Thursday, April 18, 2024

గళపతి

- Advertisement -
- Advertisement -

SP Balasubrahmanyam passed away

 

ఇక్కడి గాలి నిండా నిండిపోయి, హృదయ మృదంగాలను కుదిపేసి, వీనుల్లో నిత్యనివాసమేర్పరచుకున్న సుమధుర గాత్రం ఇక లేదంటే, అది మరెన్నో కొత్తకొత్త హొయళ్ళు పోతూ జనమానాసాలను కవ్వంపట్టే క్షణాలు మరి ఇక ఉండ వంటే చెప్పనలవికాని బాధ. ఐదున్నర దశాబ్దాల నిర్విరామ స్వరఝరి ప్రేమ, భక్తి, జీవనతత్వ గీతాలతో, పద్యాలతో అన్ని వయసులవారి ఆశ్చర్యానందనాలను కట్టకట్టి జేబులో వేసుకున్న విశిష్ట గాయకుడు, పాటల తోటమాలి ఎస్‌పి బాలసుబ్రమణ్యం కరోనాతో దీర్ఘపోరాటం చేసి దానికి బలైపోయాడని తెలిసి లోకం నివ్వెరపోయింది, మృత్యుభీకర నిశ్శబ్దం కమ్మేసింది. నిన్నటి వరకు కోలుకుంటున్నాడనిపించి, ఒక దశలో నెగెటివ్ నిరూపణై ఆశలు రేకెత్తించిన బాలు ఇంతలోనే ఇలా… ఇదేమిటి, ఏమిటీ అన్యాయం అంటూ అందరూ బావురుమంటున్నారు.

మరణించిన తర్వాత ఎవరు ఏమిటో, ఎక్కడో అనే ప్రశ్నలకు ఎవరి సమాధానాలు వారికి ఉంటాయి. అప్పటికే జన హృదయాల్లో శాశ్వత స్థానం పదిలపరచుకున్న వారికి మరణం ఉండదు. ఎస్‌పి బాలసుబ్రమహ్మణ్యం శ్రోతల గుండెల్లో చిరముద్ర వేసుకున్నాడు. ‘మౌనమేలనోయి’ అని అందరినీ తట్టి లేపిన సుస్వరం మౌనమై వెళ్లిపోయింది. మధురాతి మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1974లో కన్నుమూసిన తర్వాత ఆలోటు పూడ్చలేనిదైపోయింది. అప్పటికే ఘంటసాల గళాన్ని అలాగే దించేస్తూ పాడేవాళ్లు ఊరూర వెలిశారు. కాని, బాలసుబ్రమ్మణ్యం అనే బాలు పూర్తిగా తన సొంతమైన, నూటికి వెయ్యిపాళ్లు తనదే అయిన గొంతుతో శ్రోతల హృదయాలను తియ్యగా మీటుతూ వినూత్న శ్రావ్యతను విరగబూశాడు. పాత్రోచితంగా, నటుల గాత్రోచితంగానూ పాడడంలో మాత్రం ఘంటసాలను తలపించాడు.

బాలు స్వరంలో పిల్ల అలల ఏటి మీద పూల పడవలో పయనించే ఏకాంత పథికుల మధుర వేదనలు, సంప్రదాయ జీవన అనుభూతుల మేళవింపు వినేవారిని వశపరచుకుంటుంది. ఇంజినీర్ కాబోయి స్వర చక్కెరలతో హృదయాల మధ్య వంతెనలు నిర్మించిన ‘రంజనీరు’ అయ్యాడు. ఆ రోజుల్లో తెలుగు సినీ ప్రేక్షకులను సినిమా హాళ్ల గేట్లకు కట్టిపడేసిన ‘శంకరాభరణం’ చిత్రంలో శాస్త్రీయంగా సాగిపోయిన మధుర గంభీర గీతాలు బాలు స్వరంలో గమకాలాడిన తీరు అద్భుతం. స్వయంగా పరిపూర్ణ శాస్త్రీయ సంగీతజ్ఞుడు కాకపోయినా కర్ణాటక బాణీల్లోని ఆ పాటలను రక్తికట్టించి జన హృదయాలను దోచుకున్న బాలుకు అవి జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చాయి. రోజూ పలు చిత్రాలకు అనేక పాటలు అలవోకగా వైవిధ్యభరితంగా పాడేసి ఔరా అనిపించాడు. 1981 ఫిబ్రవరి 8న ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 21 కన్నడ పాటలను రికార్డు చేశాడు. ఒకే రోజున 19 తమిళ పాటలు, 16 హిందీ పాటలు పాడడం ఆయనకే తగును.

సంగీత దర్శకత్వం, డబ్బింగ్, నటన, చిత్ర నిర్మాణ రంగాల్లోనూ రాణించాడు. సుప్రసిద్ధ నటుడు కమలహాసన్‌కు మారుగొంతుగా మారుమోగాడు. ‘పాడుతా తీయగా’ వేదికను అనుపమానంగా నిర్వహించి ఎందరో యువగాయకులను, గాయనీమణులను తీర్చిదిద్ది అందించాడు. ‘స్వరాభిషేకం’ కర్తగా జరిపించిన గళ నర్తన అనితర సాధ్యం అనిపించాడు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ , మళయాళ మున్నగు పలు భాషా చిత్ర రంగాలపై తన ముద్ర వేసుకున్నాడు. ‘మిథునం’ తెలుగు చిత్రంలో తనకే సాధ్యమన్న రీతిలో నటించి సంప్రదాయ దాంపత్య జీవనంలోని పరస్పరతను నటి లక్ష్మితో పాటు రక్తికట్టించాడు. ఇళయరాజా బాణీలకు స్వరచరణాలిచ్చి కదం తొక్కించాడు. బాలును గురించి సీనియర్ గాయని జానకి ఏమన్నారో చదవండి ‘ఒకరిని కాపీ చేసే రకం కాదు, ఎటువంటి పాట ఇచ్చినా అటువంటి రీతిలోనే పాడుతాడు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినదానికంటే ఎక్కువగా పాడుతాడు. గ్రహణ (గ్రాస్పింగ్ పవర్) శక్తి ఎక్కువ.

చెప్పిన రెండు నిమిషాల్లోనే పాడేస్తాడు, ఆల్‌రౌండర్.’ ఆరు ఫిలింఫేర్ అవార్డులను ఎన్నో బిరుదులు, పురస్కారాలను అందుకున్న బాలు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్‌ను అలంకరించుకోవడంతో పాటు జన హృదయ పద్మాసనుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సమీపంలో పుట్టి చలన చిత్ర రంగానికి కొంగుబంగారంగా భాసించిన బాలు కమల్‌హాసన్‌కే కాకుండా రజినీకాంత్, సల్మాన్‌ఖాన్, విష్ణువర్దన్, జెమినీ గణేశన్, గిరీశ్‌కర్నాడ్ , అర్జున్, నగేష్, రఘువరన్ వంటి వారికి కంఠం ఇచ్చాడు. ‘ఏక్ దుజే కేలియే’ వంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు చిరస్థాయిని పొందాయి. పదహారు భాషల్లో పాడి 40 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ‘కేలడి కణ్మని’ తమిళ చిత్రంలో నాయకుడుగా నటించాడు. ఇదే తెలుగులో ‘ఓ పాప లాలి’ అనే పేరిట డబ్బింగ్ అయ్యింది. బాలచందర్ దర్శకత్వంలోని ‘మన్మథలీల’ తో డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రవేశించి ఆ రంగంపై శాశ్వత సంతకం చేశాడు. ఇలా బహుముఖ ప్రజ్ఞావంతుడై ప్రేక్షక, శ్రోతలను ఆనంద నాట్యం చేయించిన బాలు మన మధ్య లేకపోవడం తీరని లోటు. ఆయనకు ఘన నివాళి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News