Home తాజా వార్తలు శ్రమ ఎక్కువ విలువ తక్కువ ఛిద్ర జీవన చిత్రం

శ్రమ ఎక్కువ విలువ తక్కువ ఛిద్ర జీవన చిత్రం

Feel Workers Diary

 

ఒక ఫీల్ వర్కర్ డైరీ నుండి కొన్ని జ్ఞాపకాలు

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ లో ఒక చిన్న ఊరు రాంబాబుది. కొండల మీదకి ఎగబాకి పెద్ద పెద్ద కొండ రాళ్ళ కింద వేలాడే తేనె పట్టుల నుండి తేనెను సేకరించుకురావడంలో సిద్ధహస్తుడు. అత్యంత సాహసి. భయమే లేకుండా ఎంత పెద్ద కొండలనైనా ఎక్కి కొండ అంచుల చివరినుండి మొలకి కట్టుకున్న తాడు సహాయంతో వేలాడుతూ తేనెను పట్టుకొచ్చేస్తాడు. ఎన్ని రకాల తేనెలు వుంటాయో, వాటిని ఎలా సేకరిస్తారో ఓపికగా కూర్చుని చెప్పాడుమాకు ఎంతో సేపు. అయితే సేకరించిన తేనెను వారపు సంతలో అతను అమ్మేటప్పుడు అతనికి ఎంత ధర చెల్లిస్తారో తెలిసి ఆశ్చర్యపోయాం మేము. మనం మార్కెట్ లో కొనే ధరలో కనీసం పదవ వంతు కూడా అతనికి దక్కడం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి అంత రిస్క్ తీసుకుని అతను తేనె సేకరిస్తే అదా మీరిచ్చే ప్రతిఫలం అని అతని దగ్గర తేనె తీసుకునే దళారి ని అడిగితే అడవిలో ఊరికే ఉచితంగా దొరికే వాటిని ఏరుకొస్తే అంతకంటే ఎక్కువ ఎందుకమ్మా ఇచ్చేది అనేశాడు ఆయన. ఆ తేనెను సేకరించేందుకు రాంబాబు పెట్టిన సమయం, పడిన శ్రమ, తీసుకున్న రిస్క్ దేనికి విలువ లేదా? అనే ఆలోచనతో తిరిగి వస్తుండగా రాంబాబు ఆ రోజు సాయంత్రం తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు మమ్మల్ని.

దాదాపు పదేళ్ల క్రితం. నల్లమలలోని ఒక చెంచు పెంట (చెంచులు వారి గ్రామాలను పెంటలు అని పిలుస్తారు) లో ఒక అధ్యయనం కోసం కొన్ని రోజులు గడిపాం. నట్టడవి మధ్యలో ఉన్న ఆ చిన్ని ఊరిలో వున్నది 50- 100 కి మధ్య కుటుంబాలు. అడవిలో దొరికే తేనె, సారపప్పు, అడ్డాకులు, కరక్కాయలు, నన్నారి గడ్డలు ఇలాంటి ఉత్పత్తులు సేకరించి వాటిని అమ్ముకుని బతకడమే వీరి వృత్తి. అందరూ అన్నీ సేకరించరు. ఒక్కో కుటుంబం కొన్ని ఉత్పత్తుల సేకరణలో నైపుణ్యం కలిగి ఉంటుంది. అవి మాత్రమే వారు సేకరిస్తారు. మేము ఏ ఇంట్లో అయితే ఉన్నామో ఆ కుటుంబం వారు తేనె తో పాటు, నన్నారి గడ్డలు సేకరిస్తారు.

 

ఈ నన్నారి నే మారేడు గడ్డలు, షర్బత్ గడ్డలు అని కూడా అంటారు. మనం ఎంతో ఇష్టంగా తాగే షర్బత్ వీటితో తయారు చేసేదే. ఇవి సేకరించడానికి ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. ఒక కుటుంబంలోని భార్య, భర్త ఇద్దరూ పొద్దున్నే ఒక కత్తి, గునపం, బుట్ట తీసుకుని అడవిలోకి వెళతారు. ఈ మొక్కలు ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టుకున్నాక గునపంతో దాని చుట్టూ రెండడుగుల లోతు మట్టిని తవ్వుతారు. ఆ మొక్క వేర్లు కనపడే వరకు తవ్వుతారు. ఒక తల్లి వేరు, దానికి అంటుకుని పది నుండి పదిహేను పిల్ల వేర్లు ఉంటాయి. తల్లి వేరు దెబ్బ తినకుండా జాగ్రత్తగా పిల్ల వేర్లను కత్తితో కోసి బుట్టలో వేసుకుని ఆ మట్టిని మళ్ళీ పూడ్చి తిరిగి వస్తారు. ఇంటికి వచ్చాక ఆ గడ్డలను చక్కగా కడిగి ఎండబెట్టి తర్వాత వాటిని అమ్ముతారు. ఒక ట్రిప్ లో దాదాపు 4 నుండి 5 కిలోల నన్నారి సేకరిస్తే ఒక్కొక్క కిలో 55 నుండి 60 రూపాయల ధర పలుకుతుందని చెప్పారు వారు. వారంలో ఒకరోజు మాత్రమే వాటి సేకరణకు వెళతారు. మిగిలిన రోజుల్లో వేరే ఉత్పత్తులు సేకరించడం, వాటిని ఇంటి వద్ద ఎండబెట్టుకోవడం, అమ్మడం సరిపోతుంది వారికి.

ఈ అటవీ సంపదను ఎలా సేకరిస్తారో, వాటినుండి జీవనోపాధిని ఎలా పొందుతారో తెలుసుకోవడమే కాదు. వారి జీవన విధానం గురించి, వారి ఆహార అలవాట్ల గురించి, కట్టుబాట్ల గురించి కూడా తెలుసుకునే అవకాశం కలిగింది ఆ కొద్ది రోజుల్లో. చెంచులు నన్నారి గడ్డలు సేకరించుకునే ఆ మట్టిని ఇప్పుడు యురేనియం కోసం తవ్వుతారని వింటున్నాం. అదే కనుక జరిగితే నల్లమల వా రికి నివాస యోగ్యం కాకుండా పోవొచ్చు. ఆ అడ వి లేకుండా వారు మనుగడ సాగించలేరు. నిజానికి వారు లేకుంటే అడవికి కూడా మనుగడ లేదు.

రంపచోడవరం ఏజెన్సీ లో అనేక మంది గిరిజనులకు అక్కడి అడవిలో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి వారపు సంతలో అమ్ముకోవడమే ప్రధాన జీవనాధారం. గమ్ కరయా, కరక్కాయ, ఉసిరి, కుంకుళ్ళు, తేనె, తిప్పతీగ ఇలా ఎన్నో రకాల అటవీ సంపద వారికి దొరుకుతుంది. ఒక్కొక్కదానిని సేకరించేందుకు ఒక్కో పద్ధతి. కొన్ని ఎంతో కఠినం. కొన్ని చాలా తేలిక. విస్తరాకులు ఏరడం అలా తేలికగా సేకరించగలిగిన వాటిలో ఒకటి. అందుకే నేను వెళ్లిన గ్రామాలలో ముసలి వారైన స్త్రీలను మీరు బతకడానికి ఏ పని చేస్తారు అని అడిగితే విస్తరాకులు ఏరడానికి వెళ్తాం అని చెప్పారు. వారు ఆ ఆకులను ఏరి చేతితో విస్తరాకులు కుట్టి వారాంతపు సంతకు వెళ్లే ఎవరో ఒక యువతికి ఇచ్చి పంపి వాటిని అమ్మించుకుంటూ ఉంటారు. వచ్చే ఆదాయం తక్కువే. అయినా వారికి ఉండే శక్తికి వారు చేయగలిగిన పని అది మాత్రమే.

రోజుకి ఎన్ని విస్తరాకులు ఏరతారో, వాటిని ఎలా కుడతారో, వాటిని అమ్మితే ఎంత ఆదాయం వస్తుందో, ఎవరి ద్వారా వాటిని అమ్ముతారో అన్నీ వాళ్ళు ఓపికగా కూర్చుని చాలా సేపు చెప్పారు. వారితో మాట్లాడిన తర్వాత ఊరిలో తిరుగుతుంటే ఒక చోట విస్తరాకుల తయారీ కేంద్రం అని బోర్డు ఉన్న ఒక గది తాళం వేసి కనిపించింది. అది ఏంటి, అక్కడ ఎవరు పని చేస్తారు అని అడిగితే ఎవరూ చేయడం లేదమ్మా, ఎప్పుడూ తాళం వేసే ఉంటది అని చెప్పారు అక్కడి వాళ్ళు. చింతపండు ను అచ్చులు లాగా పోసేందుకు ఉపయోగపడే మరొక మిషన్ కూడా అలాగే నిరుపయోగంగా తుప్పు పట్టి పడి ఉంది ఆ ఊరిలో.మంచి మిషన్‌లు ఉన్నాయి లోపల. ఎందుకని వాటిని ఎవరూ వాడడం లేదు, అవి వాడితే తక్కువ టైం లో ఎక్కువ విస్తరాకులు కుట్టొచ్చు కదా అని అడిగితే విస్తరాకులు కుట్టడం అనేది వయసు మీ రిన ముసలి వాళ్ళు చేసే పని. వయసులో ఉన్న ఆ డవాళ్లు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అటవీ ఉ త్పత్తులు సేకరించేందుకు వెళ్తారు. ఈ మిషన్ లు కాళ్లతో తొక్కాలి. అందుకు ఆ ముసలి వాళ్లకి శక్తి సరిపోదు. అందుకే అవి ఎవరూ ఉపయోగించకుండా అలా పడి ఉన్నాయి అన్నారు. ప్రభుత్వ శా ఖలు ప్రజల కోసం ఏదైనా చేసే ముందు ఆ ప్రజలను సంప్రదించి ఎందుకు చేయరా అనిపించేది ఇలాంటివి చూసినప్పుడే..

 

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ లో ఒక చిన్న ఊరు రాంబాబుది. కొండల మీదకి ఎగబాకి పెద్ద పెద్ద కొండ రాళ్ళ కింద వేలాడే తేనె పట్టుల నుండి తేనెను సేకరించుకురావడంలో సిద్ధహస్తుడు. అత్యంత సాహసి. భయమే లేకుండా ఎంత పెద్ద కొండలనైనా ఎక్కి కొండ అంచుల చివరినుండి మొలకి కట్టుకున్న తాడు సహాయంతో వేలాడుతూ తేనెను పట్టుకొచ్చేస్తాడు. ఎన్ని రకాల తేనెలు వుంటాయో, వాటిని ఎలా సేకరిస్తారో ఓపికగా కూర్చుని చెప్పాడుమాకు ఎంతో సేపు. అయితే సేకరించిన తేనెను వారపు సంతలో అతను అమ్మేటప్పుడు అతనికి ఎంత ధర చెల్లిస్తారో తెలిసి ఆశ్చర్యపోయాం మేము. మనం మార్కెట్ లో కొనే ధరలో కనీసం పదవ వంతు కూడా అతనికి దక్కడం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి అంత రిస్క్ తీసుకుని అతను తేనె సేకరిస్తే అదా మీరిచ్చే ప్రతిఫలం అని అతని దగ్గర తేనె తీసుకునే దళారి ని అడిగితే అడవిలో ఊరికే ఉచితంగా దొరికే వాటిని ఏరుకొస్తే అంతకంటే ఎక్కువ ఎందుకమ్మా ఇచ్చేది అనేశాడు ఆయన. ఆ తేనెను సేకరించేందుకు రాంబాబు పెట్టిన సమయం, పడిన శ్రమ, తీసుకున్న రిస్క్ దేనికి విలువ లేదా? అనే ఆలోచనతో తిరిగి వస్తుండగా రాంబాబు ఆ రోజు సాయంత్రం తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు మమ్మల్ని.

సాయంత్రం మా పనులు పూర్తయేసరికి కొంచెం చీకటి పడి వర్షం కూడా మొదలయింది. అయినా రాంబాబు కి వస్తామని మాట ఇచ్చాం కదా అని అతని ఇంటికి బయలుదేరితే ఊరి చివర ఎక్కడో ఉంది ఇల్లు. పడిన వర్షానికి దారంతా బురద. కరెంటు లేదు వీధిలోనూ, అతని ఇంట్లోనూ. చాలా కష్టపడి చేరుకున్నాం అతని చిన్ని గుడిసెకి.ఆ ఇల్లు, అతని కుటుంబం నివసిస్తున్న ఆ వాతావరణం చూస్తే అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఉన్న వారే ఎందుకింత నిరుపేదలుగా మిగిలిపోతున్నారు అని దుఃఖం కలిగింది.ఆ రోజు నుండి నాకు తేనె ఎప్పుడూ చేదుగానే అనిపిస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం గిరిజనులకు సంబంధించిన ఒక స్టడీ లో భాగంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అడ్డతీగల, దాని చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరగవలసి వచ్చింది. ఆ సందర్భంగా అక్కడ ఒక గిరిజన వైద్యుడిని కలుసుకుని ఆయన ఇంట్లో ఒక రోజు ఉన్నాను. అక్కడి అడవి గురించి, అక్కడ నివాసం ఉండే కొండరెడ్ల గురించి ఎన్నో విషయాలు చెప్పారాయన. ఆ ఏజెన్సీ లో ప్రతి చెట్టు, ఆకు, కొమ్మ, కాండం అన్ని ఆయనకు తెలుసు. దేనిలో ఏ ఔషధ విలువలు ఉన్నాయో ఏ చెట్టు లో ఏ భాగాన్ని ఎటువంటివైద్యానికి వాడాలో ఆయనకు వారసత్వంగా వచ్చిన విద్య. అక్కడి గిరిజనుల జీవితం అడవితో ఎలా పెనవేసుకుని ఉంటుందో ఎంతో చక్కగా వివరించారాయన.

కలపేతర అటవీ ఉత్పత్తులను సమీకరించి వాటిని దగ్గరలో ఉన్న వారపు సంతలో అమ్ముకోవడం, ఉన్న కొద్దిపాటి కొండ పోడు లో వ్యవసాయం చేసుకోవడం అక్కడి గిరిజనుల ప్రధాన జీవనోపాధులు. ఒక ఎకరం కొండ పోడు ఉంటే వరి, కొర్రలు, ఆవాలు, కందులు ఇలాంటివి పదకొండు రకాల పంటలు ఒక ఏడాదిలో పండిస్తారని చెప్పారాయన. ఆ పంటలు, అడవిలో దొరికే పండ్లు, కాయలతో వారికి ఆహార భద్రతకి లోటు ఉండదు అని ఆయన చెబుతుండగానే పెద్ద శబ్దం చేస్తూ రెండు లారీ లు కొండవైపుకి వెళ్లడం చూసాం. వాటి నిండా యేవో మొక్కలు ఉన్నట్లు కనపడి అవి ఏమిటి అని అడిగాను ఆయనను.

కాఫీ మొక్కలు అని చెప్పారాయన. మా గిరిజనులకు వ్యవసాయం చేయడం తెలియక ఎక్కువ లాభాలు పొందలేక పోతున్నామని మా కొండ పోడు లో ఈ కాఫీ మొక్కలు పెడతారట గవర్నమెంట్ వాళ్ళు. వీటితో మాకు లాభాలు బాగా వస్తాయని చెబుతున్నారు అన్నారు ఆయన. మరి మీ ఆహార పంటలు ఏమవుతాయి? అవి లేకపోతే మీరేమి తింటారు అంటే మీ అందరి లాగా మార్కెట్ లో కొనుక్కోవాలి ఇక అన్నారు ఆయన నిట్టూరుస్తూ.

ఆహార భద్రత ప్రధానంగా జీవించే స్వయంసంవృద్ధ జీవన విధానంలోకి వాణిజ్య పంటలను చొప్పించడం ఎంత వరకు సమంజసం అనుకుంటూ తిరిగి వచ్చాను ఆ ఊరినుండి నేను. వారి జీవన విధానం లో అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం వారికి డబ్బు సంపాదించాలనే యావ లేదు. ఆధునిక సౌకర్యాల పైన మోజు లేదు. తినడానికి కావలసినంత కష్టపడటం, తర్వాతంతా కావలసినంత తీరిక.వీళ్ళు సోమరిపోతులండి, ఏదో అడవి నుండి నాలుగు ఆకులు, గింజలు ఏరుకుని అమ్ముకోవడం, కావలసింది కొనుక్కుని తినడం, ఇంతకన్నా వీళ్ళకి వేరే ధ్యాస లేదు, పైకి రావాలనే ఆలోచన లేదు, వీళ్ళు ఇంతే ఎప్పటికి ఎదగరు అన్నాడు ఒకాయన వాళ్ళవంక జాలిగా చూస్తూ. అది సోమరితనమో, సంతృప్తితో కూడిన జీవితమో మనకి అర్ధం కాదేమో అనుకున్నాను నేను ఆయన వంక జాలిగా చూస్తూ.

Some Memories from a Feel Workers Diary