Home దునియా అల్లుడచ్చిండు

అల్లుడచ్చిండు

Taatalu

ఇగ దొరింటికి అల్లుడచ్చిడంటె పాలేర్లు ఉరికచ్చెటోల్లు. అల్లునికేం గావన్నో అడిగెటోల్లు. చిందొర్సానికేం గావన్నో అడిగెటోల్లు. అల్లుడు దొర పడుకకుర్సీల కూసుంటె కాల్లు పిసికెటోల్లు. 

అల్లుడచ్చిండు. దొరింటికి అల్లుడచ్చిండు. మనసోంటి మామూలోల్ల ఇండ్లల్లకు అల్లుడత్తనే గదెంతో సంబురం. గప్పుడయినా, గిప్పుడయినా గంతే. గా ఎనుకటి కాలం ఇంకొంచెమెక్వ ఉండె. ఎనుకటంటె నూరేండ్లో, ఇన్నూరేండ్ల కిందనో కాదు. నా సిన్నతనంల. గప్పుడు సిన్నప్పుడే లగ్గాలయ్యెటియి గద! గటలనే మా ఊరి సర్పంచ్ బిడ్డ లగ్గం గూడ సిన్నప్పుడే అయింది. నేను గప్పుడు మూడో నాలుగో సదువుతన్న. నాకు సరుపంచి కొడుకు సోపతిగాడు గద.

నేనూకూకె ఆల్లింటికి పొయ్యెటోన్ని. గాల్లింట్ల కందీలుండె. గా కందీల ఎలుక్కు నేను సదువుకునెటోన్ని. మా ఇంట్ల సిన్న ఎక్క దీపమాయె. గాంచునూనెతోని మండే గా ఎక్వదీపంల కెల్లి పొగచ్చేది. గా పొగ దిగుట్లకెల్లి ముద్దలు ముద్దలుగా రాలేటిది. బట్టలమీద పడేది. మరి గా కందీల ఎలుగుకయితె కొంచెం మంచిగ కనవడ్తది గద! మల్ల గా మసి రాలకపోవు. మరి సదువుకున్నోల్లింట్ల గసోంటి కందీలన్న ఉండద్దా అని అంటరేమొ. మీరంటరు నాకెరికే. కని గప్పుడు కందీలు కొనుక్కునే ఐషత్ మా అసోంటోల్ల కేడ ఉండేది. అస్సలే ఉండకపోవు. దొరల, కర్నాలు, రెడ్లు గసోంటోల్ల కొంచెం మంది ఇండ్లల్లనే ఉండేటియి. నేను మా ఇంట్ల కందీల లేదని గాల్లింటికి పోయెటోన్ని గాదు.

గా కర్నప్పంతులు కొడుకే తనతోని కూసుండి సదువుకుందామని తీస్కపోయెటోడు. నేం బోకుంటే మా ఇంటికచ్చి గుంజుకపోయెటోడు. గట్ల గాల్లింటికి పొయ్యెటోన్ని. మా సోపతిగానక్క మా కప్పుడప్పుడు సదువుజెప్పేది. ఏవన్న తప్పులువోతె సెప్పేది. గామెకు లగ్గమైందిగని ఎక్వదినాలు అవ్వగారింటి కాన్నే ఉండేది. ఎందుకంటె సిన్నప్పుడే లగ్గమాయె. ఇగ గామె కోసురం అల్లుడచ్చెటోడు. ఎవ్వలయిన అత్తగారింటికి అల్లుడత్తడు. మల్ల ఆల్లు కర్నపోల్లయిరి. ఊరి సర్పంచాయె. ఇంత బూమి జాగుండె. పలుకుబడుండె. ఇగ గసోంటి ఇంటికి అల్లుడచ్చిండంటె ఇగెంత జోరుదారుగుంటది. ఎంత హడావుడుంటది.

మాసెల్లెగ్గూడ సిన్నప్పుడే లగ్గమైంది. మా ఇంటికి మా బావత్తె ఒగ సంబురం గాదు. ఇగ మా నాయిన్నయితె కల్లు దెప్పిచ్చెటోడు. కోన్ని దొరుకట్టి కోపిచ్చెటోడు. గుడాలేపిచ్చెటోడు. ఇగ పొద్దుగూకి కమ్మి ఉంచిన కోడయితె గాసంగతేవెరుగని యాల్లగాని యాల్లత్తె ఇడ్సిపెట్టిన కోన్ని దొరుకవట్టన్నంటె మస్తు తకిలీఫయ్యేది. గా కోడి ఇల్లెక్కేది. పందిరెక్కేది. గోడెక్కేది. అటు దునికేది. ఇటు దునికేది. గదాన్ని దొరుకవట్టన్నంటె ఇద్దరు ముగ్గురు దానెంట ఉర్కుడే ఉర్కుడు. గప్పుడుంటేటియి ఊరకోల్లు గద. తిరిగి పురుగు, బుసి, ఎండుగలు పోసిన వడ్లు మక్కలు బుక్కి బలంగుండేటియి.

గిప్పటి పౌల్ట్రి కోళ్ళ లెక్క ముద్దపప్పోలె ఉండకపోవు. కోడికూర, పచ్చిసాపలు, కల్లు, గుడాలు గిట్ల విందులయ్యేటియి. గిది గావన్నని మా బావ ఎప్పుడడుగపోవుగని ఇంటికచ్చిన సుట్టాన్ని, అందుల అల్లున్నిమంచిగరుసుకోకుంటేమన్నట్టు. మంచి గరుసుకునేటోల్లు. కొందరల్లుండ్లయితె జెబర్దస్తి జేస్తరు. అల్లునితనం జూపెడ్తరు. ఇగ పనిపాటలోల్ల ఇండ్లల్లనే అల్లుడత్తె గింత హడావిడి ఉంటదంటె ఊరి సర్పంచి, దొర, కర్నంకులపయినె ఇంటికత్తె ఎట్లుండాలె? గా ఇంటల్లుడు మంచోడు ముత్తెమంత గూడ గరువం లేనోడు. అందరితోని మంచిగ మాట్లాడ్తడు. సదువుకొని గప్పట్లనే పంచాయితిల నౌకరి జేత్తున్నోడు. గయినె మంచోడేకని దొరిల్లు గద! అంతకు దగ్గట్టుగ ఉండాలె గద. గట్లనే జేత్తురు.

ఇగ దొరింటికి అల్లుడచ్చిడంటె పాలేర్లు ఉరికచ్చెటోల్లు. అల్లునికేం గావన్నో అడిగెటోల్లు. చిందొర్సానికేం గావన్నో అడిగెటోల్లు. అల్లుడు దొర పడుకకుర్సీల కూసుంటె కాల్లు పిసికెటోల్లు. పెయ్యినొప్పులుండకుంట సేతులతోని ఒత్తెటోల్లు. పెయ్యికి నూనెరాసి తీడెటోల్లు. మంగలయినచ్చి సవురం జేసెటోడు. సక్కగ పెంటరగొట్టెటోడు. గోల్లు తీసెటోడు. చాకలయినచ్చి బట్టలుతికెటోడు. తెనుగోల్లచ్చి ఏ కాలంల పండిన పండ్లు ఆ కాలంలయి తెచ్చిచ్చెటోల్లు. జామపండ్లు, మామిడి పండ్లు, తునికి పండ్లు, దోసకాయలు, పులిచింతకాయలు, రేగువండ్లు ఎవ్వుంటె గవి తెచ్చిచ్చెటోల్లు. గొల్లోల్లు కమ్మలపాలు తెచ్చిచ్చెటోల్లు. సుంకర్లు, చప్రాసులు ఎవ్వలకే పని జెప్పినా సేసుటానికి సిద్ధంగుండెటోల్లు. అల్లుడాయె.

అన్ని మర్యాదలు సెయ్యన్నాయె. ఇంట్లకెల్లి కమ్మటి వాసనతోని కూరలుడికేయి. మస్తు తీపి పదార్థాలు జేసెటోల్లు. తీరొక్కతీరు వంటలు జేసెటోల్లు. ఓ ఇగ గదో వైభోగం గాదు. గీల్లంటె కర్నపుబాపనోల్లు కాబట్టి కల్లు దాగుడు, మాంసం తినుడుండది గద! ఏమైనా గా పప్పు దప్పుడాలు, కూరగాయలు, తీపి పదార్థాలు మస్తు జేసెటోల్లు. ఇల్లంత హడావుడి. గయినె ఎవ్వలను ఇబ్బంది పెట్టద్దని సూసెటోడుగని మరి అత్తగారోల్లెడుకుంటరు. హడావిడి, సందడి. ఇగ దొరల్లు డచ్చిండని సూసి పోవుటానికి ఊరోల్లు వచ్చెటోల్లు. దొరల్లుడాయె. అందరి హాజరు పడాన్నాయె. అల్లుని దృష్టిలకంటె దొరకండ్లకు కనవడుడే ముఖ్యం. ఇగ సాకలయినె రుద్దుకుంట తానం జేపిచ్చేటోడు. పెయ్యంత పిండి రాసుకుంట రుద్దేటోడు. పెద్ద గంగాళంల గోరెచ్చటి నీల్లతోని తానం జేపిచ్చెటోల్లు.

ఇగ బువ్వ తింటాంటె కొసరి కొసరి వడ్డించుడు. తీరొక్క కూరలు వెట్టుడు. స్వీట్లు పెడ్దురు. వద్ద వద్దనంగ తినిపిత్తురు. బేక్‌మని బేవ్ తీసెదాక తినిపిచ్చుడేనాయె. కొందరయితె భూమి పట్టుకొని లేత్తురు. గీల్లింట్ల మాంసం తినరుగని రెడ్లు, వెలుమలు, కాపోల్లు ఇంకే కులపోల్లయిన మస్తు కల్లు, మాంసంతోని విందులు జేసుకుందురు. గిట్టుండేది అల్లుడత్తె. గీ అల్లుడత్తె ఊరోల్లకు గూడ పండుగన్నట్టే. పనిపాటలోల్లు మస్తు తినిపోదురు. గాల్ల సింత కాయతొక్కు మస్తుగుండేది. కూరలు కమ్మగుండేయి. గన్ని కూరలతోని తింటరా అనిపిచ్చేది. మా ఇంట్ల పప్పయితె దాంతోని చారు లేకుంటే ఏదో ఒకటి. కూరగాయలయితె ఏదన్కొకటి. నీచు కూరలయితె ఏదో ఓటి కని గిన్ని కూరలండకపోవు. గట్ల తింటె మంచిగుండనిపిచ్చేది.

ఇగ గా దొరింటి అల్లుడు తిన్నంక కొద్దిసేపు పండుకొని ఇగ చేండ్ల దిక్కు, పొలాల దిక్కు సల్లగాలికోసం పోయెటోడు. గయినెతోని నా సోపతిగాడు, నేంగూడ పోయెటోల్లం. గక్కడ మోటబాయిల గడ్డల మీద కూసుంటె ఇగ పాలేర్లు పచ్చిమక్కకంకులు ఇరుసుకచ్చి బూరుతోనే కాల్చెటోల్లు. పచ్చిపల్లికాయుంటె పీక్కచ్చి చెట్టుకు చెట్టే కాల్చెటోల్లు. గవ్వి కమ్మగ తినెటోల్లం. గిట్ల గా ఇంటల్లుడు ఊకూకె వత్తె మంచిగుండనిపిచ్చు. కని అల్లుడాయె. ఊకెందుకత్తడు. ఊకూకె ఉరికత్తె ఇలువవోతది గద! అల్లుడంటె అల్లుని లెక్కనే ఉండాలె. ఎప్పుడన్నోపారి రావాలె. చెడి చెల్లెలింటికి అలిగి అత్తగారింటికి పోవద్దన్నరు కని మామూలుగ పోవద్దని ఎవ్వలన్లేదు గద.

గయినెను మస్తుపావురంగ కొడుక్కంటెక్వ సూసుకుందురు. అల్లుని మంచితనంబును అనే పద్యం గయినెకు సరైంది కాదు. ఇగ గయినె ఊళ్ళెకచ్చినప్పుడు, ముఖ్యెంగ దీపావళి పండుగప్పుడు వస్తె పండుగనాడందరు ఆల్లింటి ముందల్నే ఉందురు. రోజంత గాదనుకోండ్రి. గని పొద్దు గూకిందంటె గక్కడికి సేరుకునేటోల్లు. ఎందుకంటె గప్పుడు ఊళ్లే పటాకులు బాగ గాల్చెటోల్లు గాల్లే. ఇంకో ఇద్దరు ముగ్గురు మా కాల్చెటోల్లు గని గా ఇంట్లనయితే జెబర్దస్త్‌గ గాల్చెటోల్లు. ఇగ మా అసొంటోల్లయితె తుపాకి మందుయి, పిస్తోల్ల ఏగేదివెట్టి కాల్చెటోల్లం. పోరగాండ్లందరికి గివ్వే ఎక్కవ.

ఆల్లింట్ల కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, షేపిపటాకులు, ఉల్లిగడ్డ బాంబులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు గిట్ల తీరొక్క తీరుయి గాల్చెటోల్లు. అందరం సూసెటోల్లం. గివ్వన్ని ఒక్కెత్తయితె గా పంతులల్లుడు ఓ గుమ్మి తయారు జేసెటోడు. గదే చత్తిరోలె ఉండే. గదాని నిండ పొగనింపేటోడు. గట్ల గా పొగగాలితోని ఒత్తుటంఅయ్యేది. గదాన్నిడిసిపెడితె ఆకాశంల పొయ్యేటిది. గది సూత్తాంటె మస్తు సంబురం. దానెంబడి కింద కొంచెం దూరం ఉరికెటోల్లం. అటెనుక గది ఎక్కన్నో ఉరవతల పడేది. అబ్బ పంతులల్లుడు ఎంత తెలివికల్లోడు అనుకునెటోల్లం. గా గుమ్ముటం లేపుడు గురించి ఎప్పుడు మాట్లాడుకునెటోల్లం. మల్ల యాడాది కొరకెదిరి సూసెటోల్లం. శనార్తులు.

-డా ॥కాలువ మల్లయ్య, 98493 77578