Friday, April 26, 2024

ఎన్నాళ్ల నుంచో ఈ రోజు కోసం ఎదురుచూశా

- Advertisement -
- Advertisement -


న్యూఢిల్లీ: ‘ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నా..’ ఇప్పటికి ఈ సమయం వచ్చింది అని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలో ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. సోమవారం పార్టీ అధ్యక్ష పదవికి పోలింగ్ ప్రక్రియ ఉదయం పది గంటలకు ఆరంభం అయింది. 24 ఏళ్ల తరువాత గాంధీయేతర వ్యక్తులు బరిలోకి దిగి సాగుతోన్న పోరు ఇది. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ ప్రక్రియలో ఇది ఆరవది. 2024లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రాచీన పార్టీకి జాతీయ అధ్యక్షులు ఎవరనేది ఎల్లుండి తేలుతుంది, మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ ఉంది. ఢిల్లీలోని ఎఐపిపి ప్రధాన కార్యాలయం వద్ద ఓటు వేసి వచ్చిన తరువాత సోనియా గాంధీ అక్కడున్న విలేకరులతో మాట్లాడారు. తన స్పందనను తెలియచేశారు. దేశవ్యాప్తంగా 9000 మంది డెలిగేట్లు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో టిక్ పెట్టడం ద్వారా తమ తదుపరి నేతను ఎంచుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఎఐసిసి కార్యాలయం, పిసిసి కార్యాలయాలు, భారత్ జోడో యాత్ర సాగుతోన్న బళ్లారిల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం నాలుగు వరకూ పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియ అంతా సంతృప్తికరంగా సాగిందని పార్టీ ఎన్నికల నిర్వహణాధికారి మదుసూధన్ మిస్త్రీ విలేకరులకు తెలిపారు. పెద్దగా ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, అంతా సజావుగా ఉందని వివరించారు. ఢిల్లీలో సోనియా, ప్రియాంక, మన్మోహన్ సింగ్ ఇతర నేతలు ఓటింగ్‌కు దిగారు. కర్నాటకలో రాహుల్, ఖర్గే ఓటేశారు. థరూర్ తిరువనంతపురంలో పోలింగ్‌లో పాల్గొన్నారు. తనకు థరూర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని ఖర్గే విలేకరులకు తెలిపారు. తమది స్నేహపూరిత పోటీ అని, దేశానికి ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పటిష్టతకు పాటుపడే రీతిలోనే ఈ పోటీ ఉందని ఖర్గే వివరించారు.
గెలుపు నమ్మకం…. నేతలతో విఫలం ః థరూర్
ఆది నుంచి తాను గెలుపుపై పూర్తి నమ్మకంతోనే సాగానని, అయితే రానురానూ ప్రతిబంధకాలు ఎదురయ్యాయని తిరువనంతపురంలో ఓటేసిన తరువాత శశి థరూర్ తెలిపారు. నేతలు , నెలకొని ఉన్న ప్రక్రియ,పార్టీ వ్యవస్థతో ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని వాపొయ్యారు. ప్రముఖ నేతలు అంతా వేరే అభ్యర్థి వైపు నిలిచారని నిస్సహాయత వ్యక్తం చేశారు. తాను తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పోటీకి దిగలేదని, దేశం పటిష్ట కాంగ్రెస్‌ను కోరుకుంటోంది. ఈ క్రమంలోనే పార్టీలో మార్పు కోసం బరిలోకి దిగానని చెప్పారు. మార్పు కోరుకున్నానని, పార్టీ నిర్వహణ సరిగ్గా జరిగేలా చేసే మార్పు ఆశించి దీనికోసం పోటీకి దిగానని తెలిపారు. ఖర్గేతో ఉదయం మాట్లాడానని, శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. వ్యక్తుల విజయం గురించి కాకుండా కాంగ్రెస్‌కు మంచి కోసం ఇద్దరం ఏకాభిప్రాయంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రక్రియ సాగుతోందన్నారు. ఇంతకు ముందు ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు తమ ప్రాధాన్యతను 1 నెంబరుతో చూపేవారు. దీనికి థరూర్ వర్గం అభ్యంతరం తెలిపింది. దీనితో ఓటు తరువాత టిక్ పెట్టే ప్రక్రియను ప్రవేశపెట్టారు.
గాంధీలు లేకుండా సాగేదెలా?.. తెరవెనుక వారే ఉంటారని ముచ్చట్లు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దశలో పలు చోట్ల నేతలు బారులు తీరినప్పుడు మాటామంతీగా ఎక్కువగా ఇప్పటి ఎన్నికల తీరుపై మాట్లాడుకున్నారు. సోనియా రాహుల్, ప్రియాంక గాంధీల పాత్ర గురించే ఎక్కువగా వాదోపవాదాలు సాగాయి. వేరే వ్యక్తి నేతగా వచ్చినా పార్టీలో గాంధీ కుటుంబ సభ్యులను నిర్లక్షం చేయడానికి వీల్లేదని, పార్టీ కార్యకర్తలతో వివిధ స్థాయిలలోని నేతలతో సోనియా, రాహుల్ అనుబంధం ఇక ముందు కూడా ఇప్పటిలాగానే ఉంటుందని, ఉండాలని సీనియర్ నేత అంబికా సోని స్పందించారు. రేపో ఎల్లుండో సోనియా తమ బాధ్యతలనుంచి వైదొలుగుతారు. అయితే దీని అర్థం పార్టీలో ఆమె తమ నేతగా ఉండబోరని అనుకోరాదని, ఈ ప్రక్రియ ఇక ముందు కూడా సాగుతుందని వ్యాఖ్యానించారు. పార్టీలో సోనియా, రాహుల్‌లకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని, వారే మార్గదర్శకులు అని, సమయానికి అనుగుణంగా వారు స్ఫూర్తి అందిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ తెలిపారు. పలు చోట్ల రాహుల్ ఎందుకు పార్టీ పగ్గాలు చేపట్టడం లేదు? సోనియా మాట ఇకపై కూడా చెల్లుతుందా అనే విషయాలను ఆసక్తికరంగా చర్చించుకున్నారు. ఎన్నికల తరువాత కూడా మునుపటిలాగానే గాంధీ కుటుంబం హవా సాగుతుందని, ఆమెనే పార్టీకి ప్రాణంగా నిలుస్తారని రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్ తెలిపారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఇతర పార్టీలకు ఆదర్శం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని, బిజెపికి జెపి నడ్డా తిరిగి అధ్యక్షులు అయ్యారు. ఈ ప్రక్రియ అయినట్లు చివరికి పార్టీలోని పెద్దలలో చాలా మందికి తెలియదు. ఆయనను ఎవరు ఎంపిక చేశారు. ఎవరు కుర్చీలో కూర్చోబెట్టారనేది బ్రహ్మపదార్థం అయింది. రెండు రెండున్నర వ్యక్తులు ఓ ఆర్‌ఎస్‌ఎస్ నియామకానికి దిగింది. ఇక ఆ పార్టీ కాంగ్రెస్ ఎన్నికలపై కామెంట్లకు దిగడం జోకే అవుతుందని వ్యాఖ్యానించారు. చెన్నైలో సత్యమూర్తి భవన్ పోలింగ్ కేంద్రం అయింది. టిఎన్‌సిసి అధ్యక్షులు కెఎస్ అళగిరి తొలుత ఓటర్ల వరుసలో ఉన్నారు. కార్తీ చిదంబరం తాను థరూర్‌కు మద్దతు ఇచ్చినట్లు ఓటేసిన తరువాత తెలిపారు. పార్టీలో నూతనోత్తేజం తీసుకువచ్చే వారికి ఆహ్వానం అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు, కెపిసిసి అధ్యక్షులు కె సుధాకరన్, విడి సతీషన్ , రమేష్ చెన్నితల, కె మురళీధరన్ ఇతరులు తమ ప్రాధాన్యత ఓటు గురించి వివరించారు. ఖర్గేనే సముచిత నేతగా పదవికి అర్హులవుతారని తెలిపారు. వివిధ స్థాయిలలో ఆయనకు థరూర్‌తో పోలిస్తే విశేషానుభవం ఉందన్నారు.
గాంధీ కుటుంబం సలహాలపై సిగ్గెందుకు ః ఖర్గే
పార్టీకి నేతగా ఎన్నికైతే తాను ఇంతకు ముందటి లాగానే గాంధీ కుటుంబం నుంచి సలహాలు తీసుకుంటానని, ఇందుకు సిగ్గుపడే ప్రసక్తే లేదని మల్లిఖార్జున ఖర్గే బెంగళూరులో స్పందించారు. పార్టీ నిర్మాణానికి సవాళ్లను ఎదుర్కోవడానికి వారి సలహాలు తీసుకుంటే తప్పేముంది? అని ప్రశ్నించారు. ముందు ఫలితం వెలువడితే తరువాత అన్ని విషయాలు కాలక్రమంలో మీకె తెలుస్తాయని చమత్కరించారు. కాంగ్రెస్‌లో ఇంతకు ముందు 2000 సంవత్సరంలో అధ్యక్ష స్థానానికి పోటీ జరిగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య పోటీ జరగడం ఇదే తొలిసారి. అప్పటి ఎన్నికలలో సోనియా గాంధీ బరిలో ఉన్న జితేంద్ర ప్రసాదను భారీ ఆధిక్యతతో ఓడించారు. పార్టీకి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా రికార్డు సాధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ గాంధీ కుటుంబమే అత్యధిక కాలం పార్టీ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చింది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడిన కుటుంబ పాలనా పగ్గాలు పార్టీని అనివార్యంగా నడిపిస్తూ వచ్చాయి.

Sonia Gandhi talks with media after casting vote

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News