Home భద్రాద్రి కొత్తగూడెం మంచం పట్టిన పల్లె!

మంచం పట్టిన పల్లె!

పల్లె మంచం పట్టింది. అనారోగ్యంతో కునారిల్లుతోంది. ఎందుకొస్తుందో తెలియని జ్వరంతో గిరిజనుల ప్రాణం హరిస్తోంది. రోగమొస్తే ఆశ్రయమివ్వాల్సిన సర్కారీ దవాఖాన జబ్బుతో మూలుగుతోంది. సమస్యల వలయంలో కాలం వెళ్లదీస్తోంది. ఉన్న మందు బిళ్లలైనా ఇస్తారేమో అనుకుంటే.. సిబ్బంది కొరత వేధిస్తోంది. అప్పుడప్పుడూ వచ్చే వైద్యాధికారులతో ప్రభుత్వాస్పత్రుల మీద నమ్మకం సన్నగిల్లింది. సర్కారీ దవాఖానాల తీరుకు శుక్రవారం కారేపల్లి మండలంలో తల్లీకూతుళ్లు
మృతిచెందమే తార్కాణం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటువంటి చావుకేకలు వినిపిస్తున్న పల్లెలెన్నో..!

జ్వరానికి బలవుతున్న గిరిజనులు
సమస్యల వలయంలో ప్రభుత్వాస్పత్రులు
స్థానికంగా ఉండని వైద్యారోగ్య సిబ్బంది
కారేపల్లి మండలంలో వరుస మరణాలు

So Many Members Died with Viral Fever in Khammamకారేపల్లి: పల్లెలను జ్వరం పట్టి పీడిస్తోంది. నెలల తరబడి గిరిజనులను వేధిస్తోంది. పరిశుభ్రత లేని పల్లెల్లో జ్వరాల తీవ్రత విపరీతంగా ఉంది. పర్యవేక్షించి, ప్రాణాలు రక్షించాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది నిద్రావస్థలో ఉన్నారనే ఆరోపణ వినిపిస్తోంది. కనీసం జ్వరమొస్తే బందు బిళ్ల ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోతోంది.

గిరిజనుల పల్లెల్లో ఎవరు అడుగుతారులే..? అనుకుంటారో.. ఏమో కానీ చివరికి వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణ వినిపిస్తోంది. స్థానికంగా ఉండడం సేవలు అందించాల్సిన సిబ్బంది ఇష్టమొచ్చినప్పుడు వచ్చి వెళుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

పల్లెలు మురికి కూపాలు…

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు పల్లెల్లో మురికి కూపాలుగా పడిఉన్నాయి. ఎన్నో పల్లెల్లో కనీసం చెత్త కుండీలు కూడా లేవు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తుండడంతో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్ల మీదే చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీంగా వృద్ధి చెందుతున్నాయి. పందులు స్వైర విహారం చేస్తున్నాయి.

కారేపల్లిలో వరుస మరణాలు…

కారేపల్లి మండలంలో జ్వరంతో గిరిజనులు వరుసగా మరణిస్తున్నారు. ఇటీవల మండలం లోని బాజుమల్లాయిగూడెం, మాణిక్యారం పంచాయతీల్లో అంగన్‌వాడీ టిచర్‌తోపాటు పలువురు జ్వరంతో మృతి చెందారు. అయిన ప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో శుక్రవారం తల్లీకూతుళ్లు మృతి చెందారు. పేరుపల్లి పంచాయతీ సూర్యా తండాలో గత కొన్ని రోజులుగా పలు గిరిజన కుటుంబాలు జ్వరాల బారినపడి ఇబ్బందులు ఎదుర్కోంటు న్నారు. ఈక్రమంలోనే తల్లీకూతుళ్లు ఐశ్వర్య, బుజ్జి అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్వయానా ఎంపిపి సొంత గ్రామమైన సూర్యాతండాలోనే ఈ పరిస్థితి నెలకొంటే మిగతా ఎజెన్సీ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. జిల్లాలోని పలు పల్లెల్లో ఇదే పరిస్థితి ఉంది. మరింత మంది ప్రాణాలు కోల్పోకముందే వైద్యారోగ్య శాఖ మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.