Home జోగులాంబ గద్వాల్ ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యం

ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యం

జోగులాంబ గద్వాల : ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యమని జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సహాయం చేసి  పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకాన్నీ పెంపొదించేలా ప్రతి పోలీసు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో గుట్కా, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడారు.  ప్రతి పోలీస్ స్టేషన్‌లో 5s సిస్టంను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.. కేసుల ఫైళ్లను క్రమ పద్దతిలో అమర్చుకోవాలని తెలిపారు. బ్లూకోల్ట్ , పెట్రోలింగ్ వాహనాలతో ఎల్లప్పుడు గస్తీ తిరుగుతూ ప్రజలకు అందుబాటు ఉండాలన్నారు. పెండింగ్  కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని ఆయన తెలిపారు. నిందితులను అరెస్టు చేసే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులను కలిగించే వ్యక్తులను గుర్తించి వారిపై రౌడీ షీట్స్‌ను తెరవాలని అదేశించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించడంలో ప్రజల కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని, ప్రజలకు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు కృషి చేయాలన్నారు.
గత అసెంబ్లీ , గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నిబద్ధతతో విధులను సమర్ధవంతంగా నిర్వర్తించి ప్రజల మన్నలను పొందిన పోలీస్ అధికారులకు , సిబ్బందిని గురువారం ఎస్పీ ప్రశంస పత్రాలను అందజేశారు . అందులో భాగంగా సిసిఎస్ ఇన్పెక్టర్ జ్ఞానేంద్ర, డిసిఆర్‌బి ఇన్పెక్టర్ సైదా, గద్వాల టౌన్ ఎస్సై సత్యనారాయణ, రాజోళి ఎస్సై రాంమూర్తి , సిసి లోహిత్‌రెడ్డి, పిఆర్‌ఓ సురేష్, ఐటి సెల్ ఇంచార్జీ నాగరాజు, హెచ్‌సి గోపాల్‌రెడ్డి, నరసింహులు, జాకబ్, క్రిష్ణరెడ్డి, పిసిలు వెంకప్ప, స్వామి, రాజ్, రఫీ, నాగేష్, మహేందర్‌గౌడ్, నబి రసూల్, నాగేశ్వర్ రావు తదితరులను ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ, డిఎస్పీ షాకీర్ హుస్సేన్, ఏ ఆర్ డిఎస్పీ భరత్, సిఐ హన్మంతు, శాంతి నగర్ సిఐ గురునాయుడు, అలంపూర్ సిఐ రాజు తదితరులు ఉన్నారు.

SP Review Meeting on Law and Order