Home తాజా వార్తలు శివునికి అత్యంత ప్రీతికరం కార్తీక సోమవారం

శివునికి అత్యంత ప్రీతికరం కార్తీక సోమవారం

Somavara Vratham

 

కార్తీక మాసంలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఉపవాసం చేయగలిగిన వారు కీర్తక సోమవారం రోజున పగలు అంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే స్వీకరించాలి.

కార్తీకమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు. ఈ మాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం అత్యంత శ్రేష్ఠమైంది. కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా ‘కార్తికదామోదర ప్రీత్యర్థం’ అని ఆచరించాలని శాస్త్రోక్తి. శరదృతువులో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. కార్తీకమాసంలో మానసిక, శారీరక రుగ్మతులను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైంది. సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో రావిచెట్టు మొదట్లో గానీ, తులసీవనంలో గానీ భగవంతుని స్మరించుకోవచ్చు. కార్తీకమాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి. సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు.

ఉపవాసం : కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించడం.
ఏకభుక్తం : స్నానం, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.
నక్తం: పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి.
అయాచితం : భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం.
స్నానం : శక్తిలేని వాళ్లు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.
మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పైన పేర్కొన్న వాటిల్లో ఏది చేసినా సోమవారవ్రతం చేసినట్లే అవుతుంది. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడి తమోగుణ స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు..
కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

Somavara Vratham is Special in Karthika masam