Home ఎడిటోరియల్ దూతవల్ల కశ్మీర్ కొలిక్కి?

దూతవల్ల కశ్మీర్ కొలిక్కి?

Editorial

కశ్మీర్‌పై చర్చల పర్వానికి కేంద్ర భుత్వం తాజాగా మధ్యవర్తిని ఎంపిక చేసిన నేపథ్యంలో ఇంతకు ముందు అటువంటి ప్రయత్నాలు ఎందుకు విఫలం అయ్యాయో శోధించవలసి ఉంది. వారికి స్పష్టమైన అధికారాలు ఇవ్వ నందున మధ్యవర్తులు గతంలో ఎవరికీ ఏమీ చేయలేకపోయారు. నరేంద్రమోడీ ప్రభుత్వం గూఢచారి శాఖ మాజీ డైరెక్టర్ దినేష్ శర్మను జమ్ము- కశ్మీర్‌లో చర్చలు జరపడానికి మధ్యవర్తిగా ఇటీవల ఎంపిక చేయడం గమనిస్తే ఆ సమస్యను కేంద్రం రాజకీయ సమస్యగా కాకుండా భద్రతా సమస్యగానే చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఆ రాష్ట్రంతో లోతైన అనుబంధం గల వ్యక్తి చర్చలకు మధ్యవర్తి కావడం ఒక్కటే ఇందులోని మంచి. కానీ అతడు మాజీ పోలీసు అధికారి కావడంవల్ల ఆయననుంచి కేంద్రం ఏమి ఆశిస్తోందో కూడా తెలుస్తోంది. దాన్ని బట్టే సమస్యను భద్రతా కోణంలోనే కేంద్రం చూస్తున్నదని అర్థమవుతోంది. శర్మ 1990లలో ఆ రాష్ట్రంలో పనిచేశారు. అంతేకాకుండా గూఢచారి బ్యూరో (ఐబి)లో కశ్మీర్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఐబి అధిపతిగా కూడా కశ్మీర్‌పట్ల ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. అందుచేత అప్పగించిన అంశంపట్ల ఆయనకుగల సమర్ధతపై సందేహాలు ఎవరికీ లేవు. శర్మ తను కోరున్న ఎవరితోనైనా చర్చించవచ్చని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయన విప్తృత అధికార పరిథిని గురించి వివరించారు. ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నది ఆయన వివరించారు. కౌగలించుకోవడం ద్వారా తప్ప బుల్లెట్ల ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.
జమ్ము- కశ్మీర్‌తో వ్యవహరిస్తున్న ఐబి అధికారులకు అక్కడ నెలకొన్న పరిస్థితుల పట్ల చాలామంది ఇతరుల కంటె అవగాహన కొరవడింది అన్నది నా వ్యక్తి గత అభిప్రాయం. అక్కడ త్వర త్వరగా పరిస్థితులు ఎందుకు మారిపోతున్నాయో తెలియకుండా వాటితో వారు వ్యవహరించవలసి వస్తోంది. ఇజ్రాయిల్‌లో కూడా పరిస్థితులపట్ల ఆదర్శాల కోణంలో కాకుండా నిరసనను అణచివేసే కోణంలో వ్యవహరించడం వల్ల సమస్య ముదిరింది. ఆ దేశంలో అధికారంలో ఉన్న సంకీర్ణం నేత గత ఏడాది అక్కడి పరిస్థితిపై వివరిస్తూ గూఢచారి సంస్థలైన షిన్ బెట్ , మొస్సాద్ అధిపతులు వామపక్షీయులుగా మారిపోయారని విచారం వ్యక్తం చేశారు.శర్మను వామపక్షీయునిగా పేర్కొనడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆయన మెతక అని చెప్పడం కూడా ఉద్దేశం కాదు. ఎఎస్ దులత్ ఉదాహరణ మనకు ఉంది. ఆయనను మెతక అనవచ్చు అనుకుంటా. ఎం కె నారాయణన్ లేదా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉదాహరణ కూడా మనకు ఉంది. వారు ఎప్పటివలె దూకుడు చర్యలు కొనసాగించవచ్చ్చు. అయితే శర్మపై ఆయన నేపథ్యం ఆధారంగా ముందే ఓ నిర్ణయానికి రాలేము అని చెప్పడమే అసలు ఉద్దేశం. కశ్మీరీలపై దూకుడు కొనసాగించాలన్న ప్రభుత్వ లక్షం స్పష్టంగానే కనబడుతోంది. కశ్మీర్ అంశం పట్ల పాత ధోరణిలో మెతక వైఖరి పనిచేయదు అని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. తుపాకులు ఝుళిపించే వేర్సాటు వాదులకు ( కశ్మీరీలు అయినా, పాకిస్థానీలు అయినా) రాయితీలు ఇచ్చి లాభంలేదని కశ్మీరీలకు బోధ పడేలా చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది.
వేర్పాటు వాదులను దెబ్బతీయడానికి వారి మిలిటెంట్లను పద్ధతి ప్రకారం మట్టుబెట్టడం, వారి తరఫున బాహాటంగా పని చేస్తున్న కార్యకర్తలపై నిఘా సంస్థల ద్వారా విరుచుకుపడడం కేంద్రం చేస్తోంది. అలాగే రాళ్లు విసిరేవారిని కట్టడి చేయాలని లక్షంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చర్చలకు తమ సంసిద్ధతను కేంద్రం ప్రకటించింది. గత ఏడాది కాలంగా కశ్మీర్ లోయలో పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. మిలిటెంట్లు వారి మద్దతుదార్లు, సాధారణ పౌరులు అందరూ భయంభయంగా గడుపుతున్నారు. ‘ఈ పరిస్థితిని ఇంకా తీవ్రం చేస్తాం. కానీ బయట పడ్డానికి అవకాశం ఇస్తున్నాం’ అని కేంద్రం కశ్మీరీలకు చెబుతున్నట్టుగానే ఉంది. కఠినంగా వ్యవహరించడం వల్ల లొంగి వస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ భావించడం వల్ల వియత్నాం కల్లోలం ఐదేళ్లు సాగదీయబడి, వేల మంది వియత్నామీలు మరణించారు. బల ప్రయోగం ఫలితాలు అలాగే ఉంటాయి. ఈ కోణంలో ఆలోచిస్తే ప్రభుత్వం కశ్మీర్ పట్ల కొత్తగా చేపట్టిన చర్చల కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందా అన్నది అనుమానం.
ఉగ్రవాదుల వేర్పాటువాదంతో మెలిగే విషయంలో ప్రపంచం రెండు విజయవంతమైన వరవడులను మనముంవు ఉంచింది. సైనిక మార్గంలో వారిని కఠినంగా అణచివేయడమో లేదా ఓరిమితో, సానుభూతి దృష్టితో చట్ట ప్రకారం మెలగడమో చేయాలి. భారత దేశం జమ్మూ కశ్మీర్ విషయంలో ఈ రెండింటి కలగలుపు వ్యూహాన్ని గందరగోళంగా అమలుపరుస్తోంది. కశ్మీర్ తీవ్రవాదం సమస్య 25 ఏళ్ల నుంచి ఉంది. ప్రభుత్వం ఏమాత్రం సరళంగా స్పందించలేదు. 1990 నుంచి 20,000 మందికి పైగా మిలిటెంట్లను వధించారు. 15,000 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ వేర్పాటువాదం సజీవంగానే ఉంది. వేర్పాటు వాదుల హింసాకాండకు పాకిస్థాన్ మద్దతు ఉంది. కేవలం ఆయుధాలు సరఫరా చేయడం, ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా కశ్మీర్ లోయలోకి చొరబాట్లను సాగించడం వెనుక పాక్ ప్రమేయం ఉంది. అయితే అందుకు భారత్ రాజకీయంగా తప్పుడు ఆలోచనతో వ్యవహరించడం కూడా కా రణం. అక్కడ ఎన్నికలు క్రమం తప్పకుండా జరిగాయి. మధ్యవర్తుల ద్వారా చర్చల పర్వం సాగించే ప్రయత్నాలు కూడా గతంలో జరిగాయి. అయితే ఆ ప్రయత్నాలను సరిగా చేయకపోవడం ఫలించలేదు. వేర్పాటు వాదులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరించడానికి రాజేష్ పైలెట్, జార్జి పెర్నాండెజ్ వంటి వారు పదవుల్లో ఉన్నప్పుడు ప్రయత్నించారు.2001లో మొదటి మధ్యవర్తిగా కెసి పంత్ నియామకం జరిగినా భారత, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణంవల్ల ఆయన యత్నాలు కొలిక్కి రాలేదు. పార్లమెంట్‌పై తీవ్రవాదుల దాడివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగి యుద్ధ వాతావరణం నెలకొంది. దానికి ముందు 2000 ఆగస్టులో కశ్మీర్ లోయలో కాల్పుల విరమణ చోటు చేసుకుంది. అప్పుడే హిజ్బుల్ ముజాహిదీన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చల పర్వం కూడా అర్ధాంతరంగా ముగిసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి కమల్ పాండే సారథ్యంలో ప్రభుత్వ ప్రతినిధి వర్గాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే దానిని ముందుకు తీసుకుపోవడంలో ఇరుపక్షాలు విఫలమై చర్చలు కూలబడ్డాయి. 2002లో రెండవ దశ కశ్మీర్ కమిటీని ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ సారథ్యంలో ఏర్పరచారు.ఎం.జె అక్బర్‌సహా ముగ్గురు జర్నలిస్టులు, న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్, సుప్రీంకోర్టు న్యాయవాది అశోక్ బన్, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి వికె గ్రోవర్, న్యాయ నిపుణుడు ఫాలీ నారీమన్‌తో ఆ కమిటీ ఏర్పడింది. ఇది కూడా చతికిలబడింది. ఆ తర్వాత ఎన్‌ఎన్‌వోహ్రా తదితరులద్వారా జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు.