Home ఆఫ్ బీట్ వయోభారం

వయోభారం

జూలో సందర్శకుల అలరించాయి… !
వృద్ధాప్యంతో మృత్యువు దారి పడుతున్నాయి..!!

రేపో, మాపో అన్నట్లుగా మగ సింహాం ఆకాశ్, ఆడ నీటి గుర్రం పార్వతీ
తెల్లపులులలో వినయ్ రాయల్ బెంగాల్ టైగర్ బద్రీది అదే పరిస్థితి
కోతి జాతిలో ఆలీవ్ బబూన్ పక్షిజాతిలో గ్రీన్ వింగ్ మకావ్…
15 ఏళ్లు నిండిన కింగ్ కోబ్రా
వయోభారం జాబితాలో రెండు ఎలుగు బంట్లు, మూడు నీల్గాయ్‌లు

Animals-in-Zoo-Park

మన తెలంగాణ/రాజేంద్రనగర్ ఎంతగాను అలరించి, సందర్శకులను ఆకట్టుకున్న వన్యప్రాణులను వృద్ధాప్యం వెంటాడుతోంది. దీంతో నెహ్రూ జూలాజికల్ పార్కులో మరో రెండు పదుల అత్యంత అరుదైన వన్యప్రాణులు, మృగాలు మృత్యువుకు చేరువవుతున్నాయి. సహజ సిద్దం అటవీ జీవన సరళితో పోల్చీతే అవి ఇక్కడ 2 నుంచి 6 ఏళ్ల జీవిత కాలం అధికంగా ఇంకా జీవించి ఉన్నాయి. కానీ వాటిని కూడా వృద్ధాప్యం పట్టిపీడిస్తోంది. అనారోగ్యాలతో ఆహారం సరిగా తీసుకోలేక రోజు రోజుకు వాటి ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొన్న సింహా, నిన్న చిరుత, అంతకంటే మందు మరణించి ఎలిఫెంట్ జమున వరుస మరణాల జాబితాలో ఇంకా ఏవి చేరనున్నాయో అని వన్యప్రాణి ప్రేమికులను ఆందోళన చెందుతున్నారు. అలాంటి వార్తలు మరిన్ని వినాల్సిన పరిస్థితులు జూపార్కులో లభించిన వివరాల ప్రకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయం అధికార వర్గంలో కొంత ఆందోళన ఇప్పటికేమొదలైనా…. అపవాదులు తప్పదు మరీ… మన సేవలు మనం చేయాలని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
రేపో, మాపో అన్నట్లుగా మగ సింహాం ఆకాశ్,

ఆడ నీటి గుర్రం పార్వతీ..?

జూపార్కుకే వన్నె తెచ్చిన భారత సంతతికి చెందిన సింహాల పునరుత్పత్తి ఇక్కడ చాలా జరిగింది. కానీ సిజెడ్‌ఏ, లేదా ఉన్నతాధికారుల అనుమతులు కోసం సింహాలు, పులుల వంటి వన్యమృగాలను కలయికలను కొంత కాలంగా అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. దీంతో ఒక్కప్పుడు పెద్దపులికి పిల్లలు పుట్టాయి, చిట్టి సింహాలు ఊపిరి పోసుకున్నాయన్న సంతోషకర వార్తలకు బదులు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న అరుదైన ప్రాణులు మరణ సంఘటనలు వన్యప్రేమికులను కలచి వేస్తున్నాయి. ఈకోవాలో ఇప్పటికే సమ్మర్‌హౌస్‌లో తీవ్ర వృద్ధాప్యం కారణంగా కంటి చూపు సైతం మగ సింహాం ఆకాష్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిత్యం సిబ్బంది దానికి ఆహారం వేయడంతో పాటు స్వీకరించే దాక దగ్గరే ఉంటున్నారు. ఇక నీటి గుర్రం పార్వతీకి 42 ఏళ్లు దాటుతున్నాయి. సాధారణంగా 35 నుంచి 40 వరకు జీవించే ఇది ఇక్కడ మాత్రం ఎక్కువ కాలం జీవనం సాగిస్తున్నాయని, అందుకు జూలో ప్రతినిత్యం తీసుకునే ప్రత్యేక చర్యలు, వాటి ఆలన, పాలన చెప్పాలంటే హాస్టల్ వసతిలా అన్ని టైం ప్రకారం ఇస్తామని అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అసదుల్లా చెప్పారు.

తెల్లపులుల్లో వినయ్ ..!

జూపార్కులో తెల్ల పులులది ఓ ప్రత్యేక పాత్రే ఆ జాతికి చెందిన వినయ్ 21 ఏళ్ల వయస్సు కలిగి ఉందని వైద్యులు తెలిపారు. దాదాపు 5 ఏళ్లు అధనంగా జీవించి ఉందని తెలిపారు. అంతకు ముందు మున్ని అనే రాయల్ బెంగాల్ టైగర్ దాదాపు 23 ఏళ్లు జీవించి రికార్డు నెలకొల్పింది. ఆ తరువాతి స్థానం వియోభారంతో ఉన్న వినయ్‌దే అని చెప్పాలి.

రాయల్ బెంగాల్ టైగర్లలో బద్రీ..

ఇక వయస్సు పెరిగిన పెద్దపులి జాతిలో రాయల్ బెంగాల్ సంతతికి చెందిన బద్రీ అనే పెద్ద పులి 19 ఏళ్ల వయస్సులో ఉంది. దాంతో పాటు జాగ్వార్ రకానికి చెందిన చిరుత సుమన్ 20 ఏళ్లు చాలా కాలంగా కొంత స్తబ్దుతకు లోనవుతున్నట్లు తెలిసింది.

జూ పుట్టిన కొత్తలో వచ్చిన ఆలీవ్ బబూన్ పరిస్థితి అంతేనట..?

ఇక జూపార్కులోని వానర జాతి విషయానికి వస్తే దాదాపు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఆలీవ్ బబూన్ రకం కోతి ఆరోగ్య పరిస్థితి అంతంతా మాత్రంగా ఉన్నట్లు తెలిసింది. దానిని కంటికి రెప్పలా కాపాడుతున్నామని యానిమల్ కీపర్లు అంటున్నారు. ఇక దైవాదీనం ఈ అలీవ్ బబూన్ ఉనికి.

వృద్ధాప్యం జాబితాలో రెండు ఎలుగు బంట్లు, మూడు నీల్గాయ్ జింకలు

ఇక వృద్ధాప్య జాబితాలో ఒక హిమాలయన్ బేర్, మరో సాధరణ ఎలుగు బంటి ఉన్నట్లు తెలిసింది. వాటితో పాటు నిల్గాయ్ రకం జింకలలో 3 జంతువుల పరిస్థితి దాదాపు అంతేనంట. ఇక అడవి దున్నల విషయానికి వస్తే ప్రేమ్ అనే మగ ఇండియన్ గౌర్ ఆరోగ్య పరిస్థితి అధికారులను కలవరపరుస్తున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే అడవి దున్నల మృత్యువు సంఘటనలు జరిగితే ఒక్కో సారి అతిసారలా వాటి ఉనికి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదాలు గతంలో వెలుగు చూశాయి.

పక్షిజాతిలో గ్రీన్ వింగ్ మకావ్…

ఇక జూపార్కులో అనేక రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో చిట్టి చిలుకలు మొదలు మనిషి మాటలను అర్థం చేసుకుని మరలా సమాదానం చెప్పే మకావ్‌లు ఉన్నాయి. వాటిలో గ్రీన్ వింగ్ మకావ్ వయస్సు దాదాపు 47 ఏళ్లు దాటి ఉంటుందని సిబ్బంది తెలిపారు. గత వారం రోజులుగా అది కూర్చున్న చోట నుంచి ఎక్కువగా లేవడం లేదన్న విషయాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు.

15 ఏళ్లు నిండిన కింగ్ కోబ్రా…

భారత దేశంలో మొట్టమొదటి సారి మన జూపార్కులోనే సరీసృపాల జగత్తు ఆవిషృతమైంది. ఇక్కడ నిత్యం సందర్శకులను అమ్మో అనిపిస్తున్న ఒక మగ కింగ్ కోబ్రా వయస్సు కూడా 15 ఏళ్లు ఉంటుంది. దానిపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆలన, పాలన కొనసాగిస్తున్నారు.

ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం : డా.అసదుల్లా

జూపార్కులో వయో భారం మీదపడిన వన్యప్రాణులను గుర్తించి ప్రతి నిత్యం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అసదుల్లా చెప్పారు. దాదాపు 20 వరకు వివిధ రకాల వన్యప్రాణులు సాధారణ వయస్సు కంటే అధికంగానే జీవనం సాగిస్తున్నాయని, వాటికి పై యానియల్ కీపర్లు అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. ఉదయం రౌండింగ్ వెళ్లగానే ముందుగా వయస్సు మీరిన వన్యప్రాణుల కదలికలు, అవి ఆహారం తీసుకుంటున్న తీరు తదితర విషయాలు యానిమల్ కీపర్ల ద్వారా తెలుసుకుని కావలసిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు

ఆందోళన వద్దు.. మన జూలోనే ముద్దు : అసిస్టెంట్ క్యూరేటర్ జ్ఞానేశ్వర్

గత కొన్ని రోజులుగా జూపార్కులో మూడు వన్యప్రాణులు మృతి చెందిన విషయంతో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అసిస్టెంట్ క్యూరేటర్ జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. అభయారణ్యాలు, మాములు అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించే వన్యప్రాణులకంటే నెహ్రూ జూపార్కులో మూగ జీవుల ఆయువు అధికంగా నమోదు అవుతుందని గుర్తు చేశారు. దాదాపు ఐదున్నర దశాబ్ధాల చరిత్రను కలిగిన నగర జూలో ఆ వయస్సు పై బడిన జీవులున్నాయని చెప్పారు. చరిత్ర గడిచిన విధంగానే వయస్సు పై పడుతున్న వన్యప్రాణులు, మృగాలు, పక్షులు ఉన్నాయని, అలా అని వాటి ఆలన, పాలనలో నిర్లక్షం ఉండబోదని వెల్లడించారు. అనారోగ్యాలకు గురయ్యే వన్యప్రాణులను వెంటనే పరీక్షించి కావలసిన వైద్య సేవలు అందించడానికి కావలసిన వ్యవస్థ ఇక్కడ ఉందన్నారు. నిష్ణాతులైన వెటర్నరీ వైధ్యాధికారులు ఉన్నా..? మరింత మైరుగైన వైద్య సలహాలకోసం తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాల నుంచి అవసర అయితే అవిశ్రాంత వెటర్నరీ వైద్యులను కూడా రప్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.