Home నిజామాబాద్ లక్కి డ్రాల పేరుతో పేదలకు గాలం

లక్కి డ్రాల పేరుతో పేదలకు గాలం

Some persons Cheating People With Lucky Draw Scheme

నందిపేట: నందిపేట మండల కేంద్రంలో గత ఆరు నెలలుగా ఎంటర్‌ప్రైజెస్‌ల పేరుతో లక్కిడ్రాలు దర్జాగా కొనసాగుతున్నాయి. ఈ తరహా వ్యాపారానికి జిల్లాలో ఎక్కడా అనుమతులు లేకున్నప్పటికీ నందిపేటలో మాత్రం ఎటువంటి జంకూ బొంకూ లేకుండా ఆర్బాటంగా నిర్వహిస్తున్నారు. భారీ బహుమతుల పేరుతో పేద, మద్యతరగతి ప్రజలకు గాలం వేసి ప్రతి నెల లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ వేలల్లో బహుమతులు అందజేస్తూ స్వల్పకాలంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బు ను సంపాదించేందుకు తెరలేపారు. అనుమతులు లేకున్నా అక్రమార్జనకు పాల్పడుతున్న ఈ లక్కీడ్రాల వివరాలు ఇలా ఉన్నాయి.

మండల కేంద్రంలో గత ఆరు నెలల క్రితం ఏర్పడిన నాలుగు ఎంటర్‌ప్రైజెస్ లల్లో లక్కిడ్రా పద్దతిని మొదలెట్టారు. ఒక్కో ఎంటర్‌ప్రైజెస్‌లో కొంతమంది భాగస్వాములుగా ఏర్పడి ఈ దందాను మొదలెట్టారు. ఒక్కో గ్రూపులో వెయ్యి మందిని సభ్యులుగా చేర్చి ప్రతీ నెల 1100 రూపాయల చొప్పున చెల్లింపులు చేయాలి. ఇలా 15 నెలల పాటు ఈ స్కీం కొనసాగుతుంది. ప్రతి నెల ఒక మోటారు బైక్, ఒక ఎల్‌ఇడి టివి, వాషింగ్ మెషీన్ అందజేస్తామని ప్రజలను మభ్యపెట్టారు. దీంతో పాటు ఈ స్కీం కాలపరిమితిలో రెండు సార్లు నిర్వహించే బంపర్ డ్రాలో 2కార్లు గెలుచుకోవచ్చని ప్రకటించడంతో చాలా మంది ప్రజలు ఈ డ్రా వైపు ఆకర్షితులయ్యారు. ఇలా నాలుగు ఎంటర్‌ప్రైజెస్‌లలో వెయ్యి మంది చొప్పున సభ్యులను చేర్చి వారివద్ద నుండి ప్రతీ నెలా 11లక్షల రూపాయలు వసూలు చేస్తూ కేవలం లక్ష రూపాయల బహుమతులు మాత్రం అందజేస్తున్నారు. ఈ స్కీంల నిర్వహణకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేకపోగా అప్పనంగా సభ్యులనుండి వస్తున్న మిగతా 10 లక్షల రూపాయలను ఇతర వ్యాపారాలు, భూముల కొనుగోలుకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రజల సొమ్ముతో వ్యాపారాలు చేస్తూ దర్జా చేస్తున్న నిర్వాహకులు స్కీం చివరి వరకు కొనసాగిస్తారా లేక ఇతర వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఈ స్కీం సభ్యులకు మొండి చెయ్యి చూపుతారా అనేది అంతుచిక్కని ప్రశ్న. దీనికి తోడు బాగస్వాముల మద్య ఎటువంటి విభేదాలు పొడచూపినా స్కీంకు మద్యలో బ్రేక్ పడితే పరిస్థితి ఏంటి?ఒకవేళ ఇదే జరిగితే సభ్యుల నుండి తీసుకున్న సొమ్మును తిరగి రాబట్టేది ఎట్లా. దానికి బాద్యులు ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.

ఎక్కడా అనుమతులు లేకున్నా:…… ఈ తరహా దందాలకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అనుమతులు లేవు. ఒకవేళ ఉన్నా సభ్యులకు బైలా ప్రకారం పూచీకత్తు ఇస్తేనే అనుమతులు వస్తాయి. గత మూడు నెలల క్రితం బాన్స్‌వాడ డివిజన్‌లో ఇదే తరహా స్కీంలు ప్రారంభించగానే అక్కడి పోలీసులు వాటిని నిలిపివేయించారు. ఆర్మూర్ పట్టణంలో సైతం కొందరు ఈ వ్యాపారం చేయడానికి అనుమతులు కోరితే పోలీసులు నిరాకరించారు. కానీ నందిపేట మండల కేంద్రంలో మాత్రం ఎటువంటి అనుమతులు లేకున్నా దర్జాగా దందా చేస్తున్నా పట్టించున్నవారే కరువయ్యారు.

బహిరంగంగానే ఈ తరహా లక్కి డ్రాలు జరుగుతున్నా పోలీసులు ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకపోవడం ఒకవిధంగా వారిని ప్రోత్సహించినట్టేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కళ్ళముందే అన్ని హంగులతో ఎంటర్‌ప్రైజెస్‌లు ఏర్పాటు చేసి దానిచాటున దర్జాగా లక్కిడ్రాలు నిర్వహిస్తున్నా పిర్యాదు వస్తే తప్ప చర్యలు తీసుకోలేమనే తీరును చూస్తే చేతులు కాలాకే ఆకులు పట్టుకుంటాం అన్న చందంగా ఉంది. ఇకనైనా అదికారులు కల్పించుకుని లక్కి డ్రాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుని ప్రజల డుబ్బుకు రక్షణ కల్పించాలని స్కీంలోని పలువురు సభ్యులు కోరుతున్నారు.