Home తాజా వార్తలు కన్న తల్లులను కడతేర్చిన కొడుకులు

కన్న తల్లులను కడతేర్చిన కొడుకులు

Son who Murdered his Mother in Nagar kurnool

 

మద్యానికి డబ్బులివ్వట్లేదని
నాగర్‌కర్నూలు జిల్లా సింగోటంలో కొడవలితో నరికి
తల్లి తల తీస్కొని పరారీ

భార్య కాపురానికి రాకపోవడానికి అమ్మే కారణమని
వనపర్తి జిల్లా శాఖాపూర్‌లో గొంతు నులిమి దారుణం

మనతెలంగాణ/హైదరాబాద్‌ : దైవంలా పూజించాల్సిన తల్లిని దారుణంగా హతమార్చిన ఘటనలు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యానికి బానిసైన ఓ కొడుకు తల్లిని విచక్షణారహితంగా కొడవలితో తల నరికి హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ మండలం సింగోటంలో చోటు చేసుకుంది. అలాగే కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో తల్లే కారణంగా భావించి కన్నతల్లిని దారుణంగా గొంతు పిసికి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన రాముడు తల్లి చంద్రమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈక్రమంలో మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని రోజూ తల్లితో గొడవ పెట్టుకునేవాడు.

శుక్రవారం రాత్రి కూడా తల్లిని డబ్బుల కోసం వేధించిన రాముడు తల్లి తనకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతోఆమె నిద్రపోతున్న సమయంలో కొడవలితో తల నరికాడు. తర్వాత తల్లి తల తీసుకుని రాముడు పరారయ్యాడు. ప్రస్తుతం అతని కోసం కొల్లాపూర్ పోలీసులు గాలిస్తున్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్‌లో గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెందిన పద్మతో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. తరచూ గొడవ పడటం వల్ల వారం రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 21న శ్రీనివాసులు అత్తగారింటికి వెళ్లి పద్మను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో తిరిగి ఇంటికి వచ్చిన శ్రీనివాసులు భార్య కాపురానికి రాకపోవడానికి తన తల్లి సాయ(70) కారణమని భావించాడు. దీంతో శుక్రవారం అర్థరాత్రి శ్రీనివాసులు తన తల్లి సాయ గొంతు నులిమి హతమార్చాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు.