Home వికారాబాద్ బెల్టుషాపుల హోరు

బెల్టుషాపుల హోరు

Liqour

గుల్లవుతున్న గ్రామీణ కుటుంబాలు
తాండూరు నియోజకవర్గంలో 400ల వరకు బెల్టుషాపులు
ప్రతి రోజు రూ.10 లక్షలకు పైగా మద్యం విక్రయాలు
నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న ఎక్సైజ్ అధికారులు

తాండూరు రూరల్: తాండూరు నియోజకవర్గంలో బెల్టుషాపుల హవా కొనసాగుతోంది. తాగునీరు దొరకని గ్రామాలుంటాయేమో కాని… బెల్టు షాపులు లేని గ్రామాలు లేవంటే అతిషయోక్తి కాదు. తాండూరు నియోజకవర్గంలో దాదాపు 90కి పైగా గ్రామ పంచాయతీలు, వాటి అనుబంద గ్రామాలు, తండాల్లో కలిపి దాదాపు 400ల వరకు బెల్టు షాపులు ఉన్నట్లు అంచనా. గ్రామాల్లో యధేచ్చగా మద్యం విక్రయాలు కొనసాగుతుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు మద్యానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతే కాకుండా మద్యం సేవించి కుటుంబాల్లో మనస్పదర్దలు ఏర్పడి గొడవలకు దారి తీస్తున్నాయి. రోజు వారి ఆదాయంలో అధిక శాతం మద్యం సేవించేందుకు ఖర్చు చేస్తుండడంతో పూట గడవడం కూడా కష్టంగా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగుతుండడంతో ఉద్యోగాలు చేయాల్సిన యువత కూడా మద్యానికి అలవాటు పడి చెడు వ్యసనాలకు గురవుతున్నారు. మద్యం విక్రయాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ మాత్రం నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నట్లు పలువురు విమర్శించడం గమనార్హం. వీరు బెల్టు షాపుల యజమానుల వద్ద మామూళ్లు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. తండాల్లో నాటు సారా విక్రయిస్తున్న గిరిజనులపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నట్లుగానే గ్రామాల్లో కోకొళ్లలుగా వెలుస్తున్న బెల్టుషాపులపై కూడా దాడులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బెల్టుషాపుల యజమానులకు రాజకీయ అండదండలు కూడా పుష్టిగా ఉండడంతో వారు మరింతగా రెచ్చి పోతున్నారని యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామాల ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ నాలుగు మండలాల్లో దాదాపు 400ల వరకు బెల్టు షాపులు కొనసాగుతుండడం గమనార్హం. గ్రామాల్లోని కిరాణాషాపులు, చిన్న చిన్న హోటళ్లలో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. విక్రయించుకునేందుకు తెచ్చుకున్న మద్యాన్ని నేరుగా దుకాణాల్లో, హోటళ్లలో పెట్టుకోకుండా రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచుకొని విక్రయిస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బెల్టుషాపులో ప్రతి రోజు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ పేద, మద్య తరగతి ప్రజలను మోసం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని 400ల వరకు బెల్టు షాపులలో ప్రతి రోజు కనీసం రూ.8 లక్షలకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరుగుతుండడం గమనార్హం. తాండూరు మండ లంలోని కరన్‌కోట, ఓగీపూర్, మల్కాపూర్, బెల్కటూర్, జిన్‌గుర్తి, సంగెంకలాన్, చంద్రవంచ, చిట్టిఘనాపూర్, గౌతాపూర్, చెంగోల్, అల్లాపూర్, కొత్లాపూర్, గ్రామాల పరిధిలో నాపరాళ్ల గని కార్మికులు ఎక్కువగా నివాసముండడంతో ఆయా గ్రామాల్లో బెల్టుషాపుల హవా జోరుగా కొనసాగుతోంది. కార్మికులు ఎక్కువగా నివసిస్తున్న గ్రామాల్లో బెల్టుషాపులలో రోజు వారి మద్యం విక్రయాలు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కొనసాగుతుండడం గమనార్హం. నియోజకవర్గంలోని తాండూరు మండలంలో 25 గ్రామ పంచాయతీలలో అనుబంధ గ్రామాలు 10, తండాలు 10 లలో సుమారు 150 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు సమాచారం.

ఈ మండలంలోనే అధికంగా బెల్టు షాపులలో మద్యం విక్రయాలు జరుగుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాల్లో చిచ్చులు రేగుతున్నాయి. అదే విధంగా బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాల్లో కూడా 250 వరకు బెల్టు షాపులు కొనసాగుతున్నట్లు పలువురు పేర్కొన్నారు. బెల్టు షాపులను గ్రామాల్లోని చౌరస్తాల్లో, పాఠశాలల సమీపాల్లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తుండడంతో రోడ్డుపై పోయే ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రి సమయాల్లో గ్రామాల్లోని పాఠశాలలో మద్యం సేవించి తాగిన మందు బాటిళ్లనే అక్కడే వదిలేయడం కాని, లేక పగలగొట్టడం వంటివి చేస్తుండడంతో విద్యార్థుల పాదాలకు కుచ్చుకొని వారు గాయాల పాలు కూడా అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు మానేసి కూలి పనులు చేసుకుంటున్న యువకులు కూడా మద్యానికి బానిసలై తమ విలువైన జీవితాలను బుగ్గి పాలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులపై దాడులు నిర్వహించి గ్రామాల్లో బెల్టు షాపుల జాడ లేకుండా చేయాలని యువజన సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇళ్లు గుళ్లవుతున్నాయి
బెల్టు షాపుల కారణంగా తమ ఇళ్లు గుళ్లవుతున్నాయని పలువురు గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ముగ్గురు, నలుగురు కలిసి సంపాదించిన రోజువారి మొత్తాన్ని తమ భర్తలు తాగుడుకే తగలేస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి మద్యం మత్తులో తమపై విచక్షణ రహితంగా దాడులకు కూడా పూనుకుంటున్నారని ఆరోపించారు. వచ్చిన కాడికి డబ్బులను తాగుడుకే తగలేస్తుండడంతో తమ పిల్లల చదువులు మద్యలోనే నిలిచిపోతున్నాయని, పూట గడవడం కూడా కష్టంగా మారుతోందని పేర్కొన్నారు.

తాగుడుకు బానిసలవడం వల్ల అప్పులు పెరిగి తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ జిల్లా అధికారులు స్పందించి గ్రామాల్లో విచ్చల విడిగా వెలిసిన బెల్టు షాపులపై దాడులు నిర్వహించి కుటుంబాల్లో వెలుగులు నింపాలని పలువురు మహిళలు, యువకులు, యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.