Home తాజా వార్తలు ఏది మంచి రాబడినిస్తుంది?

ఏది మంచి రాబడినిస్తుంది?

bs

సంపద సృష్టికి కొన్ని ఉత్తమ పెట్టుబడి సాధనాలు

ప్రతి మనిషికి డబ్బు అవసరం. దీని కోసమే ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉంటారు. అయితే సంపాధించిన దాన్ని సరైన సాధనాల్లో పెట్టుబడి పెడితేనే అది మరింత రాబడిని ఇస్తుంది. సంపదను సృష్టించాలంటే సరైన ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు సరైన సమయంలో సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోనట్లయితే మంచి రాబడిని పొందే అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ప్రతి పెట్టుబడి గ్యారెంటీగా రాబడిని ఇస్తుందని చెప్పలేం. అయితే మీరు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మరింత సంపదను సృష్టించుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. మీరు సురక్షితమైన పెట్టుబడి విధానాల కోసం చూస్తున్నారా? 2018లో ఉత్తమ పెట్టుబడి సాధనాలేమిటో తెలుసుకుందాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)

పిపిఎఫ్ అత్యంత ప్రజాధరణ పొందిన పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఇది మీ డబ్బును సురక్షితంగా ఉంచడంతో పాటు గ్యారెంటీ రాబడిని ఇస్తుంది. అది కూడా పూర్తి పన్ను మినహాయింపుతో రాబడిని పొందవచ్చు. దీని కోసం ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500, గరిష్ఠంగా రూ.1,50,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. 3 6 సంవత్సరాల మధ్య కాలంలో మీరు రుణాలను పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లతో పోలిస్తే పిపిఎఫ్ ఖాతాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వార్షికంగా 8 శాతం వడ్డీ రేటు.. కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అన్ని పిపిఎఫ్ ఖాతాల నిర్వహణ ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్
పెట్టుబడులకు మరో మంచి సాధనం మ్యూచువల్ ఫం డ్స్. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. ఈక్విటీ లు, బాండ్‌లు, ఇతర మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇది అందరికి అందుబాటులో ఉండేది. ఇన్వెస్టర్‌గా ఒక స్కీమ్‌లో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫండ్స్ ఎన్‌ఎవి(నెట్ అస్సెట్ వాల్యూ) ఆధారంగా ఈ యూనిట్లు ఉంటాయి. వీటికి కాల వ్యవధి అంటూ ఉండదు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్‌కు మాత్రమే లాక్ ఇన్ పిరియడ్ వర్తిస్తుంది.
రియల్ ఎస్టేట్
భూమిలో పెట్టుబడి ఇప్పుడు మరో మంచి సాధనం. అయితే ఇది జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాల్సినది. భూమిని కొనుగోలు చేయడం, అమ్మడం ద్వారా ఈ కాలంలో మంచి రాబడిని పొందుతున్నారు. తక్కువ సమయంలో మీ పెట్టుబడి విలువ బాగా పెరిగే అవకాశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అయితే మీరు భూమి కొనుగోలు చేసేటప్పుడు అనేక అంశాలు పరిశీలించాల్సి ఉంది.
ఈక్విటీ షేర్లు
ఈక్విటీ షేర్లు మరో పెట్టుబడి సాధనంగా చెప్పవచ్చు. షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఓటింగ్ హక్కులు, ఆస్తులపై ఇన్వెస్టర్లకు క్లెయిమ్స్ పొందుతారు. ముఖ విలువ, ఇష్యూ ధర, మార్కెట్ విలువ వంటివి ఈక్విటీల్లో షేర్లలో చూస్తారు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు అత్యధిక రాబడిని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ పెట్టుబడి ఒక్కోసారి రెండింతలు, మూడింతలు అవుతుంది కూడా.. అదే సమయంలో వీటిలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పోస్టాఫీస్ పథకాలు
స్వల్పకాల లాకింగ్ పిరియడ్‌తో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారికి.. పోస్ట్ ఆఫీస్ పథకాలు ఉత్తమమైనవి. మంత్లి ఇన్‌కమ్ స్కీమ్ ఎంతో సురక్షితమైన విధానం, దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు.. అలాగే అధిక రాబడిని ఇస్తుంది. వార్షికంగా 8.5 శాతం వడ్డీ రేటుతో ఇది నెలవారీ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌ను అందిస్తుంది.
యులిప్
ఈక్విటీలు, బాండ్లలో పెట్టుబడులు పెట్టే సౌకర్యాన్ని యులిప్ కల్గిస్తుంది. ఇందులో కొంత స్టాక్స్, బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్.. మిగతా జీవిత బీమా కవరేజ్ రెండు సమ్మిళితమైన ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లాగే ఈ పెట్టుబడులు ఉంటాయి. అయితే డెబిట్ ఇన్వెస్ట్‌మెంట్ల కంటే ఈక్విటీ పెట్టుబడుల్లో అత్యధిక రిస్క్ ఉంటుంది.
ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)
కొత్తగా కంపెనీలను ప్రారంభించేందుకు ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తారు. అంటే కంపెనీలను స్థాపించేందుకు మొదటి సారిగా షేర్ల విక్రయం ఐపిఒ ద్వారా చేపడతారు. స్టాక్ ఎక్సేంజ్‌లలో లిస్టింగ్ చేయడానికి ముందు ఐపిఒ ద్వారా కంపెనీలు నిధులను సమీకరిస్తాయి. తక్కువ రేటుతో కొనుగోలు చేసిన ఐపిఒ.. ఆ తర్వాత స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అయితే రేటు గణనీయంగా పెరిగే అవకాశముంది. దీంతో మంచి రాబడిని పొందవచ్చు.

గోల్డ్ ఇటిఎఫ్

గోల్డ్ ఇటిఎఫ్ గొప్ప పారదర్శకతను పాటిస్తోంది. మొదటిసారి ఇన్వెస్ట్ చేసేవారికి, చిన్న ఇన్వెస్టర్లకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇతర సంప్రదాయ విధానాల కంటే ఇటిఎఫ్‌లు మెరుగైనవిగా పరిగణిస్తారు. దీనికి కారణాలు చూద్దాం.
* కల్తీ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
* ఎలక్ట్రానిక్ విధానంలో నిర్వహిస్తారు.
* పెట్టుబడి వాస్త సమయం తెలుసుకోవచ్చు
* ఇందులో ద్రవ్యలభ్యత బాగుంటుంది.