Home ఎడిటోరియల్ కొన్ని రాలిన పూలు.. కొంత హిమ ధూమం

కొన్ని రాలిన పూలు.. కొంత హిమ ధూమం

Poemయుగయుగాలుగా అనాది ఆత్మ ఒకటి నాలో
వెంట ఒక గొర్రెల సమూహంవలె
పర్వతాలనూ, ప్రళయించే ఆకాశాలనూ, సముద్రాలనూ
ఎడారులనూ
కన్నీళ్ళ తుఫానులనూ, ద్రవిస్తూ ఆక్రోశించే మేఘాలనూ
ఋతువులు ఋతువులుగా వెంటపెట్టుకుని వస్తూ వస్తూ
ఒక అఖండ నిరంతరాన్వేషణ..
ఎక్కడో నా ఆత్మ జారిపోయింది
నదుల వెంట.. లోయల వెంట
బూజు పట్టిన శిథిల దుర్గాల అంతఃపురాల వెంట
ఏవో ఆనవాళ్ళు దొరుకుతాయని
పాదాలు ఈ అగ్నిశరీరాన్ని మోస్తూ
ప్రచండ ప్రళయ నర్తన .. భీకర భయద తాండవం
అడుగులు పడగానే శిలలు చిట్లిపోతూ
వేల మృదంగనాద భాంకారాలు..
రోదిస్తూ వందల వయొలిన్లు
కరిగి లావాలా ప్రవహిస్తూ.. అగ్నిధార దుఃఖం
వియుక్త సంయుక్తాల జుగల్ బందీ.. ఏకతాదాహం
పురులు పురులుగా విద్యుల్లతలు అల్లుకుంటూ, విడిపోతూ
ఒక ఆల్కెమీ.. రసవిద్యలన్నీ
మాంత్రిక తాంత్రిక స్వర ఝరులే.. థకదిమి.. థకదిమి
సారంగీ తీగలను మీటుతున్నప్పుడల్లా
కన్నీళ్ళను స్రవిస్తూ.. కాగితప్పడవల్లా హృదయాన్ని మోసుకుపోతూ
కంచుగజ్జెలు కుప్పలు కుప్పలుగా భళ్ళున విస్ఫోటిస్తున్న ధ్వని
శతాబ్దాల నాటి.. దిగుడు మెట్లతో
పాకురు పట్టిన కోనేరు
ఎక్కడని వెదకను పాదముద్రలను
ఆమె వెళ్ళిపోయిన జాడలను
నవ్వుల కెరటాలను విరజిమ్మే అవశేష పరీమళాలను
వియోగమే దుఃఖమూలం
సంయోగమే.. అంతిమ కాంక్ష
సరసరా ప్రాకే పాము నరనరాన –
మూసుకున్న కళ్లలో
శతాబ్దాల ఎడతెగని వాన
తడుస్తూ రెండు తీరాలు క్షితిజ సమాంతరంగా
తప్పదు ఎదురు చూపు.. అనంత శూన్యంలో వెదుక్కుంటూ
సగమే ఇక్కడుంది
ఇంకో సగం ఎక్కడో.. పొగమంచు లోయల్లో, కాలం పొరలకింద
ఒక చాచిన చేయి.. విముక్త ఆత్మ కోసం పరితపిస్తూ
చుట్టూ అన్నీ రాలిన పూలు.. హిమ ధూమం
సృష్టి సృష్టంతా భీషణ ఢమరుక ధ్వని.. అనంత తాండవం

– రామా చంద్రమౌళి
9390109993