Saturday, January 28, 2023

మొక్కల కోటీశ్వరుడు!

- Advertisement -

Ramaiah-1

‘మొక్క’వోని దీక్షకు ‘పద్మా’భిషేకం జరిగింది.ఒక సామాన్యుడికి పద్మశ్రీ అవార్డు దక్కడంతో ఏకంగా పద్మశ్రీనే పరిమళించింది.. వికసించింది. పుడమి తల్లి పులకించింది. వేడెక్కే భూగోళాన్ని చల్లబర్చేందుకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలే శ్రీరామరక్ష అని బలంగా నమ్మి ఒక సామాన్యుడు చేసిన ‘ఉద్యానయజ్ఞాన్ని’ కేంద్ర ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. జిల్లా నుంచి పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచి ఖమ్మం జిల్లాకే వన్నె తెచ్చాడు వనజీవి రామయ్య.
ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1946లో రామయ్య జన్మించారు. జానకమ్మతో వివాహం అయిన తరువాత కుటుంబంతో పాటు ఎం వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో స్ధిరపడ్డారు. రామయ్య చిన్నతనంలో తల్లి బీరకాయవిత్తనాలు నాటుతుంటే చూసి, ఒక్క బీరగింజ నాటితే దానికి అనేక బీరకాయాలు కాసే అద్భుతాన్ని గమనించి బాల్యంలోనే మొక్కలపై మక్కువ పెంచుకున్నాడు. అతను ఐదవ తరగతి చదువుతున్న సమ యంలో జి మల్లేశం అనే టీచర్ మొక్కల పెంపకం, సంరక్షణ వాటి వల్ల కలిగే లాభనష్టాలపై చెప్పిన సైన్స్‌పాఠం అతడిని చెట్ల రామయ్యగా ఎదిగేఅంతగా తీర్చిదిద్దింది.తన చేత కోటికి పైగా మొక్కలను నాటించింది. అనాడు ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం రామయ్య మనస్సులో బలంగా నాటుకుంది. దీనికి తోడుగా కెన్యా దేశంలో వంగారిమాతై అనే మహిళ పదేళ్ళ కాలంలో మూడు మిలియన్ల మొక్కలను నాటినట్లు పత్రికలో చదివిన రామయ్య దానిని స్పూర్తిగా తీసుకోని తాను మరణిం చేనాటికి రెండు కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణ యించుకొని అనాటి నుంచి మొక్కల యజ్ఞాన్ని ప్రారంభిం చారు. ఒంటరిగా ప్రారంభించిన పచ్చని యజ్ఞంలో కట్టుకున్న భార్యపిల్లలు సైతం భాగస్వాములయ్యారు. అనాడు ప్రారం భించిన ‘గ్రీన్ మిషన్’లో భాగంగా ఇప్పటి వరకు కోటిన్న రకుపైగా మొక్కలను నాటారు.రోడ్ల వెంట తిరిగి మొక్కలను నాటుతుంటే ‘మొక్కల పిచ్చోడ’ని అవమానించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత మంది హేళన చేసినా పట్టిం చుకోకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంతం గా… పచ్చగా కళకళలాడే లోకం కోసం గత ఆరవై ఏళ్ళనుంచి పరితపిస్తున్నారు. 70ఏళ్ళ వృద్ధాప్యంలో కూడా హరిత స్వప్నం కోసం తపించిపోతున్నాడు. గడిచిన ఆరున్నర దశాబ్దకాలంలో ఇప్పటి వరకు ఆయన వెయ్యి పాఠశాలల్లో, 500 ప్రభుత్వ కార్యాలయాల్లో, 500దేవాలయాల్లో మొక్కలను నాటారు. దాదాపు 150 గ్రామాల్లో మొక్కలను నాటారు. దాదాపు 20 లక్ష ల విత్తనాలను ఖమ్మం జిల్లా అంతటా వెదజల్లారు. చూపు అనకపోయినా… చెవులు వినిపించకపోయినా ,ఆరోగ్యం సహకరించకపోయినా వెనుకడుగు వేయడం లేదు. ఆయన నాటిన మొక్క లు వృక్షాలుగా మారిన కొన్ని లక్షల చెట్లకు ఆయనే ‘కల్పతరువు’గా మారారు. 65ఏళ్ళుగా మొక్కలను నాటుతూ తన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకోని ‘హరిత స్వప్నం’ కోసం కలలు కంటున్నాడు.
అద్భుత ప్రతిభ వినూత్న ప్రచారం
వృక్షం శరణం గచ్చామి…రామ కోటి వృక్ష కోటి లాంటి నినాదాలు స్వయంగా రాయడమే కాకుండా చెట్ల రక్షణపై దాదాపు 500కు పైగా సూక్తులను తయారు చేసి వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు అంతేగాక తనకు రోడ్డుపై దొరికిన అట్టముక్కలపై, గ్రానైట్ రాళ్ళపై, ఇనుప రేకులపై సూక్తులను చెక్కి మొక్కల పెంపకంపై ప్రజలను అలోచింప జేశారు. అంతేగాక మొక్కల అవశ్యకతపై స్వయంగా పద్యాలు, పాటలు రచించి వాటికి ఆయనే చక్కని బాణీలు కూర్చి తానే పాడతారు. గుండ్రటి చక్రం లాంటి ఇనుప ముక్కపై వృక్షో రక్షతి..రక్షిత అనే నినాదం రాసి మెడలో ధరించడమే మానకుండా జనసమూహం అధికంగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేశారు.ఆయన తొక్కే సైకిల్, నడిపై మోపెడ్,ధరించే సంచిపై కూడా పర్యావరణం,మొక్కల పెంపకంపై సంబంధించిన నినాదాలే కన్పిస్తాయి.ఆయన ఇంట్లో గోడలకు, తలుపులకు, కిటికిలకు, బిరువా, గిన్నెలు, పాత్రలు ఒక్కటేమిటి ఎక్కడ చూసినా పచ్చని చెట్ల గురించి నినాదాలు కన్పిస్తాయి. చివరికి తన కుమారుడు, కుమార్తే పెళ్ళి శుభలేఖ కార్డులపై కూడా వన సంపద ప్రభోదాన్ని అచ్చు వేయించారు. అంతేగాక తన మనమ రాళ్ళకు కబంద పుష్పం, చందన పుష్పం, వనశ్రీ, హరితారణ్య పేర్లతో నామకరణం చేయించారు. ఇంట్లో పగిలిపోయిన పాత్రలో, పనికిరాని పాత్రలో మట్టి పోసి ఒ మొక్కను పెంచు తారు. రహదారుల వెంట, పోలాల వెంట విత్తనాలను సేకరించి వాటిని రోడ్లపై చల్లుతారు. ఆయన నాటిన చెట్ల వద్ద కాయలు ఏరి వాటి నుంచి వచ్చే గింజలను వేరు చేసి ఆ గింజలను భీడు భూముల్లో, ఖాళీ స్ధలాల్లో, కోండల్లో,గుట్టలో చల్లుతారు. ప్రతి పెళ్ళికి వెళ్ళి వధువు,వరుడికి మొక్కను బహుమతిగా అందజేసేవారు. రామయ్య తన ఇంటికి వచ్చిన అతిధులకు మొక్కలను మొక్క అతిథ్యం పేరుతో రెండేసి మొక్కలను ఇచ్చి పంపించడం అనవాయితిగా వస్తుంది. ఎవరైనా కబురు చేస్తే వారి ఇంటికి స్వయంగా వెళ్ళి మొక్కల ను నాటడం అతని సంప్రదాయం. మొక్కలను నాటి వదిలి వేయకుండా వాటి సంరక్షణ చర్యలు కూడా తానే తీసుకుం టాడు. మొక్కఅతిథ్యం పేరుతో ఇప్పటి వరకు కొన్ని లక్షల మొక్కలను ఉచితంగా పంపిణి చేశారు. మొక్కలపై రామయ్య కు ఉన్న అంకుఠిత దీక్షకు నిదర్శనం అతని చెతిపైన ఉన్న ‘వృక్షో రక్షతి..రక్షిత’ అనే పచ్చ బొట్టు నినాదం. పర్యావర ణంపై కొత్తగూడెం రేడియో స్టేషన్లో అనేకమార్లు ఉపన్యాసం, ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని వందల మొక్కలకు సంబంధించి న విశిష్టతలను, జాతీ నామాలను ఒంట బట్టించుకున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు పోలీసు పరేడే మైదానంలో ప్రదర్శించే వివిధ శాఖలఅభివృద్ధి శకటాల వెనుక తాను అటవీ శాఖ శకటమై నడిచేవారు. పర్యావరణ కమిటి సభ్యుడిగా జిల్లా వ్యాప్తంగా తన సొంత ఖర్చులతో పర్యటించి ప్రజలను చైతన్య పరిచారు. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశం మేరకు జిల్లా యంత్రాంగం చిన్న టివిఎస్ మోపెడ్ కొని ఇవ్వగా దానిపై జిల్లా వ్యాప్తంగా విసృత్తంగా పర్యటించే వారు. ఇందుకు గాను నెలకు పెట్రోల్ ఖర్చుల నిమిత్తం రూ.1500 అందజేశారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో కూడా లూనాను కొని ఇచ్చారు. కాని నెల నెల పెట్రోల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం మానేశారని రామయ్య చెప్పారు.

మొక్కలపై కూడా భక్తి, భయం ఉండాలి!

ప్రయాణ సౌకర్యం కోసం వాహనాన్ని కేటాయించి మొక్కలను అంద జేస్తే ఇంకా ఎక్కువ మొక్కలను నాటుతానని చెబుతున్నారు. మొక్కలపై విసృత్త ప్రచారం కల్పించేందుకు కరెన్సి నోట్లపై, నాణాలపై మొక్క బొమ్మను ముద్రిస్తే స్తూర్తిదాయకంగా ఉంటుందన్నారు. పర్యా వరణం ప్రస్పూటించేలా బస్సులకు,రైళ్ళకు పేర్లను పెట్టాలంటాడు. మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరిం చాలని కోరుకుంటున్నాడు. చెట్ల వల్లన వచ్చే ఆధాయం పై అవగాహన కల్పించి నిరుద్యోగ యువతకు నర్సరీల పెంపకం కోసం ప్రభుత్వం విరివిరిగా రుణాలు ఇచ్చి ప్రొత్సహిస్తే నిరుద్యోగ సమస్యకూడా తీరుతుందని చెబుతున్నాడు. హరిత హారం పేరుతో రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన ఉద్యమంలో తాను కూడా పాల్గొంటున్నాని చెబుతున్నా రామయ్య ప్రజలకు దేవుడంటే భయం..భక్తి ఉన్నట్లుగానే మొక్కలంటే కూడా అదే విధంగా భయం భక్తి ఉండాలంటాడు.

అవార్డులు రివార్డులు
పర్యావరణ పరిరక్షణ కోసం నిస్వార్ధంతో పనిచేస్తున్న రామ య్యను కేంద్ర, రాష్ర్టప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు, రివార్డులు వరించాయి.1991లో అప్పటి ముఖ్యమంత్రి నేదు రుమల్లి జనార్ధన్ రెడ్డి,అప్పటి జిల్లా కలెక్టర్ లక్ష్మీపార్ధసారధి, రోటరీక్లబ్ పలు అవార్డులను అందజేశారు. 1994లో అప్పటి జిల్లా కలెక్టర్ అజయ్‌ప్రకాశ్ సాహ్ని నుంచి ఉత్తమ వన్య సంర క్షుడు, 1995లో పర్యావరణ విశిష్ట అవార్డును అం దుకున్నారు. ప్రధాని పివిన ర్సింహ్మరావు, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి,రోశయ్య, గవర్నర్ సుశీల్ కుమార్ షిండే, పి వి రంగయ్య నాయుడు, తుమ్మల నాగేశ్వర్‌రావు, రామిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వర్ రావు,జలగం ప్రసాద్‌తో పాటు పలువురుకేంద్ర మంత్రులు, ప్రముఖ వ్యక్తులచే వృక్ష మిత్ర, వృక్షపిత, వనజీవి వంటి బిరుదులను, అనేక అవార్డులను, సత్కారాలను పొందారు. అంతేగాక కలెక్టర్లు నాళం నర్సింహ్మరావు, అరవిందకుమార్ గిరిధర్, ఉషారాణి, తదితన కలెక్టర్లచేత ప్రశంసలు పొందా రు. బెంగుళూర్‌కు చెందిన అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్ధ నుంచి డాక్టరేట్‌ను పొందారు. గుల్బర్గా జాతలో జ్ఞాపికతో పాటు పదివేల నగదు బహుమతిని కర్నాటక ప్రభుత్వం అందజేసింది. 1995లో అటవీ శాఖ నుంచి పర్యావరణ పరిరక్షణ అవార్డును పొందారు. 2015లో ఢిల్లీలో జాతీయ ఇన్నోవేషన్ ఆండ్ అవుట్ స్టాండింగ్ ట్రేడిషినల్ నాలేడ్జ్ అవార్డును కేంద్ర మంత్రుల ద్వారా అందుకున్నారు. 2017కి గాను పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యే జిల్లా ఖ్యాతిని ఇనుడింపజేశారు.

Vanam-PP

– వనం వెంకటేశ్వర్లు
9848997240

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles