Home ఎడిటోరియల్ మళ్ళీ సోనియా!

మళ్ళీ సోనియా!

Sampadakiyam      తాళుము తృంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే’ అని పుష్ప విలాప కావ్య కర్త అనిపించినట్టు 19 ఏళ్ల పాటు తనను సాకి పెంచి వరుసగా రెండు సార్లు దేశాధికార పీఠమ్మీద కూచోబెట్టిన తన తల్లి సోనియా గాంధీ ఒడి వీడనంటోంది కాంగ్రెస్ పార్టీ. దానిని ఎవరెన్ని విధాలుగా వేలెత్తి చూపించినా, వారసత్వ రాజకీయ పార్టీ అని నిందించినా, నామ్‌ధారి పక్షమని ఎద్దేవా చేసినా అవి ఆ పార్టీ శ్రేణుల వైఖరిలో కించిత్తు మార్పు తేలేకపోయాయి. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు తప్ప గాంధీయేతర కుటుంబాలకు చెందిన వారెవ్వరినీ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టడానికి అవి అంగీకరించడం లేదు, అనుమతించడం లేదు. పర్యవసానంగా తిరిగి తానే ఆరు మాసాల పాటు తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉండాలని పార్టీ కోరడం అందుకు సోనియా గాంధీ అంగీకరించడం జరిగిపోయాయి.

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా చవిచూసిన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మే 25న రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎవరెంత ఒత్తిడి తెచ్చినా తిరిగి బాధ్యతలు చేపట్టడానికి ససేమిరా అన్నారు. ఆ నేపథ్యంలో ఇందిరా గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి చెందని వారిని అధ్యక్ష స్థానంలో కూచోబెట్టాలనే ప్రయత్నం చెప్పుకోదగినంతగానే జరిగింది. అశోక్ గెహ్లాట్, మోతీలాల్ వోరా, సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్, ముకుల్ వాస్నిక్ వంటి పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపించి వినమరుగయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సోనాభద్రలో చిన్న భూవివాదంలో గ్రామ పెద్దకు చెందిన మనుషులు గోండు జాతికి చెందిన 10 మంది ఆదివాసీలను కాల్చి చంపిన ఘోర దుర్ఘటనకు క్షణం ఆలస్యం చేయకుండా స్పందించి ప్రియాంక గాంధీ ఆ ఊరిని సందర్శించడంతో పార్టీ పగ్గాలను ఆమె తీసుకోడం ఖాయమనే ఊహాగానాలూ బయల్దేరాయి.

అదీ జరగలేదు. చివరికి భూమి గుండ్రంగా ఉన్న రీతిలో బంతి తిరిగి సోనియా గాంధీ పాదాల వద్దనే ఆగింది. గాంధీ కుటుంబేతరుల చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు వెళ్లిపోయి దీర్ఘకాలం కొనసాగిన సందర్భాలు దాని చరిత్రలో లేకపోలేదు. సీతారాం కేసరి, పివి నరసింహారావు వంటి వారికి ఆ ప్రతేకత దక్కింది. ఆ విధంగా ఇప్పుడు కూడా పార్టీ బాధ్యతలను వేరే వారికి అప్పగించడం అసాధ్యమేమీ కాదు. కాని కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం గాజు పాత్రను తలపిస్తున్నది. తుమ్మితే ఊడే ముక్కు మాదిరిగా ఉన్న ఆ పార్టీ తిరిగి పుంజుకునేలా చేయాలంటే నిరపాయకరమైన వారి చేతుల్లో దానిని ఉంచాలి. అసలే దేశం బలమైన ప్రతిపక్షం లేని దుస్థితిలో ఉన్నది. ప్రజాస్వామ్యానికి అది పెను ముప్పును సూచిస్తున్నది.

వరుసగా రెండోసారి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన స్థితిలోని కాంగ్రెస్ పట్ల బిజెపికి ఎటువంటి బెదురు, భయం లేవు. ఎన్‌డిఎ 2 అధికారం చేపట్టిన తర్వాత రాజ్యసభలోని బలమైన ప్రతిపక్ష ఐక్యతను సైతం నీరుగార్పించి అక్కడ తన బిల్లులను ప్రభుత్వం సునాయాసంగా చట్టాలు చేయించుకోగలుగుతున్నది. అందుచేత సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల నాయకత్వంలోనే తాను ఈ మేరకైనా ఉనికిని కాపాడుకోగలుగుతాననే అభిప్రాయం కాంగ్రెస్‌లో గట్టిగా చోటు చేసుకోనున్నట్టున్నది. కాదు, కూడదు అని పార్టీని బలవంతంగా ఇతరులకు అప్పగిస్తే అది మరింత బలహీనపడి నామ రూపాల్లేకుండా పోడానికే దోహదపడొచ్చు. కాంగ్రెస్ పార్టీని సైద్ధాంతిక నిబద్ధత గల ఏక శిలా సదృశమైన సంస్థగా తీర్చి దిద్దవలసిన ఆవశ్యకత నేడెంతో ఉంది.

కశ్మీర్ బిల్లులపై పార్లమెంటులో ఓటింగ్ సందర్భంలో ఆ పార్టీ కాళ్లు వణికిన దృశ్యాలు కనిపించాయి. దాని నాయకులు కొందరు భారతీయ జనతా పార్టీ ఆలోచనలకు అనుకూలంగా మాట్లాడడం, వ్యవహరించడం దాని మూలాలకు పట్టిన పురుగును రుజువు చేసింది. యుపిఎ వరుస ప్రభుత్వాలు పెట్టుబడిదారీ ఆర్థిక సంస్కరణలను భుజాన వేసుకున్నప్పటికీ సామాన్య జనాన్ని పార్టీకి దూరం కానివ్వకుండా పలు ఆదర్శ పథకాలను సోనియా గాంధీ స్వయంగా చొరవ తీసుకొని ప్రవేశపెట్టించారు. జాతీయ సలహా మండలిని నెలకొల్పి మేధా మథనం చేయించి గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, భూ సేకరణ చట్టాలను ఇతర మానవీయ సంస్కరణలను తీసుకు రావడానికి మూల కారణం సోనియా గాంధీయే. పూర్తిగా ఊబిలో కూరుకుపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి ఉచ్ఛ స్థితికి తేడానికి ఎటువంటి దిశానిర్దేశం జరగాలో నిర్ణయించి ఆ వైపుగా గట్టి మార్పులు తీసుకు రాగల సామర్థం పార్టీ శ్రేణులను నడిపించగల సత్తా ప్రస్తుతానికి ఆమెకే ఉన్నాయి. ఎన్నికల ద్వారా తదుపరి నేతను ఎన్నుకోడం జరిగినంత వరకు సోనియా గాంధీ తాత్కాలిక హోదాలో కొనసాగడమే సబబు.

Sonia Gandhi is back as Congress president