*పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ పొరపాట్లు లేకుండా జరగాలి
*మార్చి 11నే అందరికీ అందించాలనే తొందరపాటు వద్దు వివరాలు నిర్దుష్టంగా ఉండేలా క్షుణ్ణంగా పరిశీలించాలి
*కొంత సమయం తీసుకున్నా ఫర్వాలేదు అసైన్డ్‌కు కూడా పాస్‌బుక్‌లు ఇవ్వాలి : సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : అర్హులైన పట్టాదారులతోపాటు అసైన్డ్ భూములు కలిగినవారికి కూడా కొత్త పాస్‌బుక్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 11వ తేదీనే పట్టాదారు పాస్‌బుక్‌లన్నింటినీ పంపిణీ చేసి తీరాలనే తొందరలో పొరపా ట్లు జరగడానికి ఆస్కారం ఇవ్వవద్దని, పాస్‌బుక్‌లో నమోదయ్యే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి కొంత సమయం తీసుకున్నా అభ్యంతరంలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సలహాదారు అనురాగ్‌శర్మ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వరి తివా రి తదితరులతో ప్రగతి భవన్‌లో శుక్రవారం సమీక్ష జరిపిన సిఎం, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న అసైన్డ్ భూ ములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలని, వారి పేరుమీదనే పాస్‌బుక్‌లను రూపొందించాలని అధికారులను సిఎం ఆదేశించారు. పాస్‌బుక్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, పొరపాట్లు దొర్లకుండా చూడడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, తొందరపాటు అవసరం లేదన్నారు. ‘మార్చి 11నే పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించిన మాట నిజం. అయితే అ సైన్డ్ భూముల యజమానులను గుర్తించడం, వివరాలను పరిశీలించడం, వ్యవసాయేతర భూముల వివరాలను నమోదుచేయడం లాంటి పనులన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి పాస్ పుస్తకాల తయారీ పక్కాగా జరిగిన తర్వాతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలి’ అని సిఎం స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన పేర్కొనింది. వ్యవసాయ భూమి కలిగిన రైతుకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉన్నట్లయితే ఆ వివరాలను కూడా పాస్‌బుక్‌లో నమోదు చేయాలని, ఇందుకోసం అదనంగా ఒక కాలమ్‌ని పెట్టాలని ఆదేశించారు. ప్రతి రైతు ఆధార్ నెంబర్‌ను పాస్‌బుక్‌కు అనుసంధానం చేయాలని, భూరికార్డులకు దీన్నిఅనుసంధానం చేయడానికి మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లోని రైతులు ముందుకు రావడంలేదని, ఒకవేళ ఆధార్ నెంబర్ లేనట్లయితే ఆ భూముల్ని ‘బినామీ ఆస్తు’లుగా గుర్తించాల్సి ఉంటుందని, ఇప్పటికైనా ఆ నెంబర్లను అధికారులకు ఇవ్వాలని స్పష్టంచేశారు. స్వంతభూమితో పాటు కొద్ది మంది రైతులు అసైన్డ్ భూముల్ని కూడా సాగుచేస్తున్నందున ఆ వివరాలను కూడా సేకరించాలని, కలెక్టర్లతో మాట్లాడి కచ్చితమైన వివరాలను తెప్పించాలని, వారికి కూడా పాస్‌బుక్‌లను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అసైన్డ్ భూములు కలిగినవారికి కూడా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.