Home తాజా వార్తలు అందని ద్రాక్షే!

అందని ద్రాక్షే!

 

సఫారీకి దక్కని ట్రోఫీ
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న దక్షిణాఫ్రికా ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లకు వచ్చే సరికి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరచడం అలవాటుగా మార్చుకుంది. వన్డే, టెస్టుల్లో దక్షిణాఫ్రికా ఎదురులేని శక్తిగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఆస్ట్రేలియా తర్వాత అంతటి బలమైన జట్టుగా సఫారీలకు పేరుంది. స్వదేశి, విదేశి సిరీస్‌లు అనే తేడా లేకుండా వరుస విజయాలు సాధించడం దక్షిణాఫ్రికాకు అలవాటు. అయితే పెద్ద టోర్నమెంట్‌లకు వచ్చే సరికి అనామక జట్టుగా మారిపోవడం సఫారీలకు పరిపాటిగా మారింది. 1992 నుంచి ప్రపంచకప్ ఆడుతున్నా ఒక్కసారి కూడా సౌతాఫ్రికా సెమీఫైనల్ దశ దాటి ముందుకు వెళ్లలేక పోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్‌కు చేరినా ఫైనల్‌కు మాత్రం అర్హత సాధించలేక పోయింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా దక్షిణాఫ్రికాకు పేరుంది. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా సఫారీలకు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా ఎదురులేని శక్తిగా కొనసాగుతోంది. అరివీర భయంకర ఆటగాడిగా పేరున్న డివిలియర్స్ జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టడంలో డివిలియర్స్, క్రానె, కిర్‌స్టెన్, కలిస్, గిబ్స్, ఎన్తిని, ఆమ్లా తదితరులు విఫలమయ్యారని చెప్పాలి. వ్యక్తిగతంగా చూస్తే ఈ ఆటగాళ్లు అపార ప్రతిభావంతులని చెప్పాలి. కానీ, జట్టుకు ఒక్కసారి కూడా ట్రోఫీని అందించక పోవడం నిజయంగానే దురదృష్టంగా చెప్పాలి.
ఈసారైనా..
గతంతో పోల్చితే ఈసారి దక్షిణాఫ్రికా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో జట్టు ఆటలో నిలకడ లోపించింది. ఒకప్పటిలా నిలకడైన విజయాలు సాధించలేక పోతోంది. డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో జట్టు బలహీనంగా మారింది. అతినిలా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడే ఆటగాళ్లు దరిదాపుల్లో కనిపించడం లేదు. అతని లేని లోటు ఈసారి జట్టుపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. బ్యాటింగ్ కాస్త ఆందోళన కలిగిస్తున్న బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా పటిష్టంగానే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఇటీవల ముగిసిన ఐపిఎల్ టోర్నమెంట్‌లో రబడా, స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరిస్‌లు నిలకడగా రాణించారు. ఇది జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రబడా, తాహిర్‌లు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో కూడా వీరిద్దరూ జట్టుకు చాలా కీలకంగా మారారు. ఇక, బ్యాటింగ్‌లో ఈసారి కూడా జట్టు భారమంత కెప్టెన్ డుప్లెసిస్‌పైనే ఆధారపడింది. అతను రాణించడంపైనే జట్టు గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. స్టార్ ఆటగాడు హాషిం ఆమ్లా బాధ్యతలు కూడా పెరిగాయి. వన్డేల్లో మెరుగైన ఆటగాడిగా పేరున్న ఆమ్లా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వాడే. అతను విజృంభిస్తే జట్టుకు విజయం నల్లేరుపై నడకే. ఇక, మరో స్టార్ డేవిడ్ మిల్లర్ కూడా సామర్థం మేరకు ఆడక తప్పదు. ఇటీవల ఐపిఎల్‌లో మిల్లర్ నిలకడగానే ఆడాడు. ప్రపంచకప్‌లో మరింత మెరుగ్గా ఆడాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఫెలుక్‌వాయో, డుమిని, క్రిస్ మోరిస్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. వీరంత కలిసికట్టుగా రాణిస్తే సౌతాఫ్రికా మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయం.

south africa will become as weak team in World Cups