Home కెరీర్ స్టడీ కాదు..స్కిల్‌పై దృష్టి అవసరం

స్టడీ కాదు..స్కిల్‌పై దృష్టి అవసరం

softskills12వృత్తి నైపుణ్యం… మా దేశంలో వృత్తి నైపుణ్యం ఉన్న యువతకు కొదువ లేదు… రండి… మీ మీ కంపెనీలు స్థాపించండి. పెట్టుబడులు పెట్టండి… లాభాలు ఆర్జించండి… అంటూ ప్రధాని నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ విదేశాలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి పారిశ్రామిక వేత్తలు, ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగ సంస్థలు, ఇతర కంపెనీల యాజమాన్యాలను కోరుతున్నారు. వారు అలా మాట్లాడుతుంటే మన దేశంలో పారిశ్రామిక రంగాల యాజమాన్యాలు మాత్రం వృత్తి నైపుణ్యం ఉన్న వారి కొరత తీవ్రంగా ఉందని, ఫలితంగా నాణ్యత పూర్తిగా ఉన్న ఉత్పత్తులు చేయలేకపోతున్నామనీ వాపోతున్నాయి.

ఈ నేపథ్యంలో వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు ఇప్పుడు అనేక అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిని మనకు అనువుగా మలచుకోవాలన్నా, కేవలం ఆయా రంగాలకు సంబంధించిన చదువుతో సరిపోదు. వాటికి సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే లక్షం నెరవేరుతుంది. యువత వాటిని అందిపుచ్చుకుంటే మన దేశంలోనే ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పిలుపునకు స్పందించి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. రానున్న మూడు, నాలుగు సంవత్సరాలలో వందలాది సంస్థలు మన దేశంలో తమ సంస్థల శాఖలను ఏర్పాటు చేసే అవకాశాలు దండిగా ఉన్నాయి.

ఆ అవకాశాలను వృథా చేసుకోకుండా ఉండటానికి యువత ఆరంగం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఒకటి. యువత తాము ఏ రంగాన్ని ఎంపిక చేసుకున్నా, దానికి సంబంధించి కేవలం విషయ పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకూడదు అంటున్నారు నిపుణులు. ఆ రంగానికి సంబంధించి మూలాల నుంచి ఆమూలాగ్రంగా విషయపరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని స్వంతం చేసుకుంటేనే ఆరంగంలో వారు తమ నైపుణ్యాన్ని కనబరచి యాజమాన్యాలమెప్పు సంపాదించేందుకు, ఉద్యోగంలో అభివృద్ధి పొందేందుకూ అవకాశం ఉంటుంది.

ఎన్నో అవకాశాలు…
వృత్తి నైపుణ్యం అంటే ఏవో వస్తువులుతయారు చేయటం లోనో, కొత్త పరికరాలు కనిపెట్టటం వంటివి కాదు. ఇప్పుడు వృత్తి నైపుణ్యానికి అర్థాలు మారిపోయాయి. అవకాశాలూ ఆ కోణంలోనే వస్తున్నాయి. కార్యాలయ పరిపాలన నుంచి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ దాకా ప్రతి రంగంలోనూ వృత్తిపరమైన నైపుణ్యాలు ఉన్న యువత ఇప్పుడు దేశానికి చాలా అవసరంగా తయారైంది. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హతతో లభించే ఉద్యోగాల నుంచి పీహెచ్‌డీ స్థాయి దాకా వృత్తి నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పుడు అనేకసంస్థల్లో అకౌంట్స్ రాసే విధానానికి స్వస్తి పలుకుతున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్ సాంకేతిక నైపుణ్యాన్ని అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఉండే ఇఆర్‌సి సొల్యూషన్స్ ద్వారా అనేక కంపెనీలు తమ పని సులభం చేసుకుంటున్నాయి. పిహెచ్‌డి, ఆర్ అండ్ డి స్థాయిలో ప్రొడక్ట్ డిజైన్, అభివృద్ధి దాకా సాఫ్ట్‌వేర్ ఆధారిత డిజిటలైజేషన్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా పరిశోధకులు తమ పని తేలిగ్గా చేసుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక వృత్తి నైపుణ్యాలు అలవరచుకుంటేనే, అందుబాటులోకి తెచ్చుకుంటేనే ఏ విభాగంలో అయినా మంచి కెరీర్ సంపాదించేందుకు అవకాశం లభిస్తుంది.

విద్యా బోధనలోనే చేర్చాలి…
ఇక్కడ ఒక మాట చెప్పాలి. వృత్తి నైపుణ్యం అలవరచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఎంపిక చేసుకునే రంగం విషయంలో సరైన మార్గదర్శకత్వం లేకపోవటం, లేదా తాను ఎంపిక చేసుకున్న రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవటం వంటి లోపాల కారణంగా యువత గందరగోళంలో పడిపోతున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ లోపాలను సవరించేందుకు విద్యార్థి దశ నుంచే వృత్తి నైపుణ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలను సిలబస్‌లో ప్రవేశ పెట్టటం లేదా ప్రత్యేకంగా ఒక పాఠ్యాంశంగా ఉంచటం వంటివి చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఈ అంశాన్ని సిలబస్‌లో చేరిస్తే ఆ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేటప్పుడు ఒక అవగాహనకు వస్తారు.

సమాచార వివరణ నైపుణ్యం ప్రధానం…
వృత్తి నైపుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే యువత అందుకు తగిన విధంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు సమాచార వివరణ నైపుణ్యం (కమ్యూనికేషన్ స్కిల్స్) సంపాదించుకోవాలనుకున్నారనుకోండి. క్షేత్ర స్థాయిలో ఒక ఉత్పత్తి గురించి వినియోగదారుడికి సంతృప్తికరమైన స్థాయిలో వివరించే సామర్థాన్ని పెంచుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా కంపెనీలో ఒక ఉన్నత పదవి సంపాదించారనుకోండి. తాము పనిచేసే కంపెనీ విధానాలు, భవిష్యత్తు ప్రణాళికల వంటి వాటిని బోర్డు డైరక్టర్ల సమావేశంలో క్షుణ్ణంగా వివరించగలిగినంత నైపుణ్యం ఉండాలి. లేకపోతే ఆ కంపెనీ పట్ల వినియోగదారులకు అప నమ్మకం ఏర్పడే ప్రమాదంతో పాటు ఆ నైపుణ్యం లేని వారి ఉద్యోగాలకు కూడా ఇబ్బంది ఎదురు కావచ్చు. అందుకే ఎదుటి వారిని మెప్పించే స్థాయి నైపుణ్యం అత్యవసరం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటం అత్యవసరం కాబట్టి ఆ భాష ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవలసిన అవసరం ఉంది.

కాలానికి అనుగుణంగా మారాలి…
విద్యార్థులు లేదా యువత తాము ఏ రంగానికి సంబంధించిన కోర్సులో చేరతారో ఆ విషయంలో సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. ఆ నైపుణ్యాలను స్వంతం చేసుకోవాలి. ఆ కోర్సుకు సంబంధించిన రంగంలో పరిశ్రమ పరంగా వచ్చిన కొత్త పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవగాహన పెంచుకోవాలి. పరిశ్రమల రంగం స్థితిగతులను అధ్యయనం చేస్తూ వాటిని తాము చదువుకున్న రంగానికి అన్వయం చేసుకునే విధంగా అధ్యయనాన్ని కొనసాగిస్తుండాలి.

సాఫ్ట్‌వేర్‌పై పట్టు అవసరం…
ప్రస్తుతం ప్రపంచం అంతా సాఫ్ట్‌వేర్ రంగం వైపే మొగ్గు చూపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయా కంపెనీలు అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న రంగంలో సాఫ్ట్‌వేర్ నైపుణ్యాన్ని అందించే కోర్సులను అదనంగా అభ్యసించాలి. ఉదాహరణకు అకౌంటింగ్‌లో షార్ట్‌టర్మ్ ఇఆర్‌పి సర్టిఫికేషన్లు, కార్యాలయ పాలనా నిర్వహణలో ఫైళ్ళకు సంబంధించి వస్తున్న సాఫ్ట్‌వేర్ స్వల్పకాలిక కోర్సులు నేర్చుకుని ఉండాలి.