Home జాతీయ వార్తలు ఇందిరకు నేతల నివాళి

ఇందిరకు నేతల నివాళి

Sonia Gandhi

 

న్యూఢిల్లీ : దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ సంకల్పం, దృఢ నిశ్చయం దేశాన్ని ఉన్నత స్థాయికి నడిపించిందని, దేశ భద్రత, ఆర్థిక, విదేశీ విధానంలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇందిరా గాంధీ 102 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మంగళవారం ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు.

బలమైన సమర్ధ నాయకత్వం, అద్భుతమైన నిర్వహణ నైపుణ్యం, కలిగిన ఉక్కు మహిళ ఇందిర బలమైన దేశంగా భారత్‌ను తీర్చి దిద్దడంలో కీలక పాత్ర వహించారని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, తదితర అగ్రశ్రేణి నాయకులు కాంగ్రెస్ ఎంపిలు, కార్యకర్తలు ఇందిర స్మారక శక్తిస్థలి వద్ద పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్, మిలింద్ డియోరా, కుమారి సెల్జా, తదితరులు ట్విట్టర్ ద్వారా నివాళులు సమర్పించారు.

ఇందిరకు ప్రధాని మోడీ నివాళి : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 102వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీజీకి నివాళులు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1917లో అలహాబాద్‌లో జన్మించిన ఇందిర ప్రధానిగా 1966-77 వరకు, 1980 నుంచి 84 వరకు ప్రధానిగా పరిపాలించారు.

Sonia, Manmohan Singh, Rahul pay tribute to former PM