Home కెరీర్ పోటీ ప్రపంచంలో ఎదగాలంటే..!

పోటీ ప్రపంచంలో ఎదగాలంటే..!

Competition-Exams-image

ఎంత ప్రతిభ ఉన్నా నేడు రాణించడానికి ఎక్కువగానే కష్టపడాల్సి వస్తోంది నేటి విద్యార్థులు. గణితం, సైన్సు సబ్జెక్టుల్లో అపార జ్ఞానం ఉన్నంత మాత్రాన అది సరిపోవడం లేదు. పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే జీవన నైపుణ్యాలపై పట్టు ప్రస్తుతం అన్ని సంస్థలు కూడా అభ్యర్థి నైపుణ్యాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. విదార్థులు, పట్టభద్రులు, ఉద్యోగవేటలో ఉన్న అభ్యర్థులు ముఖ్యంగా  సాఫ్ట్‌సిల్స్‌ను నేర్చుకుంటే ఆయా రంగాలలో రాణించడం సులభమౌతుంది. కాలంతోపాటు మారుతున్న ప్రపంచంలో కొత్తగా వస్తున్న మార్పులను గమనించాలి. నేర్చుకోవాలనే తపన, జీవితంలో ఎదగాలనే పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చంటున్నారు నిపుణులు. చదువుతోపాటు విద్యార్థులకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలో తెలుసుకుందాం… 

టీమ్ వర్క్: ఉద్యోగం చేసే ప్రాంతంలో సైతం ఇతరుల సహకారం తీసుకోవటం ఉత్తమం. బృందాలుగా ఏర్పడి చేయాల్సిన ప్రాజెక్టుల్లో ఈ నేర్పు ఆవశ్యకం. ఇతరులతో కలసి పనిచేస్తే వారు ఎత్తిచూపే తప్పొప్పుల వల్ల మనం మరింతగా మెరుగుపడవచ్చు. అయితే వీటిని సవాళ్లుగా తీసుకోవాలి. ప్రతికూల దృక్పథంతో చూడకూడదు. విమర్శకులు ఉన్నప్పుడే లోపాలను సవరించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఎవరి సాయం లేకుండా నేను పనిచేసుకోగలను అన్న ధీమా ఉండకూడదు. జీవితంలో ఎదగటానికి పరస్పర సహకారం కీలకం. క్రీడలు, విద్యేతర అంశాల్లో ఇది తప్పనిసరి. క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే కెప్టెన్ ఒక్కడే బాగా ఆడితే సరిపోదు. టీం సభ్యులందరూ ఆడితేనే విజయం సాధిస్తారు. కళాశాల స్థాయి నుంచే ఈ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి.

సంభాషణా చాతుర్యం : ఇతరులతో సంభాషణను ఎలా కొనసాగించాలో నేటి యువతకు తెలియదని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నలను అడగటంలోనూ, ఉత్సాహంగా వినటంలో, ఎదుటివారి కళ్ళలోకి చూసి మాట్లాడే విషయంలోనూ వారు విఫలమవుతున్నారని అంటున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రపంచంలోని యువతను ఏకం చేస్తున్నాయి. అయితే వీటి వల్ల పరస్పర పరిచయాలు, టెలిఫోన్ సంభాషణలూ తగ్గిపోయాయి. కళాశాలల్లోని విద్యార్థులు కేవలం తమలో తామే కాకుండా ప్రొఫెసర్లతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. దీని వల్ల వారి నుంచి విలువైన సలహాలను, సూచనలను పొందవచ్చు. ఇవి జీవితంలో ఎదగటానికి ఉపయోగపడతాయి.

ఈ నైపుణ్యం లేకపోతే కళాశాల దశలో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో మెరుగైన ఫలితాలను సాధించలేరు. ఈ లోపం ఉన్నవారు దీన్ని అధిగమించాలంటే అధ్యాపకులతో భయం లేకుండా మాట్లాడే చొరవ చూపాలి. సబ్జెక్టులో సందేహాలు వస్తే తమ ప్రొఫెసర్లతో సంభాషిస్తూ వాటిని నివృత్తి చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్ సైతం కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు చక్కని మార్గం.
– సమస్యల పరిష్కారం వెతుక్కోవాలి: విద్యార్థులకు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకోవటానికి ఇతరుల సహాయం ఎల్లప్పుడూ లభిస్తుందని భావించకూడదు. ఎవరికి వారే సొంతంగా సృజనాత్మకంగా వాటిని పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. నూతన పద్ధతుల్ని నేర్చుకోనివారు, నేర్చుకోవాల్సిన అంశం నుంచి పక్కదారి పట్టినవారు భవిష్యత్తులో వచ్చే ఆపదలను గట్టెక్కటంలో ఇబ్బందులు పడతారు. దీన్ని అధిగమించేందుకు విద్యార్థులు ప్రయోగాత్మక విధానంలో అభ్యసించాలి. ప్రతికూల పరిస్థితులను నూతన విధానాల ద్వారా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తరచుగా చర్చా గోష్ఠులు, సైన్స్ ఒలింపియాడ్ వంటి వాటిల్లో పాల్గొనాలి.

టైం మేనేజ్‌మెంట్: విద్యాభ్యాస సమయంలోనే సమయపాలన చాలా అవసరం. నియమిత వ్యవధిలో జరిగే పరీక్షల్లో దీని ప్రయోజనం అపారం. విద్యా, ఉద్యోగ దశల్లో అధ్యాపకులు/ అధికారులు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయటానికి సమయ నిర్వహణ ఆవశ్యకం. సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవటానికి, ప్రాధాన్యం ఆధారంగా పనుల్ని పూర్తిచేయటానికి సమయపాలనను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. ఉద్యోగులు ఏకకాలంలో అనేక ప్రాజెక్టులను చాకచక్యంగా చక్కని పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాల, కళాశాలల స్థాయి నుంచే వివిధ పనుల బాధ్యతలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్, స్వచ్ఛంద సేవ, ఇతర అవకాశాల వల్ల కూడా పనుల ప్రాధాన్యక్రమం, వాటి నిర్వహణలో సమర్థత, అనుభవం అలవడతాయి.

నాయకత్వ లక్షణాలు అవసరం: బృందంలో పనిచేస్తున్నప్పుడు సభ్యుడిగానే కాదు, కొన్నిసార్లు నాయకుడిగా కూడా ఉండాల్సి రావచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కళాశాలలో కానీ, ఉద్యోగంలో కానీ అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవాలి.
నియామక సంస్థలు ఎప్పుడూ నాయకత్వ పటిమ ఉన్నవారి కోసం వెతుకుతాయి. వీటిని పెంచుకునేందుకు విద్యార్థులు పాఠశాల, కళాశాల స్థాయుల నుంచే ప్రయత్నిస్తే మంచిది.

ఇంటర్న్‌షిప్, స్వచ్ఛంద సేవ, ఇతర అవకాశాల వల్ల కూడా పనుల ప్రాధాన్యక్రమం, వాటి నిర్వహణలో సమర్థత, అనుభవం అలవడతాయి