Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఇది రహదారి కాదు… మృత్యు దారి

ఇది రహదారి కాదు… మృత్యు దారి

మనతెలంగాణ, ఆసిఫాబాద్‌టౌన్: నాగ్ పూర్ – హైదరాబాద్ రహదారి పై బూర్గుడ సమీపంలో ప్రమాదాలకు నిలయంగా మారింది. మండలంలోని బూర్గుడ, ఈదులవాడ,మోతుగూడ గ్రామాల మధ్య రహదారిపై ఇటీవల జరిగిన వరస ప్రమాదాలతో అమూల్యమైన జీవితాలు క్షణాల్లో గాల్లో కలిసిన సంఘటనలు పలువరిని కంటతడి పెట్టిస్తున్నాయి. మండలంలోని బూర్గుడ గ్రామ శివారుతో పాటు స్థానిక క్రచర్ ఎదురుగా ఎత్తున ఒడ్డు వంపులు ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా మూలమలుపులు, నాసిరకంగా తయారైన గతుకుల రోడ్లు ప్రమాదాలు జరుగడానికి కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో అంతరాష్ట్ర రహదారిపై విపరీతమై రద్దీతో పాటు హైదరాబాద్, కరీంనగర్ , మంచిర్యాల, వరంగల్, తదితర పట్టణాల నుంచి సరుకులు మహారాష్ట్రలోని కంపెనీలకు తీసుకెళ్ళే సరుకులు ఎగుమతి, దిగుమతి కోసం పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళడంతో పాటు అతివేగంగా, ఆ జాగ్రత్త నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం రోడ్డుపై నిబంధనలు పాటించకుండా ముందు వెళ్లుతున్న వాహనాలను ఓవర్ టేక్ చేసే సమయంలో అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల క్రితం ఓ బూలోరో వాహనం ఆసిఫాబాద్ నుంచి బూర్గడ గ్రామం వైపు వెళ్ళుతుండగా, ముందు వెళ్ళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయంలో అతివేగంగా ఆసిఫాబాద్ వైపు ఎదురుగా వస్తున్న మోటర్ సైకిల్‌ను ఢీకొట్టడంతో మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతకుముందు ఆర్టీసీ మరో పదినిమిషాల్లో బస్టాండ్‌కు చేరకునే ముందు ఇదే గ్రామం వద్ద ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే కాకుండా గతంలో కూడా ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నిరోధానికి ఆర్‌డిఓ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టాలని, అతివేగంగా, ఆ జాగ్రత్తగా వాహనాలు నడిపితే వారి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నాలుగు వరసల రహదారి ఎప్పుడు …

నాగ్ పూర్ హైదరాబాద్ అంతరాష్ట్ర రహదారిపై రోజు రోజుకు రద్దీ పెరుగుతుండటంతో మంచిర్యాల నుంచి మహారాష్ట్రంలోని గోయగాం గ్రామం వరకు 90 కిలో మీటర్ల మేర నాలుగు వరసల రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నా అవి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. పెరిగిన రద్దీతో పాటు రహదారిపై కొన్ని ప్రాంతాల్లో మూలమలుపులు, నాసిరకం రోడ్డుతో ఏదో ఒక్కచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరితగతిన నాలుగు వరసల రహదారి నిర్మాణా పనులు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

 

So Many Members Dead in Nagpur – Hyderabad Highway

So Many Members Dead in Nagpur – Hyderabad Highway