Wednesday, April 24, 2024

కరోనా భయం.. తల్లిని ఇంట్లోకి రానివ్వని కొడుకులు

- Advertisement -
- Advertisement -

Sons-refuse-mother

కరీంనగర్: తల్లికి కరోనా సోకిందనే అనుమానంతో కొడుకులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో అధికారులు కొడుకులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తల్లిని ఇంట్లోకి చేర్చారు. నగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన కట్ట శ్యామల బంధువులను చూసేందుకు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్లింది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో తిరిగి కరీంనగర్‌కు రాలేక అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో శుక్రవారం ఆమె కరీంనగర్‌కు తిరిగి వచ్చింది.

అయితే ఆమెను కొడుకులు ఇంట్లోకి రానివ్వలేదు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో అక్కడి నుంచే వచ్చిన తల్లికి కరోనా సోకిందన్న అనుమానంతో ఇంట్లోకి రావొద్దని కొడుకులు తేల్చిచెప్పారు. దీంతో ఆ తల్లి ఇంటి ముందు రోదిస్తూ కూర్చుంది. ముగ్గురు కొడుకులు ఇంట్లోకి రావొద్దనడంతో ఏం చేయాలో, ఎక్కడికెళ్లాలో దిక్కుతోచక దిక్కులు చూస్తూ కూర్చొంది.

షోలాపూర్ నుంచి వచ్చేటప్పుడే అక్కడి వైద్యులు కరోనా టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చిందని చెప్తున్నా కొడుకులు మాత్రం వినడం లేదని శ్యామల బోరుమంది. విషయం తెలిసిన కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఎడ్ల సరిత అశోక్‌లు వెంటనే స్పందించి విషయాన్ని పోలీసుల దృష్టికి, నగర పాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు స్పందించి శ్యామల కొడుకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వృద్ధురాలైన ఆ తల్లిని కొడుకుల ఇంటికి చేర్చి ఆమెను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

Sons refuse to Allow 80 year old mother into house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News