Home అంతర్జాతీయ వార్తలు క్రైస్ట్‌చర్చ్ మృతుల్లో భారతీయులు

క్రైస్ట్‌చర్చ్ మృతుల్లో భారతీయులు

Christchurch shootings

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌లోని మసీదుల్లో శుక్రవారం జరిపిన కాల్పుల ఘటనలో మృతి చెందిన వారిలో ఆరుగురు భారతీయులున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌లోని టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన ఫర్హాజ్ అహ్సన్ కాగా, మరొకరు కరీంనగర్ జిల్లాకుచెందిన ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. ఇంజనీర్ అయిన ఫర్హాజ్ గత ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు. తీవ్రంగా గాయపడిన పర్హాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మరోవైపు జాడ తెలియకుండా పోయిన మరో భారతీయుడు ముసా వలీ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతని సోదరుడు హాజీ అలీ పటేల్ చెప్పినట్లు ఎఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. జాడ తెలియకుండా ఉన్న భారతీయుల క్షేమ సమాచారాల గురించి తాను ఎప్పటికప్పుడు న్యూజిలాండ్ అధికారులపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాని, వారి కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నానని న్యూజిలాండ్‌లో భారత దౌత్యాధికారి సంజీవ్ కోహ్లీ ఒక ట్వీట్‌లో తెలియజేశారు. ఈ దాడుల్లో నష్టపోయిన భారతీయులు ఎవరైనా సరే సహాయం కోసం తమ దౌత్య కార్యాలయాన్ని సంప్రతించవచ్చని కూడా ఆయన తెలిపారు. అందుకోసం దౌత్య కార్యాలయం రెండు టెలిఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది.
కోర్టులో దుండగుడి వెకిలినవ్వులు
న్యూజిలాండ్‌లో మసీదుల్లో కాల్పులకు తెగబడిన షూటర్ బ్రెంటన్ టారెంట్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచినప్పుడు అతని ముఖంలో ఎలాంటి బాధకానీ, పశ్చాత్తాపం కానీ మచ్చుకు కనిపించలేదు. పైగా బోనులో నిలుచున్నప్పుడు అతను వెకిలి నవ్వులు నవ్వాడు. చేతులకు బేడీలతో తెల్లటి దుస్తులు ధరించి ఉన్న టారెంట్‌ను ఇద్దరు పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఆస్ట్రేలియాకు చెందిన టారెంట్ జాత్యహంకారంతోనే శుక్రవారం మసీదుల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 49 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు జడ్డి ఒక్కటొక్కటిగా తనపై మోపిన అభియోగాలను చదివి వినిపిస్తున్నప్పుడు టారెంట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా వెకిలిగా నవ్వుతూ కనిపించాడు. మరో వైపు టారెంట్ తరఫు లాయరు అతనికి బెయిలు కూడా కోరలేదు. దీంతో పోలీసులు ఈ కేసు తదుపరి విచారణ అయిన ఏప్రిల్ 5వరకు కస్టడీలోకి తీసుకున్నారు. అతనిపై ఊచకోతకు సంబంధించిన కేసులను నమోదు చేయవచ్చని తెలుస్తోంది.
మరోవైపు న్యూజిలాండ్ వాసులు క్రైస్ట్ చర్చ్ మసీదుకాల్పుల బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తమ దేశ చరిత్రలోనే అత్యంతఘోరమైన సంఘటనగా భావిస్తున్న ఈ కాల్పుల్లో పారణాలు కోల్పోయిన ముస్లిం కుటుంబాలకు వారు క్షమాపణలు చెప్తున్నారు. ఎప్పుడు ఎలాంటి సాయం కావలసినా తమను సంప్రదించాల్సిందంటూ పెద్దలు అల్ నూర్ మసీదుకు దగ్గర్లో తాత్కాలికంగా మెమోరియల్ ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్‌లో ఫోన్ నంబర్లు షేర్ చేసుకుంటూ ఉంటే, చిన్నారులు తమ బొమ్మలు, పువ్వులు, గ్రీటింగ్ కార్డులు అక్కడ ఉంచి శాంతి సందేశాన్ని అందిస్తున్నారు. మరో వైపు పోలీసులు ఈ కాల్పుల్లో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు ఇంకా అప్పగించనప్పటికీ వారి సామూహిక ఖననానికి స్థానికులు పాత శశానంలో గోరీలను సిద్ధం చేస్తూ కనిపించారు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులను కాపాడడానికి డాక్టర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. క్షతగాత్రుల్లో రెండేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలిక కూడా ఉన్నారు. వీరి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. మరోవైపు బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజలు భారీ మొత్తలో విరాళాలు సేకరిస్తున్నారు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ శనివారం నగరానికి వచ్చి మృతుల కుటుంబాల వారిని, ప్రాణాలతో బైటపడిన వారిని కలిసి సానుభూతి తెలియజేశారు. బాధితుల్లో టర్కీ, బంగ్లాదేశ్ ఇండోనేసియా, మలేసియా, భారత్ లాంటి పలు దేశాలకు చెందిన వారున్నారని, ఆయా దేశాల దౌత్యకార్యాలయాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్నామని ప్రధాని చెప్పారు. చనిపోయిన వారిలో ఒక సౌదీ అరేబియా పౌరుడు, ఆద్దరు జోర్డాన్ దేశస్థులుండగా, అయిదుగురు పాకిస్తానీల జాడ తెలియడం లేదు.

Six Indians dead in New Zealand massacre