Thursday, April 25, 2024

ధూమపానాన్ని నిషేధించలేమా?

- Advertisement -
- Advertisement -

smoking

21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు గురిలో ఒకరి మృత్యువు కేవలం ధూమపానం కారణంగానేనని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. ప్రస్తుతం మహిళల్లోనూ ధూమపానం చేసేవారు అధికమవుతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని డబ్ల్యుహెచ్‌ఒ ఆందోళన వ్యక్తం చేసింది. ఆగ్నేయాసియాలో గంటకు 150 మంది వరకు కేవలం పొగాకు వినియోగం వల్లనే మరణిస్తున్నారని డబ్లుహెచ్‌ఒ వెల్లడించిన తర్వాత కూడా పొగాకు సాగును ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం. పొగాకు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే మరొక పక్క సాగును ప్రోత్సహించడం ఏమేరకు సమంజసమో పాలకులు ఆలోచించాలి.

రోజా మొక్కకు ముళ్లు, మొగ్గలుంటాయి. ముళ్లు గుచ్చుకున్నప్పుడు నొప్పి కలుగుతుంది. మొగ్గలు లభ్యమైనప్పుడు ముఖం వికసిస్తుంది. ఈ వికార వికాసాలు ఆయా వ్యక్తుల మనోభావాలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం చేసే చట్టాలు కొందరికి బాధ కలిగించవచ్చు. మరి కొందరికి ఎంతో ఊరట కలిగించవచ్చు. పాలకులు ఇలాంటి విషయాల్లో సమగ్రమైన అధ్యయనం చేసి తాము చేసే చట్టాల వల్ల ఎవరికి ఉపయోగం? మరెవరికి నష్టం? నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలి? అమలులో సాధక బాధకాలు, సాధ్యాసాధ్యాలు అసలు ఆ చట్టం అమలు చేసే సామర్థ్యం అందుకు తగిన సిబ్బంది ఉందా? తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి చట్టం చేయాలి.

పొగాకు విషయంలో పాలకులు అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు దారితీస్తున్నది. ఎలాంటి అధ్యయనాలు, సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండానే చట్టాలు చేస్తున్నారనే విమర్శలను కొట్టిపారేయలేం. వాస్తవానికి మద్యపానం, ధూమపానం రెండూ మానవ జాతిని పట్టి పీడిస్తున్న రెండు భూతాలు. ఇందులో మరో వాదనకు తావు లేదు. మద్యపానాన్ని పెంచిపోషిస్తూ ఆదాయ వనరుగా మలుచుకుంటున్న పాలకులు, ధూమపానం విషయంలో ఏదో చర్యలు తీసుకుంటున్నట్లు కన్పించడం, కొంతలో కొంత నయమని చెప్పొచ్చు. ఊపిరితిత్తుల కేన్సర్, మరెన్నో రోగాలకు ధూమపానం కేంద్ర బిందువని ఎందరో వైద్య నిపుణుల అధ్యయనంలో తేలింది.

ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మందికిపైగా ధూమపానంలో మునిగి తేలుతున్నారు. భారతదేశానికి సంబంధించి దాదాపు 20 కోట్ల మంది పొగాకుకు అలవాటుపడ్డారు. ఇందులో బీడీలు తాగేవారే ఎక్కువ మంది ఉన్నారు. బీడీలు, సిగరెట్లు తాగడం సరదాగా ఆరంభమై ఆ తర్వాత అలవాటుగా మారిపోతున్నది. పదిహేనేళ్ల వయస్సులోనే ఇది ఆరంభం కావడం ఆందోళన కలిగించే అంశం. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఇందువల్ల వివిధ రోగాలబారిన పడుతుంటే లక్షలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ధూమపానం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదనే విషయం అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.

పొగాకు ఉత్పత్తికి చెందిన లాభాలలో అధిక శాతం స్థానిక పొగాకు రైతుల కంటే పెద్ద పొగాకు సంస్థలకు వెళ్తాయి. అనేక దేశాలలో పొగాకు వ్యవసాయం కొరకు ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. అతిపెద్ద పొగాకు సంస్థలు ప్రపంచ పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహించాయి. కనీసం 50 దేశాల్లో ఫిలిప్ మోరిస్, బ్రిటీష్ అమెరికన్ టొబాకో, జపాన్ టొబాకో 12 దేశాల నుండి ముడి పొగాకును కొనుగోలు చేస్తాయి. ఈ ప్రోత్సాహం, ప్రభుత్వ రాయితీలతో పాటు పొగాకు విపణిలో మెరుగ్గా ఉంది. ఈ మిగులు తక్కువ ధరలకు దారితీసింది, ఇవి చిన్న తరహా పొగాకు రైతులకు వినాశకరమైనవి.

పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి డిజైన్‌లు వంటి ఆర్భాటాలు లేకుండా మామూలు ప్యాకింగ్ రూపంలో జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్యకరమైన హెచ్చరికలు, చిత్రాలతో పాటు తయారు చేసిన కంపెనీ పేరు, ఉత్పత్తి పేరు నిర్ణీత పరిణామంలో ముద్రించాలని కూడా సూచించింది. ఇలాంటి ఎన్నో సూచనలు చేస్తున్నా, చట్టాలు చేస్తున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పురావడం లేదు. ఆగ్నేయాసియాలోని 11 దేశాల్లో 24కోట్ల మందికి పైగా ధూమపానంలో మునిగి తేలుతుండగా 29 కోట్ల మంది పొగాకును ధూమపానేతర ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. భారతదేశానికి సంబంధించి కూడా వినియోగం పెరిగిపోతున్నది. సిగరెట్ పొగలో నాలుగు వేల ఎనిమిది వందలకుపైగా ప్రమాదకర విష వాయువులు ఉన్నాయని గుర్తించారు. ఇవి అనేక రోగాలకు మూలమవుతున్నాయని డాక్టర్లే వెల్లడించారు. ప్రాణాంతక పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 2003 నుంచే చర్యలు ప్రారంభించాయి.

అప్పుడు తెచ్చిన చట్టం బహిరంగ ధూమపానాన్ని నిషేధించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా పొగాకు వినియోగానికి సంబంధించిన ప్రకటనలను నిలిపివేశారు. వీటి ఫలితంగా 2010 నాటికే ధూమపానం చేసేవారి సంఖ్య భారత్‌లో ఆరు శాతం తగ్గిందని లెక్కలు చెప్పుకున్నాయి. కానీ అనధికార లెక్కలను బట్టి చూస్తే నేటికీ 30 కోట్ల మందికిపైగా ఈ పొగాకు వ్యసనంతో చితికిపోతున్నారు. ధూమపానాన్ని వదిలివేసినా దాని ప్రభావం మూడు దశాబ్దాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్ని అనర్థాలకు మూలమైన పొగాకు వినియోగాన్ని నియంత్రించేందుకు తీసుకు వచ్చిన చట్టం ఒకటిన్నర దశాబ్దం దాటిపోయినా అమలుకు నోచుకోవడం లేదు.

అసలు ఈ చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగం కూడా లేదు. ఒక వ్యవస్థే లేదని చెప్పొచ్చు. మరొక పక్క దేశ వ్యాప్తంగా ఏటా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకుపైగా పొగాకు వ్యాపారం జరుగుతున్నది. పొగాకు ఉత్పత్తులపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మరెన్నో లక్షల మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి ఉన్నారు. రైతులతోపాటు మరెంతో మంది రైతు కూలీలు దీనిపై ఆధారపడి ఉన్నారు.

ఆ కుటుంబాలు వీధి పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించకుండా కాగితాలపై చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రభుత్వాలు మరో విషయాన్ని విస్మరిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై వివిధ రూపాల్లో కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు వస్తున్నది. ఈ ఉత్పత్తులను అమ్ముకునేందుకు అధికారికంగా లైసెన్సులు ఇస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి.

మంచి నీళ్లు దొరకని గ్రామాలున్నాయేమోకానీ బీడీలు, సిగరెట్లు దొరకని గ్రామాలు దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఒకపక్క ఆదాయం కోసం లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తూ మరో పక్క నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. జీవనోపాధి కోల్పోతున్న వారికి బదులు చూపి పొగాకు ఉత్పత్తులను, అమ్మకాలను, వినియోగాన్ని భూటాన్ దేశంలో లాగా పూర్తిగా నిషేధించాలి. అప్పుడే దీనికో పరిష్కారం దొరుకుతుంది. అంతకంటే ముందు జీవనోపాధి కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయం చూపాలి.

smoking should be banned article

ఎన్. కలీల్, 9440336771

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News