Home ఎడిటోరియల్ చైనా విభిన్న అగ్రరాజ్యం

చైనా విభిన్న అగ్రరాజ్యం

Socialist political economy with chinese characteristics

 

చైనా శ్రామికవర్గ నాయకత్వ సోషలిస్టు రాజ్యం. రాజ్యాంగానికి ఆచరణలకు మధ్య తేడాలు సహజం. అయితే చైనాలో ఇవి అగాధంగా మారాయి. చైనా సమాజంలో వైవిధ్య క్యాపిటలిస్టు లక్షణాలు చొరబడ్డాయి. పని సరుకుగా మారింది. వినియోగతత్వం సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక అభివృద్ధికి హామీ ఇస్తోంది. డబ్బు సామాజిక వ్యవస్థలను నిర్వహిస్తోంది. ‘చైతన్య’ క్యాపిటలిజం, ఆశ్రితపక్షపాతం అసమానతలను పెంచాయి. సిద్ధాంతం, ఆచరణల మధ్య అగాధాలు కమ్యూనిస్టు పార్టీ విప్లవ చరిత్ర పూర్వ ప్రమాణాలుగా మారాయి. చైనా ఇంటా బయటా చాలా వేగంగా మారింది. అమెరికాకు ఏకైక పోటీ దేశంగా తయారైంది. పూర్వ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ సైన్యాధ్యక్ష పదవిని వదులుకున్నారు. 1949 విప్లవంతో ప్రజాతంత్ర ఘనతంత్ర చైనా ఏర్పడ్డ తర్వాత మొదటిసారి మూడు దేశ సర్వోత్తమ పదవులు ప్రశాంతంగా ఏకమయ్యాయి. ఒకే నాయకుడు హు జింటావోకు దఖలుపడ్డాయి. చైనా విజయాలు ప్రశంసలు అందుకున్నాయి.

ప్రత్యర్థులు అపకీర్తి పాలయ్యారు. బలహీనతలున్నా చైనా, కమ్యూనిస్టు పార్టీ స్థిరత్వాన్ని స్థాపించుకున్నా యి. 1976లో మావో మరణించారు. 1978లో నిబద్ధ మావోయిస్టు సర్వోన్నత (పారమౌంట్) నాయకుడు డెంగ్ జియావోపింగ్ (1904-97) నాయకత్వంలో సంస్కరణోద్యమం మొదలైంది. డెంగ్ ‘గొప్ప ముందడుగు’ (1958-62) ఉద్య మం విమర్శలకు గురైంది. శ్రామిక సాంస్కృతిక విప్లవంలో మావో డెంగ్‌ను ప్రక్కనపెట్టారు. డెంగ్ సంస్కరణలు విపత్తులు, ప్రతిఘటనలు ఎదుర్కొన్నాయి. సంస్కరణల తర్వాత 1984లో సంపద పునఃపంపిణి జరిగింది. ప్రభుత్వాధీన వనరులు ప్రైవేటికరించబడ్డాయి. అసమానతలు మొదలయ్యాయి. సామాజిక భద్రత తగ్గింది. పేద ధనిక తేడాలు, నిరుద్యోగం పెరిగాయి. గ్రామాల నుండి పట్టణాలకు వలసలు మొదలయ్యాయి. 1989లో తియనాన్మెన్ స్క్వేర్ విషాద ఘర్షణ ఎదురైంది. బలంగా పాతుకుపోయిన అధికారవాదం, అవినీతికి వ్యతిరేకంగా చట్టబద్ధత కోసం కొందరు విద్యార్థుల, పట్టణ ప్రజల తిరస్కరణ ఉద్యమమం ఇది.

మేధావులు ఈ ఉద్యమ గాఢతను గుర్తించలేదు. వాస్తవిక సామాజిక లక్ష్యాలను సూచించ లేదు. అణచివేతకు సైన్యాన్ని అందించే రైతులు తటస్థంగా ఉన్నారు. సంస్కరణల లబ్ధి పొందిన నగరవాసులు ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ ఉద్యమ భగ్నతతో చైనా మార్కెట్ ఎకానమి మార్పుకు అడ్డంకులు తొలిగాయి. ప్రభుత్వం మధ్యతరగతి అభివృద్ధికి, కొత్త బూర్జువా వ్యాపార వర్గాలకు వత్తాసు పలికింది. మావో కాలంలో రద్దయిన వ్యాపార వర్గ పార్టీ సభ్యత్వం పునరుద్ధరించబడింది. ప్రగతిశీల భావజాలానికి బదులు జాతీయవాదం పార్టీ దిశను నిర్ణయించింది. దోపిడీ, సామ్రాజ్యవాదాల నుండి దేశ రక్షణ, ఐక్యత పార్టీ ప్రథమ లక్ష్యాలుగా మారాయి. ఈ నాటకీయత పట్టణ ప్రాంతాల్లో, మేధావుల్లో కేంద్రీకృతమైన క్రియాశీల శక్తుల మద్దతును కూడగట్టింది. స్టాలిన్ కాలపు సోవియట్ అనుభవాల ఆధారంగా లెనినిస్టు ఆలోచనలతో పార్టీ కార్యక్రమం ప్రభావితమైంది. 1949కు ముందటి విప్లవ నాయకులు కమ్యూనిస్టు పార్టీలో అధికార పదవులు పొందారు.

సామాజిక అధికారాలు దక్కించుకున్నారు. ప్రజలకు దూరమయ్యారు. రైతులతో సహా ఇతరులకు అధికార భ్రమలు లేవు. మావో నాయకత్వంలో కొత్త నిరంకుశత్వ వారసత్వం ప్రవేశించింది. ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయవాదం, పాశ్చాత్య తరహా ఆధునికత ప్రాధాన్యత పొందాయి. చైనా నమూనా సోషలిజానికి ఇదే మూలం. విముక్తి, ప్రజాస్వామ్యం, ప్రజలకు అధికారం వంటి ఆశయాలు వెనుకపట్టుపట్టాయి. మైనారిటీలు అశ్రద్ధకు గురయ్యారు. చైనా సోషలిజం జాతీయవాద వైవిధ్య రూపం. సోషలిజమో, పెట్టుబడిదారీ విధాన వ్యతిరేకతో, క్యాపిటలిజమో తెలియని జాతీయవాదంతో ప్రజలను నియంత్రించే పాశ్చాత్య పద్ధతిని చైనా అమలు చేసింది. జాతీయవాద సమీకరణ నేర్చుకుంది. చైనా జాతీయవాదం రాజ్య కేంద్రీకృతమైంది. అధికారవాదమైంది. ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. అనేక దేశాలతో యుద్ధా ల నుండి బహుళత్వానికి, ప్రజాస్వామ్యానికి తావులేని చైనా పురాతన సంప్రదాయవాదం పుట్టింది. పార్టీ- రాజ్య వ్యవస్థకు, దేశాధికారానికి, జాతీయవాదానికి, వనరుల సమీకరణకు అనుకూలంకాని ప్రజా విముక్తి ఆకాంక్షలను అణగదొక్కారు.తీవ్ర నియంత్రిత పరిమాణంలో సామాజిక విముక్తి అనుమతించబడింది.

అనధికార, చట్టరహిత, కొంతమేరకు సహించిన మార్కెట్ వ్యవస్థ చైనా, రష్యాలలో ఉండింది. మార్కెట్ సోషలిజాన్ని డెంగ్ కనిపెట్టలేదు. బోల్షివిక్ విప్లవకారుడు, మార్క్సిస్టు తత్వవేత్త బుఖారిన్ (1888-1938) కాలంలో, 1960ల చర్చల్లో సోవియట్‌లోను, చైనా విచక్షణ ఆలోచనల్లోనూ మార్కెట్ సోషలిజం పూర్వ ప్రమాణాలు ఉన్నా యి. ఆధునికత్వ చర్యల్లో, ప్రేరణాత్మక జాతీయవాదంలో పార్టీ బలాలు, విజయాలకు సహకరించిన ప్రాతిపదికలు సోషలిజం మార్పులకు, అంతిమ పరిత్యాగానికి బాధ్యత వహిస్తాయి. డెంగ్ సంస్కరణ ఉత్సాహం, ‘నిజమైన’ సోషలిజం పునరుజ్జీవన ప్రయత్నాలు కొత్త నమూనాను తయారు చేశాయి. ప్రపంచ క్యాపిటలిజం ‘విజయాల’ నుండి నాయకులు ప్రోత్సాహం పొందారు. సాంస్కృతిక విప్లవ అణచివేత, హింస నిగూఢ లక్ష్యాలు, సమాజాన్ని బాధల్లో ముంచాయి. మావో అనుచర నాయకులు దేశానికి ఈ కొత్త వారసత్వాన్ని అందించారు. మావో శకాంతపు చైనా ప్రపంచానికి, ప్రత్యేకించి అమెరికాకు రాజకీయంగా, ఆర్థికంగా తలుపులు తెరిచింది. ప్రజలు, పెట్టుబడిదారీ ప్రపంచ ప్రజలలాగా బతకాలనుకున్నారు. నిర్వాహకులు, అధికారులు సుస్థిర పరిస్థితులను, ప్రాతిపదికలను కోరుకున్నారు.

సోవియట్ పతనంలో లాగే, మావోయిజాన్ని నాశనం చేసిన శక్తులు పార్టీ నుంచే పుట్టుకొచ్చాయి. పార్టీ గ్రామీణ సమాజాన్ని దగ్గరగా గమనించింది. తగిన మార్పులు చేసింది. ప్రభుత్వ ఆధునికతా వాదానికి వ్యతిరేకంగా ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. సంప్రదాయ విలువలను కాపాడింది. సూత్రబద్ధంగా నిషేధించిన కుటుంబ, వంశ విలువలను, సంప్రదాయాలను, మత ఆలోచలను రైతులు ఆచరించారు. అదే సమయంలో మావో అనంతర విధానాలకు పునాది వేసిన, 1949కు ముందు ప్రవేశపెట్టిన, గ్రామీణ పునరుజ్జీవనం, సనాతన భావాల తిరస్కరణల పరివర్తనను కొనసాగించారు. ఏకరీతి జీవితాలను గడుపుతున్నట్లు, ఒకే రకం ఆలోచనలు ఉన్నట్లు కనిపించినా పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే జరిగింది. మావోయిజం నిరంకుశంగా, అప్రజాస్వామికంగా మారింది. ఏళ్ళ తరబడి లక్షల సంఖ్యలో రైతులు పట్టణాలకు పారిపోయారు. మొదట అనుమతి లేకుండా, తర్వాత ప్రభుత్వ మౌనంతో. చివరికి ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యయాన్ని తగ్గించే విధానంతో వలసలను అనుమతించింది. లక్షల పట్టణవాసులు కుంభకోణాలతో, వ్యాపారాలతో బతికారు. కొందరు స్వేచ్ఛ కోరుతూ సినిమా, కళారంగాల్లో ప్రవేశించారు. కొందరు మార్క్సిస్టు- లెనినిస్టు- మావోయిస్టు పిడివాదం నుండితప్పించుకున్నారు.

కొన్నిసార్లు ఇది రాజీలకు, పరీక్షలకు దారితీసింది. లక్షలాది ప్రజలు నిరుద్యోగులుగా, పేదలుగా మారారు. బతుకు దెరువు కోసం పోరాడారు. ఒకవైపు డాలర్ కోటీశ్వరులతో, మరోవైపు కొత్త పేదలతో పెట్టుబడిదారీ అసమానతలు, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారీ దోపిడీ, పర్యావరణ సమస్యలు, అవినీతి పెరిగాయి. 1989 నాటికి తిరుబాట్లు, అశాంతి ప్రదర్శనలు, కొన్ని చోట్ల ప్రశాంతంగా కొన్ని చోట్ల హింసాయుతంగా, జరిగాయి. ప్రభుత్వం వీటిని నిరోధించింది. మార్పులను రుద్దింది. ఆశించిన దాని కంటే ఎక్కువగా సంస్కరణల ఫలితాలను సాధించింది. ప్రభుత్వం, పార్టీ కొంత రాజీ పడినప్పటికీ తమ నిర్ణయ, అమలు అధికారాలను, గుత్తాధిపత్యాన్ని, ఏకపక్ష ప్రయోగాలను నిలబెట్టుకున్నాయి. చైనా అనేకులు ఆశించిన, కోరిన రీతి అగ్ర రాజ్యంగా మారలేదు. నేటి దాని స్థితి సమ సమాజ వాంఛితులకు, పేదలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భయం, సమ పన్నులకు, కార్పొరేట్లకు హర్షం కలిగిస్తోంది. నిరంకుశ ఏకపక్ష నిర్ణయాలతో ప్రపంచాన్ని శాసించే పెట్టుబడిదారీ దేశాల శిబిరంలో చైనా చేరరాదని, విభిన్న సోషలిస్టు అగ్ర రాజ్యంగా ఎదగాలని కోరుకుందాం.

Socialist political economy with chinese characteristics