Thursday, April 25, 2024

మహిళలు చదువుకుంటే సమాజం బంగారం అవుతుంది: పోచారం

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: మహిళలు చదువుకుంటే సమాజం బంగారం అవుతుందని, నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయినిలుగా అవార్డులు సాధించిన ఉపాధ్యాయినిలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు.

లక్షాన్ని సాధించాలంటే కష్టపడి చదవాలని, గతంలో మహిళలు అంటే ఇంటికి మాత్రమే పరిమితం అనే నానుడి ఉండేదన్నారు. చదువుకునే బాలికల సంఖ్య తక్కువగా ఉండేదన్నారు. మహిళలు చదువుకుని అన్ని రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే సావిత్రి బాయి ఆత్మకు నిజమైన నివాళి అన్నారు. మహిళలకు విద్య ప్రాముఖ్యతను గుర్తించి 192 సంవత్సరాల క్రితమే పాఠశాలలో విద్యను బోధించిన ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అని గుర్తు చేశారు. లాభ పేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేసే వారిని సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు.

తమ జీవితాలను దేశం కోసం, ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తులు జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరులన్నారు. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అన్నారు. బాలికలకు విద్య అవసరమనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను స్థాపించామన్నారు. విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందన్నారు. పేదరికంలో ఉన్న పేదింటి ఆడ పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్డీవో రాజాగౌడ్, నాయకులు అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, పిట్ల శ్రీధర్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News