Home ఎడిటోరియల్ సామాజిక అన్యాయ చట్టం

సామాజిక అన్యాయ చట్టం

Social injustice law

 

మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికీ మానవ హక్కులన్నీ అనుభవంలోకి వచ్చేలా చూసినప్పుడే ప్రజాస్వామిక మానవీయత వేళ్లూనుకున్నట్టు భావించగలుగుతాము. చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగం అనుమానానికి చోటు లేకుండా స్పష్టం చేసినప్పటికీ ధనికులు, పేదలు, మీది కింది కులాల తేడాలు సమానత్వాన్ని అందని పండుగానే రుజువు చేస్తున్నాయి. కొందరివి పొడుగు మరి కొందరివి పొట్టి చేతులుగానే నిరూపించు కుంటున్నాయి. ఆర్థిక సామాజిక ప్రాబల్యం గల వారికి అన్ని రంగాల్లో ఎత్తు పీటలు, అవి లేని వారికి నేల టిక్కెట్లు తప్పడం లేదు. ఆచరణలో పురుషులు స్త్రీల మధ్య విపరీతమైన తేడాలూ కొనసాగుతున్నాయి. లింగ మార్పిడి చేయించుకున్న (ట్రాన్స్‌జెండర్స్) వారి పట్ల సమాజం చిన్న చూపు సంగతి తెలిసిందే.

అది ఎలా ఉన్నప్పటికీ చట్టరీత్యా తమకు చెందవలసిన హక్కులు ప్రత్యేక రాయితీల కోసం ఈ వర్గం చేస్తున్న పోరాటం ఇప్పటికీ పూర్తిగా ఫలించకపోడం మన సమాజ అనాగరకతను, అపరిపక్వతనే చాటుతున్నది. సుప్రీంకోర్టు తన 2014 నాటి చరిత్రాత్మక తీర్పులో ఈ వర్గాన్ని మూడవ లింగంగా (ధర్డ్ జెండర్) గుర్తించాలని స్త్రీ పురుషులతో సమానంగా పరిగణించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అదే సమయంలో సామాజికంగా, విద్యావిషయకంగా వెనుకబడిన తరగతులలో చేర్చి అందుకు సంబంధించిన రాయితీలు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్పు చెప్పింది. లింగ మార్పిడి వ్యక్తులను మూడవ లింగంగా గుర్తించడం సామాజికమైన లేదా వైద్య సంబంధమైన సమస్య కాదని అది పూర్తిగా మానవ హక్కులకు సంబంధించిన వ్యవహారమని వివరంగా చెప్పింది.

వారు కూడా భారత పౌరులేనని కులం, మతం, లింగపరమైన తేడాలతో నిమిత్తం లేకుండా పెరిగి పరిపూర్ణ శక్తియుక్తులు సాధించుకోడానికి ప్రతి ఒక్కరూ అర్హులని స్పష్టం చేసింది. అలాగే వీరు తమకు తాముగా చేసే ప్రకటన లేదా ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా వారి లింగ స్థితిని గుర్తించాలని కూడా నిర్దేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తనకున్న సంఖ్యాబలంతో తీసుకు వచ్చిన లింగమార్పిడి వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం వీరిని ఈ సౌకర్యాలన్నింటికీ దూరం చేసింది. ఒక రకంగా వారిని అవహేళనకు, అవమానానికి గురి చేసింది. లింగ మార్పిడి వ్యక్తులు తాము ఆ వర్గానికి చెందినవారమని జిల్లా మేజిస్ట్రేట్ నుంచి యోగ్యత పత్రం పొంది తీరాలన్న షరతు విధించింది. వీరిపై జరిగే అత్యాచారాది నేరాలకు రెండేళ్ల శిక్షను మాత్రమే నిర్దేశించింది.

సుప్రీంకోర్టు చెప్పిన సామాజిక న్యాయపరమైన బిసి గుర్తింపు, రిజర్వేషన్ల సంగతే ఈ చట్టంలో లేదు. అయితే గత బిల్లుల్లో ప్రతిపాదించిన విధంగా వీరి యాచన వృత్తిని నేరంగా పరిగణించడం వంటి కఠినతరమైన నిబంధనలు ఈ చట్టంలో లేకపోడం ఒకింత ఊరట. అయినప్పటికీ వీరిని భారతీయ సమాజంతోపాటు చట్టం కూడా సమాన పౌరులుగా పరిగణించదలచుకోలేదని స్పష్టపడుతున్నది. ఇది మనం చెప్పుకునే సమానత్వం నీతికి తలవంపులు తెచ్చే అంశం. సుప్రీంకోర్టు చెప్పినట్టు వారు స్వచ్చందంగా చేసే ప్రకటనను బట్టి వారి లింగ నిర్ధారణ చేయకుండా కేవలం ట్రాన్స్‌జెండర్స్‌గానే పరిగణించాలని కేంద్రం తీసుకువచ్చిన చట్టం చెబుతున్నది. తగిన శస్త్ర చికిత్స ద్వారా లింగ మార్పిడి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అటువంటి సౌకర్యాలు కలిగించడం ఆ మేరకు వారి లింగ నిర్ధారణలో మార్పు చేయడం వంటి అవకాశాలనూ చట్టం కల్పించడం లేదు.

పురుషుల కంటే స్త్రీలను తక్కువగా చూసే దృష్టి జీర్ణించుకుపోయిన సంప్రదాయ సమాజం ఆ రెండింటికీ చెందని మూడవ వర్గాన్ని మరింత నీచంగా పరిగణించే దుష్ట వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ చట్టం కూడా అదే వివక్షను పుణికిపుచ్చుకున్నది. కేంద్రాన్ని పాలిస్తున్న రాజకీయ శక్తుల దృష్టి వివక్షాపూరితమైనది కాబట్టే ట్రాన్స్‌జెండర్స్‌పై ఇటువంటి నిరుత్సాహపూరితమైన చట్టం ఊడిపడిందనే అభిప్రాయానికి సహజంగానే తావు కలుగుతుంది. ఏ ప్రభుత్వ లక్షణమైనా అది తీసుకునే నిర్ణయాలు, చర్యల్లో ప్రస్ఫుటమవుతుంది.

భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రస్తుత ఎన్‌డిఎ సర్కారు ఆలోచనలు ఎంతటి తిరోగామితనాన్ని కలిగి ఉన్నాయో ఈ చట్టం చాటి చెబుతున్నది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఇది పూర్తి శాసన స్వరూప స్వభావాలను పొందడం సహజం. అయితే అంతటితో ఆగిపోకుండా ట్రాన్స్‌జెండర్స్, వారికి మద్దతుగా నిలిచే మానవీయ, ప్రజాస్వామిక శక్తులు మరింత సునిశితమైన పోరాటాలు నిర్వహించి స్త్రీ పురుషులతో సమానమైన లింగపరిగణనను, హక్కులను వీరు పొందేలా చూడవలసి ఉంది.

Social injustice law