Home జాతీయ వార్తలు అన్నాహజారే ఆమరణ నిరాహార దీక్ష

అన్నాహజారే ఆమరణ నిరాహార దీక్ష

ANNA

ఢిల్లీ : ప్రముఖ సామాజిక కార్యకర్త, లోక్‌పాల్ ఉద్యమకారుడు అన్నాహజారే శుక్రవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆయన ఈ దీక్షను చేపట్టారు. ఏడేళ్ల క్రితం ఆయన అవినీతిపై పోరాటం చేసి, నాటి యుపిఎ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. తొలుత ఆయన రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి షాహీద్ పర్కు వరకు తన అనుచరులతో ర్యాలీ తీశారు. అనంతరం దీక్షకు కూర్చున్నారు. హజారే దీక్ష నేపథ్యంలో రామ్‌లీలా మైదానం, దాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లోక్‌పాల్ చట్టం కోసం ఆయన 2011లో నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అవినీతిని రూపమాపేందుకు లోక్‌పాల్ చట్టం తేవాలని కోరుతూ ఆయన 2011 ఏప్రిల్ 5న దీక్షకు దిగారు. ఆయనకు మేధా పాట్కర్, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్‌బేడీ, జయప్రకాశ్‌నారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు. ఆయన దీక్షతో నాటి యుపిఎ ప్రభుత్వం దిగొచ్చింది. లోక్‌పాల్ చట్టాన్ని ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో హజారే తన దీక్షను విరమించారు. కానీ లోక్‌పాల్ చట్టం అమలులోకి రాలేదు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త నియామకం సహా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన దీక్ష చేస్తున్నారు. కేంద్రం లోక్‌పాల్ చట్టాన్ని అమలు చేసే వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Social Worker Anna Hazare’s fasting