Wednesday, April 24, 2024

సౌతాఫ్రికా రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

South Africa

 

సౌతాఫ్రికా రికార్డు విజయం
లీ శతకం, లూస్ ఆల్‌రౌండ్‌షో, షబ్నమ్ మ్యాజిక్, సఫారీ చేతిలో థాయిలాండ్ చిత్తు

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళా జట్టు 113 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. టి20 చరిత్రలోనే రెండో భారీ విజయం సాధించిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును సాధించింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పసికూన థాయిలాండ్‌ను సఫారీ బౌలర్లు 19.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూల్చి జట్టుకు రికార్డు విజయాన్ని అందించారు. సున్ లూస్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టగా, ఓపెనర్ లాజిల్లి లీ శతకంతో చెలరేగింది. ఇక, స్టార్ బౌలర్ షబ్నమ్ ఇస్మాయిల్ 8 పరుగులకే మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన థాయిలాండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు నట్టకాన్ (6), బూచాటమ్ (8) ఆరంభంలోనే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ నన్నాపట్ (౦) ఖాతా తెరవకుండానే ఔటైంది. తర్వాత వచ్చిన నరుమల్ ఛాయ్‌వాయ్ కూడా తాను ఎదుర్కొన్న మొదటి బంతికే వెనుదిరిగింది. ఇస్మాయిల్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి థాయిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. కెప్టెన్ టప్పొచ్ కూడా విఫలమైంది.

ఒక పరుగు మాత్రమే చేసి వికెట్‌ను పారేసుకుంది. ఈ దశలో ఒన్నిచా కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఒన్నిచా మూడు ఫోర్లు, సిక్స్‌తో 26 పరుగులు చేసి లూస్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. మరోవైపు చనిదా (13) పరుగులు చేసింది. మిగతావారు కనీసం డబుల్ డిజిట్ స్కోరును కూడా అందుకోలేక పోయారు. దీంతో థాయిలాండ్‌కు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఘోర పరాజయం తప్పలేదు.

లీ విధ్వంసం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను ఓపెనర్ లాజిల్ల్లి లీ అద్భుత శతకంతో ఆదుకుంది. ఆమెకు వన్‌డౌన్‌లో వచ్చిన లూస్ అండగా నిలిచింది. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. లీ ఆరంభం నుంచే తన మార్క్ షాట్లతో చెలరేగింది. ప్రత్యర్థి బౌలర్లను హడెత్తిస్తూ ముందుకు సాగింది. లీను కట్టడి చేయడం థాయిలాండ్ బౌలర్లకు శక్తికి మించిన పనిగా మారింది. అసాధారణ షాట్లతో అలరించిన లీ పరుగుల వరద పారించింది.

లూస్ కూడా ధాటిగా ఆడుతూ తనవంతు పాత్ర పోషించింది. చెలరేగి ఆడిన లీ 60 బంతుల్లోనే 16 ఫోర్లు, మూడు సిక్సర్లతో 101 పరుగులు సాధించింది. ఈ క్రమంలో లూస్‌తో కలిసి రెండో వికెట్‌కు 131 పరుగులు జోడించింది. మరోవైపు లూస్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికాకు అండగా నిలిచింది. ధాటిగా ఆడిన లూస్ రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 61 పరుగులు సాధించి అజేయంగా నిలిచింది. ఇక, ట్రియాన్ (24) కూడా ధాటిగా ఆడడంతో సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది.

South Africa record win
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News