Thursday, April 25, 2024

జలం కోసం భూమి జల్లెడ

- Advertisement -
- Advertisement -

So many bores in Adilabad

మన తెలంగాణ/నేరడిగొండ: భూగర్భ జలంపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు పాతాళగంగ కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగునా బోర్లు వేస్తూ భూమిని జల్లెడ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలోని వాంకిడి, కుమారి, కొర్టికల్, రోల్‌మామడ, వడూర్, బుగ్గారం, సావర్‌గాంతో పాటు ఆయా గ్రామాల రైతులు వ్యవసాయం కోసం పాడి పశువుల పోషణ కోసం అనునిత్యం బోర్లు వేస్తూనే ఉన్నారు.

పదిలో ఒకరికి కొద్దిపాటి నీరు వస్తే చాలు, కొత్త బోర్లు వేయడానికి రైతులు సిద్దమవుతున్నారు. చేతిలో డబ్బు లేకపోయినా పశువులను అమ్మి, బంగారాన్ని తాకట్టుపెట్టి, చాలకపోతే అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. గతంలో వంద, రెండు వందల పీట్ల లోతు వరకు బోర్లు వేస్తే నీళ్లు పడేవి. ప్రస్తుతం నాలుగు నుంచి ఆరు వందల లోతు తవ్వినా నీళ్లు పడడం గగనమైంది. దీంతో కొందరు రైతులు పాతబోర్లను మరింత లోతుగా తవ్విస్తున్నారు. పల్లె ప్రాంతాల రైతుల అగచాట్లు ఇలా ఉంటే, మండల కేంద్రాల్లో తాగునీటి కోసం జనం అడుగడుగునా బోర్లు వేయిస్తున్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో 600 పీట్ల లోతు వేసినా నీరు పడక పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది

సాగునీటి కోసం బోర్లు వేస్తున్న అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. నీరు వస్తుందన్న ఆశతో ఏ మాత్రం అవగాహన లేకుండా బోర్లు వేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. జియాలజిస్టులను సంప్రదించినా ఫలితం లేదని భావిస్తున్న రైతులు, గ్రామాల్లో కొబ్బరికాయలతో అనామకులు చూపిస్తున్న స్థలాల్లో బోర్లు వేస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒక రైతు 600 పీట్ల లోతు బోరు వేస్తే కేసింగ్‌కు, బోరుకు దాదాపు 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చవుతోంది. అవగాహన కల్పించని ప్రభుత్వం భూగర్బజలం కోసం రైతులు భగీరథ ప్రయత్నం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోరు వేయాలంటే వాల్టా చట్డం ప్రకారం ముందుగా అనుమతి తీసుకోవాలి కానీ ఏ ఒక్కరూ అనుమతికి ధరఖాస్తు చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం నీరు పడుతుందా? లేదా? అని సాంకేతికంగా తెలుసుకొనే ప్రయత్నమూ చేయడం లేదు. అవగాహనరాహిత్యంతో బోర్లు వేస్తూ నష్టపోతున్న రైతులు, చివరకు అప్పుల పాలై చితికి పోతున్నారు. పంటల సాగు విధానం, ఆదునిక వ్యవసాయ పధ్దతులపై నిపుణులైన జియాలజిస్టులతో అవసరముందన్న సూచనలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలపై ప్రాంతాల వారిగా సర్వే చేసి రైతుల్లో అవగాహనను కల్పిస్తే కొంత ప్రయోజనముంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News