Home తాజా వార్తలు పల్లెల్లో కొత్త వెలుగులు

పల్లెల్లో కొత్త వెలుగులు

Electrical problems

 

పల్లెల్లో కరెంటు కష్టాలకు చెక్
పవర్‌వీక్ ఎంతో ప్రయోజనకరం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని
1720 గ్రామాల్లో పనులు

యాదాద్రిభువనగిరి : ప్రతి పల్లె బాగుపడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ 30రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. పారిశుద్ధం, హరితహారం, పాతభవనాల తొలగింపు,శ్మశాన వాటికలు చెత్త డంపింగ్ యార్డులకు స్థలాలగుర్తింపు, నిలిచిపోయిన మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులతోపాటు ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న విద్యుత్ సమస్యలను ఈ కార్యక్రమంలోనే పొందుపరిచారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలో 1720 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

కలెక్టర్లు, అధికారులు పల్లెలకు వెళ్తూ ప్రజల కష్టాలను తీరుస్తున్నారు. ప్రణాళికలో పవర్‌వీక్‌ను చేర్చడంతో ఉత్తర మండల విద్యుత్ పంపిణీసంస్థ అధికారులు సమస్యలున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎండి డిస్కం పరిధిలోని అధికారులతో రెండు గంటల పాటు సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి వంగిన స్తంభాలను సరిచేస్తున్నారు. వదులుగా ఉన్న తీగలను లాగి ప్రమాదాలను నివారిస్తున్నారు. వేలాది కొత్త స్తంభాలను వేసి పాత వాటిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల పరిధిలోని 1720 గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగు పరచాలని లక్షం పెట్టుకున్నారు.

పూర్తయితే ప్రయోజనం : 24 గంటల విద్యుత్తు అందిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్ఠ పరుస్తున్నారు.అక్టోబరు మొదటి వారంలో ఈ పనులు పూర్తవనున్నాయి. తర్వాత ప్రమాదాలు, ట్రాన్స్ ఫార్మర్ల వైఫల్యం తగ్గుతుంది. 30రోజుల ప్రణాళికలోనూ వీటిపై దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు సిబ్బందికి ఫిర్యాదులు ఇవ్వడంతో యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఉపకేంద్రంలో ఫీడర్ల వారీగా సమస్యలను గుర్తించే విధానాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది.

ప్రజలు కలిసి వస్తున్నారు: 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి చేస్తు న్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పవర్ వీక్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని,ఇప్పటికే ఎన్పీడీసీఎల్ పరిధిలో వేలాది గ్రామాల్లో సరఫరా వ్యవస్థను బాగుచేసి,జిల్లాకో నోడల్ అధికారిని నియమించడం జరిగినట్లు,అనేక గ్రామాల్లో ప్రజలు తోడ్పాటు అందిస్తున్నారని,కొన్ని చోట్ల సర్పంచ్లు కరెంటుసిబ్బంది వెంటే ఉంటూ కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నారనీ,నిధుల కొరత లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారనీ కరెంట్ సిబ్బంది అధికారులు తెలుపుతున్నారు.

Solves Electrical problems in countryside