Home తాజా వార్తలు తల్లిని గెంటేసిన కొడుకు, కోడలికి రెండేళ్ల జైలు…

తల్లిని గెంటేసిన కొడుకు, కోడలికి రెండేళ్ల జైలు…

Mother

 

ఇంటిని సొంతం చేసుకునేందుకు కుట్ర
ఇంట్లో నుంచి వెళ్లగొట్టి తాళం వేసుకున్నారు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హైదరాబాద్ : ఇంట్లో నుంచి తల్లిని గెంటివేసి ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన కుమారుడు ,కోడలికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ మల్కాజ్‌గిరి కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నేరెడ్‌మెట్‌కు చెందిన జిఈ ప్రేమకుమారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. అందరికీ వివాహాలు జరగడంతో వేరుగా ఉంటున్నారు. ప్రేమకుమారి తన భర్తతో కలిసి ఇంటిలో ఉంటోంది. అక్టోబర్,23, 2013లో తన భర్త మరణించడంతో ఒక్కతే ఇంటిలో ఉంటోంది.

ఈ క్రమంలోనే తన అనుమతి లేకుండా పెద్ద కుమారుడు జిఏ అమిత్ కుమార్, కోడలు శోబితాలావణ్య ఇంట్లోకి వచ్చి ఉంటున్నారు. ఫిబ్రవరి,2015వరకు అందరూ కలిసి ఉన్నారు. కాగా ప్రేమకుమారిని ఇంట్లో నుంచి బయటికి పంపించి ఆమె భర్తపేరు మీద ఉన్న ఇంటిని తమ పేరుమీద మార్చుకోవాలని అమిత్,లావణ్య కుట్రపన్నారు. అప్పటి నుంచి ప్రేమకుమారిని భూతులు తిట్టడం ప్రారంభించారు. ఇంటిని వదిలి వెళ్లాలని లేకుంటే చంపివేస్తామని బెదిరించి ఇంట్లో నుంచి వెళ్లగొట్టి తాళం వేశారు.

దీంతో ప్రేమకుమారి నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై జేమ్స్ బాబు సాక్షాలు సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్షాలు పరిశీలించిన కోర్టు నిందితులు ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితులకు శిక్ష పడేవిధంగా చూసిన ఎస్సై జేమ్స్‌బాబు, సిడిఓ, ఎపిపి నవీన్‌కుమార్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.

Son sentenced to two years in Jail for defrauding Mother