Friday, March 29, 2024

కన్నోళ్లే…కానోళ్లు

- Advertisement -
- Advertisement -

నవమాసాలు మోసి కనిపెంచిన వారికి నరకం చూపిస్తున్నారు. పేగు పంచుకున్న వారే పగవాళ్లుగా మారుతున్నారు. మమకారం పంచిన కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగేలా చేస్తున్నారు. పసితనంలో ప్రేమతో గుండెలపై హత్తుకున్న వారి గుండెలు పగిలేలా చేస్తున్నారు. గోరు ముద్దలు తినిపించిన వాళ్లను ఘోరంగా అవమానిస్తున్నారు. జోలపాట పాడిన గొంతుపై కాలుమోపి కాలాంతకులుగా వ్యవహరిస్తున్నారు. ఆభరణాల కోసం అమ్మను ఓ కొడుకు కొట్టగా, మరో కొడుకు ఆస్తుల కోసం ఏకంగా కన్నతండ్రిని అపహరించాడు.

భూమి కోసం కన్న తండ్రి కిడ్నాప్
నగల కోసం కన్నతల్లికి చిత్రహింసలు
మనతెలంగాణ/హైదరాబాద్: కన్నతల్లి వంటిపై నగలు ఇవ్వాలంటూ చితకబాది, గొంతుపై కాలుతో తొక్కి చంపే యత్నం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఎస్‌సి కాలనీ లో చోటు చేసుకుంది. అలాగే ఐదెకరాల ఆస్తి కోసం కన్నతండ్రిని తనయులు కిడ్నాప్ చిత్రహింసలకు గురిచేసిన ఘటన సూర్యాపేటలోని భగత్ సింగ్ నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఎస్‌సి కాలనీ నివాసముంటున్న బొట్ల సమ్మక్క(75)కు ఇద్దరు కుమారులు. ఈక్రమంలో చిన్న కుమారుడు బొట్ల స్వామి వరంగల్ లో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా తల్లి సమ్మక్క గణపురం మండల కేంద్రంలో ఓ రైస్ మిల్ లో కూలి గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

అయితే చిన్నకుమారుడు స్వామి తరచూ తల్లి సమ్మక్క దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ వేధించసాగారు. ఇందులో భాగంగా సమ్మక్కు పలుమార్లు స్పృహతప్పేలా చితకబాదాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున స్వామి తన తల్లి సమ్మక్క వంటిపై ఉన్న బంగారంతో పాటు ఇంట్లో ఉన్న రూ. 12 వేల నగదు లాక్కొని కొట్టాడు. అంతటితో ఆగకుండా తల్లిని ఇంటి బయటికి లాక్కొచ్చి గొంతుపై కాలుతో చంపే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిన్నకుమారుడు స్వామి అక్కడి నుంచి పారిపోయాడు.

తీవ్రగాయాల పాలైన సమ్మక్క పరిస్థితి విషమించడంతో స్థానికులు 108లో ములుగు ఆస్పత్రికి తరలించారు. స్థానికులు జరిగిన విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గాయాలపాలైన సమ్మక్క పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా సూర్యాపేటలోని భగత్ సింగ్ నగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్ ఎంఆర్‌వొ సంజీవరావుకు ఇద్దరు కుమారులు. కాగా సంజీవరావు పేరిట ఉన్న ఐదు ఎకరాల భూమి కోసం గత కొన్నిరోజులుగా తండ్రికి నరకం చూపిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన కుమారులు ఇద్దరూ సంజీవరావుతో గొడవపడ్డారు. ఆస్తి రాసిస్తావా లేందంటే చస్తావా అంటూ సంజీవరావును హింసించారు. వివాదాన్ని అడ్డుకునేందుకు వచ్చిన తల్లిని పక్కకు తోసేశారు. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది. ఎట్టి పరిస్థితుల్లో ఐదెకరాల భూమి ఇవ్వనని, తన తదనంతరం తీసుకోవాలని సంజీవరావు తేల్చిచెప్పడంతో ఇద్దరు కుమారులు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా తండ్రిని వాహనంలో ఎక్కించుకుని అపహరించారు. కళ్ల ఎదుట కట్టుకున్న భర్తను కిడ్నాప్ చేచడంతో హతాశురాలైన సంజీవరావు భార్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలావుండగా ఐదెకరాల భూమి కోసం తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పుల దండ వేశారని సంజీవరావు భార్య పోలీసుల ముందు వాపోయింది. ఆస్తికోసం తన భర్తను అపహరించిన కుమారుల నుంచి తన భర్తను కాపాడాలని ఆమె పోలీసులను వేడుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News