పవర్ గ్రిడ్ వంటి మహారత్నా సంస్థలు, బెల్, హాల్, ఎంటిఎంఎల్, ఎన్‌ఎండిసి వంటి నవరత్నాలు మరెన్నో మినీ రత్నాలు రూపు దిద్దుకొని దేశ వికాసానికి విశేషంగా తోడ్పడ్డాయి. అలాగే ఉద్యోగాల కల్పనలోనూ ఉపయోగపడ్డాయి. కాలక్రమంలో పలు బలహీనతలు చోటు చేసుకుని నిర్వహణ నీరసించిపోడంతో ఈ సంస్థల్లోని కొన్ని ప్రభుత్వానికి మోతబరువైపోయిన మాట వాస్తవమే.

ఆ లోపాలను సరిదిద్ది మళ్లీ సమర్థమైన నిర్వహణను సమకూర్చి ఉంటే అవి కోలుకోడం, జాతికి మరింత మేలు చేయడం జరిగి ఉండేవి. సోషలిస్టు తరహా సమాజ స్థాపనకు కృషి చేస్తానని చెప్పుకున్న విశిష్ట రాజ్యాంగం మాటునే నూతన ఆర్థిక సంస్కరణల పేరిట ప్రైవేటైజేషన్ బుల్‌డోజర్ విధానం 18 ఏళ్ల క్రితం అవతరించి రానురాను ఉధృతమవుతూ వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసిలు అత్యంత లాభదాయక పబ్లిక్ రంగ సంస్థలుగా అవతరించినట్టు 201718 లో జరిపిన ఒక సర్వే నిగ్గు తేల్చింది. అలాగే కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా లాభాల బాటలో పరుగులు తీసిన 10 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్నాయని వెల్లడయింది. ప్రైవేటైజేషన్ నడగొండ విరుచుకుపడిన తర్వాత కూడా దానిని తట్టుకొని ఇన్ని ప్రభుత్వరంగ సంస్థలు లాభాల్లో నడిచాయంటే స్వాతంత్య్రానంతర భారత పాలకులు రచించిన వ్యూహం ఎంత గొప్పదో అర్థమవుతున్నది.

అప్పుడే స్వాతంత్య్రం పొందిన దేశానికి సకల మౌలిక సదుపాయాలను కల్పించడంలో చెప్పుకోదగిన చరిత్రాత్మకమైన పాత్ర పోషించిన పబ్లిక్ రంగాన్ని క్రమక్రమంగా నీరుగారుస్తూ వచ్చిన ఇప్పటి పాలకులు దానికి పూర్తిగా చితి పేర్చడానికి సిద్ధం కావడం శోచనీయం. ఇప్పటికే విద్య, వైద్య రంగాలలో ప్రైవేటుకు ఎత్తు పీటవేసి వాటి నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్న నిర్వాకం పేదల జీవన భద్రతను దారుణంగా బలి తీసుకున్నది. ప్రస్తుత కరోనా అపూర్వ సంక్షోభంలో దేశ ప్రజలను ఆదుకుంటున్నది ప్రభుత్వాసుపత్రులు, వైద్యులేనన్న కళ్ల ముందరి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే పబ్లిక్ రంగాన్ని సమూలంగా తుడిచిపెట్టడం వల్ల జనహితానికి ఎటువంటి చెప్పనలవికాని హాని కలుగుతుందో ఊహించవచ్చు.

Sitharaman announcing details of economic package