Home హైదరాబాద్ లక్షలు మింగేశారు!

లక్షలు మింగేశారు!

పనులు చేపట్టకున్నా… రికార్డుల్లో నమోదు
పాత మిషన్‌లకు రిపేర్ల పేరుతో లక్షల్లో దగా
కొందరు అధికారుల చేతివాటం!
సమాచార హక్కుచట్టం ద్వారా వెలుగులోకి
పట్టించుకోని ఉన్నతాధికారులు

Corruption

సిటీబ్యూరో : దోమల నియంత్రణ పేరుతో నగర పంచాయతీలు, మున్సిపాలిటీలలో లక్షల రూపా యలు దుర్వినియోగం అవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియాలతో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నా పట్టించుకోని అధికారయం త్రాంగాలు… ఫాగింగ్ పేరిట లక్షల రూపాయలు దోచుకుంటున్నా మొద్దునిద్ర వహించడం విశేషం. దోమల నివారణకు  ఎలాంటి చర్యలు చేపట్టకున్నా….రికార్డులలో మాత్రం అన్ని చర్యలు తీసు కుం టున్నట్టు నమోదు చేసి అందినకాడికి దోచుకుంటున్నట్లు తెలుస్తొంది.

సమా చార హక్కు చట్టం కింద స్వాహా పర్వం వెలుగులోకి వచ్చింది. నగర శివారు లోని మీర్‌పేట్, జిల్లెలగూడ, జల్‌పల్లి, బడంగ్‌పేట్ మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కొందరు అధికారులు చేతివాటం మున్సిపాలిటీల ఖజానాకు భారీగా గండికొడుతోంది. కొన్ని మున్సిపాలిటీలలో ఫాగింగ్ చేయకున్నా చేసినట్లుగా రికార్డులలో నమోదు చేస్తూ నిధులు స్వాహా చేస్తోండగా, మరికొన్ని నగర పంచాయతీల్లో రిపేరింగ్ పేరిట లక్షల రూపాయలు మింగేస్తున్నారు. ఈ నిధులతో కొత్త ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేసే అవకాశమున్నా….పనిచేయని పాత మిషన్‌లకు రిపేర్లు చేపిస్తున్నట్లుగా లక్షల రూపాయలు వెచ్చిస్తోండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడంగ్ పేట్ నగర పంచాయతీ పరిధిలో కేవలం మూడు కాలనీల్లో మూడు పర్యాయాలు మాత్రమే ఫాగింగ్ చేపట్టినట్లుగా రికార్డులు చెబుతుండగా, ఇందుకోసం ఏకంగా రూ.1.32 లక్షలు వెచ్చించడం విశేషం. సదరు మొత్తం కూడా ఫాగింగ్ యంత్రాలను రిపేరు చేయించడానికి వెచ్చించినట్లు రికార్డుల్లో పేర్కొనడం గమనార్హం.

ఒక్కో ఫాగింగ్ మిషన్(కొత్తది) రూ.40వేల నుంచి రూ.50 వేలు ఉండగా, రెండు పాత మిషన్ కోసం లక్షల్లో ఖర్చుపెట్టడం ఏంటని స్థానికులు మండి పడుతున్నారు. జిల్లెలగూడ మున్సిపాలిటీలో ఒకే ఫాగింగ్ మిషన్ ఉన్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫాగింగ్ చేపట్టలేదని సాక్షాత్తూ మున్సిపాలిటీ యంత్రాంగమే చెబు తున్నా రూ.75 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉండటం శోచనీయం. మీర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని కాలనీలలో ఫాగింగ్ చేపట్టినా…ఏకంగా రూ.5.25 లక్షల ఖర్చు చేసినట్లుగా అధికారులు పేర్కొంటుడం స్థానికులకే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ ఆవిర్భవించిన నాటి నుంచి రూ.37వేలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నా…పాతవాటి లెక్కలే అక్కడ లేకపోవడం మరో విశేషం.

సదరు మున్సి పాలిటీల పరిధుల్లో అనేక కాలనీలు అపరిశుభ్రతకు నిల యాలుగా మారాయి. మురికినీరు, కుంటలతో దోమలు స్వైరవిహారం చేస్తోండటంతో అనేక మంది వివిధ రకాల వ్యాధులతో ఆసుపత్రి పాలవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, లక్షల రూపాయల ప్రజాధనాన్ని యధేచ్చగా స్వాహా చేస్తు న్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్షం….కొందరు కింది స్థాయి అధికారుల చేతివాటం కారణంగా ఈ వ్యవహారం నడు స్తోందని, దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం : లోక్‌సత్తా

నగర శివార్లలోని మీర్‌పేట్, జిల్లెలగూడ, బడంగ్‌పేట్, జల్‌పల్లి మున్సి పాలి టీలలో ఫాగింగ్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మహేశ్వరం నియో జకవర్గం లోక్‌సత్తా ఇంచార్జీ తోడేటి ప్రసాద్ ఆరోపించారు. ఫాగింగ్ చేయ కున్నా… రికార్డులలో ఫాగింగ్ చేసినట్లుగా చూపిస్తున్నారని, కొత్త మిషన్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా లక్షల రూపాయలు వెచ్చించి పాత మిషన్‌లకు రిపేరులు చేపిస్తున్నట్లు రికార్డులు తయారు చేసి స్వాహా చేస్తున్నారన్నారు. సమాచార హక్కు చట్టం కింద అందజేసిన అధికారుల వివరాల్లోనే ఈ వ్యవహారం బయటపడిందని మం డిపడ్డారు. ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ,ప్రజా సమస్యలు పరి ష్కారం అయ్యేవరకు పోరాటం సాగిస్తామని ఆయన తెలిపారు.