Home ఎడిటోరియల్ మల్లన్న సాగర్ మడతపేచీ

మల్లన్న సాగర్ మడతపేచీ

బి.నర్సన్ 

mallanna-sagarప్రజల సొత్తయిన ఈ నేల అటు కేంద్రప్రభు త్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రీతిపాత్రమైనది. ఓ వైపు కేంద్రం పారిశ్రామిక వేత్తలకు విదేశీ పెట్టుబడి దారుల కోసం భూసేకరణకు నడుం కట్టగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తాము ప్రైవేటు శక్తులతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం భూమి, నీరు, విద్యుత్తు ఇవ్వ డానికి, నీటి పారుదల ప్రాజెక్టులకు భూసేకరణను భారీ ఎత్తున చేపడుతున్నారు. రాజ్యసభలో వీగిపోయిన ప్రతి పాదిత చట్టం అలాగే ఉండగా 2013 భూసేకరణ చట్టంలో ఉన్న సెక్షన్ 107 ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు తమతమ అవసరాల నిమిత్తం భూసేకరణ చేసుకోవచ్చు. ఇదే అదునుగా ఫిబ్రవరి 2016లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ‘సామాజిక ప్రభావాల అంచనా’ను దులిపేసి చట్టం తయారు చేసుకుంది. నరేంద్రమోడీ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల స్థాపనకు ఇచ్చిన అనుమతి సాకారానికి అనుకూలంగా గుజరాత్ లో భూసేకరణ చట్టం రూపుదిద్దుకొంది. ఇదే బాటలో తెలంగాణ ప్రభుత్వం సైతం చట్టసభతో సంబంధం లేకుండానే 2015జులైలో 123 నెంబర్‌తో ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. టిఎస్‌ఐపాస్‌కు సత్వర భూసేకరణ ఈ ప్రభుత్వానికి కూడ అవసరం.
జి.వొ. 123, 2015 ప్రకారం భూసేకరణ కమిటీల్లో జిల్లా కలెక్టర్, భూ అవసరదారులుంటారు తప్ప భూమి కోల్పోతున్న రైతులకు, వారి ప్రతినిధులకు, స్థానిక గ్రామ పెద్దలకు ఇందులో స్థానం లేదు. అంతేకాకుండా భూమికి విలువ కలెక్టరే నిర్ణయిస్తారు. దాని ప్రకారం భూమి విలువను డబ్బు రూపంలో పొందిన రైతుకు ఏ విషయంలోనూ తిరిగి కోర్టుకు వెళ్ళే అధికారం ఉండదని ఆ ఉత్తర్వును విశ్లేషించినవారు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోంచి మల్లన్నసాగర్‌ను గమనిస్తే – ఈ ఎత్తిపోతల పథకం, ఆకృతి మార్చిన కాళేశ్వరం పథకం లో భాగం. కాళేశ్వరం కిందుగా మేడిగడ్డ బ్యారేజీ, అటు నుంచి నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మళ్లించి అక్కడనుండి మిడ్ మానేరు ఆ తర్వాత మల్లన్నసాగర్, కొండపోచమ్మ తదితర రిజర్వాయర్లకు నీళ్లు మళ్లించి నిలువ చేసు కోవడం దీని లక్షం. తద్వారా నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 20లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా. ప్రతి ఏటా వేయి టిఎంసిల గోదావరినీళ్లు వృధాగా సముద్రం పాలవు తున్నందున ఈ పథకాల ద్వారా 150 టిఎంసిల నీళ్లనైనా నిలువచేసుకోవచ్చని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఆలోచన.
ఈ రిజర్వాయర్లలో అన్నింటికన్నా పెద్దది మల్లన్న సాగర్. రంగనాయకమ్మ రిజర్వాయర్ నిలువ 3 టిఎంసి లు, కొండపోచమ్మ 7 టిఎంసిలుండగా కొమరెల్లి మల్లన్న రిజర్వాయర్ 50 టిఎంసిలు నీటి నిలువకు స్థలం కావా లి. అందువల్లనే 11 గ్రామాలు 16వేల ఎకరాల భూమిని 2800 కుటుంబాలు కోల్పోవలసి వస్తున్నది. అత్యధి కంగా ఏటిగడ్డ కిష్టాపూర్ 740 కుటుంబాలు, వేముల ఘాట్ గ్రామం 675, పల్లెపహాడ్ 482, ఎర్రవెల్లి 348 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి.
నిపుణుల మాట ఏమిటంటే 50 టిఎంసిల నిలువ సామర్థం అంటే దేశంలోనే ఎక్కడాలేని పెద్ద రిజర్వా యరవు తుంది. మామూలుగానైతే నదులకు అడ్డుగా కట్టే ప్రాజెక్టులు ఇంతవైశాల్యం కలిగి ఉంటాయి. జూరాల ప్రాజెక్టు నిలువ సామర్థం 17.6 టిఎంసిలు మాత్రమే. అందువల్ల గొలుసు రిజర్వాయర్ల మాదిరి విడివిడిగా నిర్మిస్తే నష్టం తక్కువగా ఉంటుందని వారి ఆలోచన.
సుమారు 60,000 ఎకరాల భూమి సేకరించాలని ఆ పై ఆ భూమిని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికుందని కూడా ప్రతిపక్షాల ఆరో పణ. ఎందుకంటే కొన్నేళ్ల కిత్రం తమిళనాడు ప్రభుత్వం ప్రజావసరాల నిమిత్తమని రైతులనుండి తక్కువ ధరకు భూమి సేకరించి అంతకన్నా తక్కువధరకే పెట్టుబడి దారులకు కట్టబెట్టిందని ఓ పత్రికలో వచ్చింది.
ఈ కోణంలోంచి కూడా నిపుణుల సలహా ఏమి టంటే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మిగి లిన భూమిని అసలు యజమానికి తిరిగి అప్పగించే నిబంధన కూడా ఉండాలని, మల్లన్న రిజర్వాయర్ నిర్మా ణంలో అటవీ ప్రాంతాన్ని వాడుకుంటే నాలుగు గ్రామా లను కాపాడవచ్చని ఒకరి సూచన. 50 టిఎంసిల నిలువ సామర్థంగల రిజర్వాయర్ అంటే అది గండిపేట చెరువుకన్నా 16 రెట్లు పెద్దదన్నమాట. ఇంత నీరు ఒకే చోట నిల్వవల్ల ఇంకిపోవడం, ఇగిరిపోవడంతో, నీటి నష్టంగా కూడా జరుగుతుందని మరో నిపుణుడి ఉద్దేశ్యం.
ఈ రిజర్వాయర్‌కు స్థల సేకరణలో ఇన్నేసి గ్రామా లు, ఎకరాలు బాధిత కుటుంబాలు ఉన్నందున రానున్న గొడవలను ముందే ఊహించిన ప్రభుత్వం సద్దుకాకుం డానే రైతులద్వారా, రాతపూర్వక ఒపపందాల ద్వారా స్థల సేకరణ చేస్తూ చెక్కులు చేతిలోపెడుతూ పని కొనసాగించింది. ఓ రకంగా ఇది అన్యాయమే.
ప్రభుత్వం అంటున్నట్లు ప్రతిపక్షాలో, ప్రజాసంఘా లో రెచ్చగొడితే ప్రజలు రోడ్లమీదికి రాలేదు. భూమిపోతే పోయింది తగిన ప్రతిఫలమైనా దక్కడం లేదనే వేదనతోనే వారివెంట ఉన్నారు. భూమి, ఇల్లు, ఊరు కోల్పోవడమే అత్యంతవిషాదం. అందులో పునరావాసంలో న్యాయం జరగకపోవడం ఎవరికైనా కష్టమే.
కోల్పోతున్న భూమి విలువను ఎకరానికి ఐదు లక్షలని ప్రభుత్వమే నిర్ణయించి రైతులను నిలబెట్టి చెల్లింపులు చేయడం ప్రజల ఆగ్రహానికి నిజమైన కారణం. భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమికి మార్కెట్ విలువ ప్రకారం మూడంతలు చెల్లించాలి. ప్రజాసంఘాల ఒత్తిడికి దిగివచ్చిన ప్రభుత్వం అక్కడ ఎకరానికి రూ.60,000/- ఉంటుంది ఆ లెక్కన ప్రభుత్వం వారు ఇచ్చేది ఎంతో ఎక్కువని కొత్తరాగం ఆలపిస్తోంది. ఎటుతిరిగి ఎకరానికి ఐదు లక్షలు మించి ఈయకూడదని, మార్కెట్ రేటు ప్రకారం ఇస్తే ప్రభుత్వ ఖజానా భరించలేదని దీని అర్థం.
ప్రభుత్వం ఆలోచన ఇలా ఉంటే ఈ మధ్యభూమి కొనుక్కొని ఈ పథకం కారణంగా కొన్న భూమిని కోల్పో తున్నవారికి వారు కొన్న ధరలో సగంకూడా రావడం లేదు. ప్రభుత్వం దురాలోచనను ఈ ఉదంతాలు బయట పెడుతున్నాయి. భూసేకరణ ఆరంభించే ముందు తొగుడ, కొండపాక మండలాల్లోని భూములు ఎకరానికి 10 నుంచి 15 లక్షలు పలికాయి. దానికి ఆ సమయాన జరిగిన రిజిష్టర్ కాగితాలే సాక్షం. నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి భూవిలువను సవరించకుండా పాత ధర ను పట్టుకొని ప్రభుత్వం ఇదే న్యాయమనడం ప్రజల నష్ట దాయకం. అసలు తెలంగాణాలో వ్యవసాయ భూములు ఎకరాకు అరవైవేలవి ఎక్కడైనా ఉన్నాయనేదే అనుమానం.
ప్రభుత్వ ఆర్థిక స్థోమతను మించిన పథకాలతో వేలాది కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించలేక అడ్డ దారులు తొక్కడంవల్ల తెలంగాణ ప్రజలకు అపారమైన నష్టమే కలుగుతుంది. మల్లన్నసాగర్ విషయంలో మాత్రం ప్రభుత్వం ప్రతి పక్షాలను, ప్రజాసంఘాలను నిందించడం సబబుకాదు, ప్రభుత్వంనుంచి సరియైన స్పందన పొందని క్షణంలో ప్రజలు, వారి ప్రతినిధులు కోర్టులను ఆశ్రయిస్తారు. దానివల్ల మరింత నష్టం.. కాల హరణం, అంచనాలు తారుమారు అవు తాయి. ప్రజా సంఘాలు కోరినట్లు ప్రాజెక్టు ప్లానింగ్ రిపోర్టు బయట పెడితే ఓ సౌహార్థ్ర వాతావరణంలో చర్చ లు జరిగే అవకాశం ఉంది. మా మాటే చెల్లుబాటు కావా లనే పంతానికి పోకుండా ప్రభుత్వం నిపుణుల సూచన లు, సలహాలను ప్రజల యోగక్షేమాలకోసమైనా పరిగణ న లోకి తీసుకోవాలి. రిజర్వాయర్ సైజును తగ్గిం చి, ప్రత్యా మ్నాయంగా చిన్న రిజర్వాయర్లతో ఆశించిన ఫలి తాన్ని పొందడమో లేక అటవీ భూముల్ని తీసుకుని గ్రామా లకు జరుగు తున్న నష్టాన్నైనా తగ్గించడమైనా చేయాలి.
జి.వొ.నెం.123 తోనే గట్టెక్కాలనుకున్న ప్రభుత్వం ప్రజాసంఘాల ఒత్తిడితోనే భూసేకరణ చట్టం 2013ను అమలు చేయడానికి ముందుకు వచ్చింది. ఆ తర్వాత భూమి విలువను విపరీతంగా తగ్గించి జి.ఒ.నెం.123యే లాభదాయకమని ప్రజలను మభ్యపెట్టచూస్తోంది. నిజ మార్కెట్ విలువ ప్రకారం భూమి ధర చెల్లించటం ప్రభుత్వానికి తలకుమించిన భారమే. అలాగని ప్రజలను నిలువునా దోచుకోవడం కూడా అన్యాయమే.
ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి పరిహారం, ఉద్యోగం, అవసరం అయినోళ్లకు రెండు పడకల ఇల్లు ఇలా నోటినిండా ప్రతి సమావేశంలో మాట్లాడుతున్న నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులతో ముందుకు రావాలి. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించడంలో పేచీలేదన్న ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం భూమి ధర రైతులకు కట్టేయాలి. గ్రామసభలు నిర్వహించి రైతుల సమక్షంలో ఇరుపక్షాలకు అనువైన ధరనైనా నిర్ణయించుకోవాలి. న్యాయమైన మార్గాన్ని కనుగొనే దిశలో కాకుండా ప్రతి పక్షాలు, ప్రజాసంఘాలు ప్రజల ప్రయోజనాన్ని కాదని, మేలుచేసే పనులను అడ్డుకుం టున్నాయనడం ఈ విషయంలో మాత్రం తగదు. ఆడలేక మద్దెల ఓడన్నట్లు తగిన పరిహారం చెల్లించేందుకు మానసికంగా సిద్ధం లేకనో, ఆర్థిక సామర్థంలేకనో తమ తప్పును ఇతరులపై మోపడం, ప్రజలను తప్పుదారి పట్టించడం ప్రభుత్వానికి తగని పని.
– 9440128169