Friday, March 29, 2024

త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

ktr

 

టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం
సహకార ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశాం
డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల సమావేశంలో కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రైతు కావడంతో రాష్ట్రం లో రైతు సంక్షేమపథకాలు అమలుచేస్తూ రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే రైతు రుణమాఫీని త్వరలో ప్రారంభించాలని సిఎం చెప్పారని కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు సిఎం కెసిఆర్ రుణమాఫీని ప్రారంభించేందుకు ధృడసంకల్పంతో ఉన్నారని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం కావడంతో రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయాభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు.

సోమవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్లతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లపై రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతంచేసే బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. సిఎం కెసిఆర్‌కు రైతులంటే ప్రత్యేక ప్రేమ ఉందని, అందుకే రాష్ట్రంలో రైతాంగసంక్షేమంకోసం నిరంతరం తపిస్తారని చెప్పారు. వ్యవసాయరంగం విస్తరణకోసం అధికారులను నియమించిన చరిత్ర టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతందన్నా రు. రైతులను బహుముఖంగా ఆదుకుంటున్నప్రభుత్వం కేవలం టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రతిఎన్నికల్లో తిరుగులేని విజయాలను అందిస్తున్న ప్రజలకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సహకా ర ఎన్నికల్లో గెలిపించి పార్టీ బలాన్ని మరింత బలోపేతం చేశారని చెప్పారు.

గెలిచిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్నికైన మొత్తం మందిలో 48 శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు ప్రాతినిధ్యం లభించిందని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి దళితుడు, మాహబూబ్‌నగర్ నుంచి మైనారిటీ అవకాశం దక్కిందని చెప్పారు. అలాగే అనేక చోట్ల బిసిలకు డిసిసిబి,డిసిఎంఎస్ ఛైర్మన్‌గా వైస్ ఛైర్మన్‌గా అవకాశాలు కల్పించి టిఆర్‌ఎస్ సామాజిక సూత్రా న్ని పాటించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో చట్టంమేరకు ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా సిఎం కెసిఆర్ అన్నివర్గాలకు న్యాయంచేశారని చెప్పారు. అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో అనేక సంక్షేమపథకాలు అమలువుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఉద్ధేశపూర్వకంగా ప్రభుత్వాన్ని మిమర్శిస్తూ అసత్యప్రచారానికి పాల్పడుతుందని కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కెటిఆర్ సహకార సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ఎల్లవేళలా రైతుల మధ్యలో ఉంటూ రైతు సంక్షేమంకోసం సహకారసంఘాల నాయకులు పనిచేయాలని ఆయన ఆదేశించారు. రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు.రైతాంగసమస్యలపైన ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యతను సహకార సంఘాల నేతలు మర్చి పోవద్దన్నారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటూ ఎన్నికలు ఏవైనా ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రతిఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు సంపూర్ణ విజయాన్ని ప్రజలు అందించారని చెప్పారు.

సహకారసంఘాల ఎన్నికల్లో రాష్ట్రంలోని 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికి పైగా సంఘాల్లో రైతులు పూర్తిస్థాయి మెజారిటీతో టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ రాష్ట్రాభివృద్ధికోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ం సొంత నిధులతో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. కేంద్రం నిర్వాకం వల్ల దేశంలో అర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆప్రభావం అధికంగా పడకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, డిసిసిబి ఎన్నికల పరిశీలకులు, టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

Soon the process of farmer loan waiver
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News